IPL 2024: కోహ్లీనే తక్కువ పరుగులు ఇస్తాడేమో.. బెంగళూరు 11 మంది బ్యాటర్లతో ఆడాలి: క్రిష్‌

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో బెంగళూరు విజయాలబాట పట్టాలంటే.. జట్టు, ప్రణాళికల్లో మార్పులు అవసరమని భారత మాజీ క్రికెటర్ కీలక సూచనలు చేశాడు.

Updated : 17 Apr 2024 15:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బౌలింగ్‌ను ఊచకోత కోస్తూ ఎస్‌ఆర్‌హెచ్‌ 287/3 స్కోరు చేసింది. భారీగా పరుగులు ఇచ్చిందంటూ ఆర్సీబీ బౌలింగ్‌ దళంపై తీవ్ర విమర్శలు రేగాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో బెంగళూరు విజయం సాధించాలంటే అందరూ బ్యాటర్లే ఉండాలని.. విరాట్‌తో బౌలింగ్‌ చేయిస్తే ఉత్తమమని వ్యాఖ్యానించాడు. ఇప్పుడున్న బౌలర్ల కంటే కోహ్లీ నయమని పేర్కొన్నాడు. 

‘‘రీస్ టోప్లీను బాదేశారు.. లాకీ ఫెర్గూసన్‌ను కూడా హడలెత్తించారు. ఐపీఎల్‌లో వీరిద్దరూ పెద్దగా ఆకట్టుకోలేదు. కోల్‌కతా నుంచి బెంగళూరుకు ఫెర్గూసన్‌ వచ్చినా ప్రయోజనం లేదు. విల్‌ జాక్స్‌ మాత్రమే ఇప్పుడున్న వారిలో అత్యుత్తమ బౌలర్. అందుకే, బెంగళూరు మొత్తం 11 మంది బ్యాటర్లతో బరిలోకి దిగడం బెటర్. డుఫ్లెసిస్‌ రెండు ఓవర్లు, కామెరూన్ గ్రీన్‌ 4 ఓవర్లు వేయాలి. విరాట్ కూడా కొత్త పాత్ర పోషించాలి. రెగ్యులర్ బౌలర్ల కంటే అతడే తక్కువ పరుగులు ఇస్తాడని భావిస్తున్నా. గతంలోనూ మెరుగ్గానే బౌలింగ్‌ చేశాడు. కాబట్టి, అతడూ నాలుగు ఓవర్లు వేయాలి. చిన్నస్వామి స్టేడియంలో విరాట్‌ను చూస్తుంటే చాలా బాధేసింది. బంతి స్టాండ్స్‌వైపు వెళ్తుంటే కోహ్లీ వాటిని నిరాసక్తిగా చూస్తూ ఉండిపోయాడు. బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు చాలా ఆగ్రహంతో కనిపించాడు. హెడ్‌, క్లాసెన్, అబ్దుల్‌ సమద్ తమ బౌలింగ్‌ను తుత్తునీయలు చేయడంతో తట్టుకోలేకపోయాడు’’ అని శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు. 

ఐపీఎల్‌లో బెంగళూరు ఏడు మ్యాచులను ఆడింది. మరో ఏడు ఆడాల్సి ఉంది. కేవలం ఒక్క విజయంతో 2 పాయింట్లు సాధించిన  బెంగళూరు పట్టికలో అట్టడుగున ఉంది. ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ బెంగళూరు విజయం సాధించాల్సిందే. ఒక్కటి ఓడినా దాదాపు నిష్క్రమించినట్లే. ఒకవైపు జట్టు ఓడిపోతున్నా.. వ్యక్తిగతంగా విరాట్ కోహ్లీ మాత్రం అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం అతడే ఆరెంజ్‌ క్యాప్ హోల్డర్. ఏడు మ్యాచుల్లో 361 పరుగులు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని