Faf du Plessis: బుమ్రా మాకు ఉంటే బాగుండేది.. లేకపోతే కనీసం 250+ స్కోరైనా చేయాలేమో!: డుప్లెసిస్

బెంగళూరుకు బౌలింగ్‌ గుదిబండలా మారింది. ముంబయితో జరిగిన మ్యాచ్‌లోనూ ఆ జట్టు బౌలర్లు పేలవంగా ఆడారు.

Updated : 12 Apr 2024 11:29 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో బెంగళూరు ఆరు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయంతో కొనసాగుతోంది. తాజాగా వాంఖడే వేదికగా ముంబయితో జరిగిన పోరులో 196 పరుగులు చేసినా బౌలర్ల దారుణ ప్రదర్శనతో బెంగళూరుకు (Mumbai Vs Bengaluru) ఓటమి తప్పలేదు. బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్ దూకుడైన హాఫ్ సెంచరీలతోపాటు బుమ్రా బౌలింగ్‌లో అదరగొట్టేశాడు. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే.. మరోవైపు బెంగళూరు పేసర్లు టోప్లీ, సిరాజ్, ఆకాశ్ దీప్‌ భారీగా పరుగులు సమర్పించారు. దీంతో తమ బౌలింగ్‌ యూనిట్‌పై కెప్టెన్ డుప్లెసిస్‌ (Faf Du Plessis) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వారి వైఫల్యం కారణంగా బ్యాటింగ్‌ విభాగంపై తీవ్ర ఒత్తిడి పడుతోందని పేర్కొన్నాడు. తమ జట్టులో బుమ్రా ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించడం గమనార్హం. 

‘‘మేం ప్రతిసారీ 200+ స్కోరు చేస్తేనే మ్యాచ్‌ను గెలిచేందుకు ప్రయత్నించాలేమో అనిపిస్తోంది. మా బౌలింగ్‌ యూనిట్‌లో సరైన వనరులు లేవు. దీంతో బ్యాటింగ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. పవర్‌ ప్లేలో కనీసం రెండు లేదా మూడు వికెట్లు తీస్తేనే మ్యాచ్‌ మా చేతుల్లో ఉండేది. తొలి నాలుగు ఓవర్ల తర్వాత ఎప్పుడూ మ్యాచ్‌లో వెనుకబడిపోతున్నాం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమే. టాస్‌ గెలవడం ముంబయికి కలిసొచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. ముంబయిని ఈ సందర్భంగా అభినందించాలి. మా బౌలర్లు చేసిన తప్పులను అనుకూలంగా మార్చుకొని దూకుడుగా ఆడింది. 

ఈ మ్యాచ్‌లో మంచు ప్రభావం ఉంటుందని తెలుసు. మొదట మేం బ్యాటింగ్‌ చేసినప్పుడు కనీసం 250+ స్కోరునైనా చేయాల్సింది. కానీ, ముంబయి బౌలర్లు మమ్మల్ని 200 పరుగుల్లోపే కట్టడి చేశారు. రజత్‌ పటీదార్‌తో కలిసి చేసిన పార్టనర్‌షిప్‌ను కొనసాగిస్తే బాగుండేది. అతడితోపాటు మ్యాక్స్‌వెల్ త్వరగా ఔట్ కావడం మమ్మల్ని దెబ్బతీసింది. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ దూకుడుగా ఆడేయడంతో ఆ మాత్రం స్కోరునైనా చేయగలిగాం. ఐదు వికెట్లు సాధించిన బుమ్రానే ఇరు జట్ల ఇన్నింగ్స్‌ల్లో ప్రధాన తేడా. బ్యాటర్లుగా మేం ముంబయిపై ఒత్తిడి తెచ్చినా.. బుమ్రా మాత్రమే మమ్మల్ని నిలువరించాడు. వైవిధ్యంగా బంతులేసే నైపుణ్యం అతడి సొంతం. బౌన్సర్లు, స్లో బంతులు, యార్కర్లు.. ఇలాంటి బౌలింగ్‌ చేస్తే ఎంతటి బ్యాటర్‌కైనా కష్టమే. టీ20ల్లో లసిత్ మలింగ అత్యుత్తమ బౌలర్‌. అతడినే మరిపించేలా బుమ్రా బౌలింగ్‌ ఉంది. అలాంటి ఆటగాడు మా జట్టులో ఉంటే చాలా బాగుండేది (నవ్వుతూ). తదుపరి మ్యాచుల్లోనైనా మా బౌలింగ్‌ యూనిట్‌ రాణిస్తుందనే నమ్మకంతో బరిలోకి దిగుతాం’’ అని డుప్లెసిస్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు