IPL 2024: ఐపీఎల్‌పై బెంగళూరు నీటి కరవు ఎఫెక్ట్‌ .. ‘చిన్నస్వామి’కి శుద్ధిచేసిన జలాలు..!

నీటి కరవుతో అల్లాడుతున్న బెంగళూరులో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియంకు నీటి సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.

Published : 21 Mar 2024 11:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరులో ఐపీఎల్‌ (IPL) మ్యాచ్‌లకు నీటి కష్టాలు తప్పడంలేదు. ఈ నగరంలోని ప్రజల అవసరాలకే నీరు లభించని వేళ ఐపీఎల్‌లో భాగంగా నిర్వహించే ఒక్కో మ్యాచ్‌కు 75,000 లీటర్ల నీటి అవసరం ఉంది. ఈ మేరకు కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ విన్నపంపై ది బెంగళూరు వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజ్‌ బోర్డ్‌ (బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ) కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో వేస్ట్‌వాటర్‌ను శుద్ధి చేసి చిన్నస్వామి స్టేడియంకు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ నీటిని కబ్బన్‌ పార్క్‌ వేస్ట్‌ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నుంచి తీసుకోనున్నారు. దీనిపై బీడబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఛైర్మన్‌ రామ్‌ ప్రసాద్‌ మనోహర్‌ మాట్లాడుతూ శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాము సరఫరా చేస్తున్నామని సమర్థించుకొన్నారు. కావేరీ నది, భూగర్భ జలాలను వాడటంలేదన్నారు. 

ఈ ఏడాది వర్షాభావం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, నగరంలో భారీగా నిర్మాణాలు పెరగడంతో నీరు భూమిలోకి చేరే మార్గాలు తగ్గిపోవడం వంటివి బెంగళూరులో నీటి సమస్యకు ప్రధాన కారణాలు. ఫలితంగా నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని రీతిలో నీటి సంక్షోభాన్ని నగరం ఎదుర్కొంటోంది. వైట్‌ఫీల్డ్‌, కేఆర్‌ పురం, ఎలక్ట్రానిక్స్‌ సిటీ, ఆర్‌ఆర్‌ నగర్‌, కేంగేరీ, సీవీ రామన్‌ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ఓ వైపు ఆంక్షలు విధిస్తోన్న అధికారులు.. పొదుపు మార్గం అనుసరించాలని పౌరులకు సూచిస్తున్నారు.

ఐపీఎల్‌ టాప్‌ హీరోలు.. ఈ రికార్డులకు చేరువగా!

ప్రస్తుతం నగరం రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి  కొరతను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇటీవలే పేర్కొన్నారు. వాస్తవానికి బెంగళూరు రోజుకు 260 కోట్ల లీటర్ల నీటిని వాడుతుంది. నగరంలో ఉన్న 14,000 బోర్‌వెల్స్‌లో 6,900 ఎండిపోయాయి. దీంతో నగరంలో కార్‌ వాషింగ్‌, గార్డెన్లకు, నిర్మాణాలకు తాగునీటిని వాడటంపై నిషేధం విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని