IPL 2024: ఐపీఎల్‌ టాప్‌ హీరోలు.. ఈ రికార్డులకు చేరువగా!

ఐపీఎల్‌ (IPL) సందడి మొదలుకానుంది. అభిమానులకు క్రికెట్‌ మజాతోపాటు క్రికెటర్లు తమ వ్యక్తిగత రికార్డులను మెరుగుపర్చుకునేందుకు ఈ టోర్నీ కీలకంగా మారనుంది.

Updated : 21 Mar 2024 16:58 IST

ఈ ఏడాది ఐపీఎల్‌లో (IPL 2024) ఏయే రికార్డులు బద్ధలవుతాయో ఇప్పుడు చెప్పడం కష్టం. అయితే మన స్టార్‌ క్రికెటర్లు కొంతమంది కీలక మైలురాళ్లకు దగ్గరలో ఉన్నారు. ఆ వివరాలు మీ కోసం. 

  1. ‘ఆరు’ కొట్టే జట్టులో: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్, సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీ (MS Dhoni) అరుదైన ఘనతకు చేరువగా ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఆరుసార్లు ట్రోఫీ సాధించిన జట్టు ఏదీ లేదు. సీఎస్కే, ముంబయి ఇండియన్స్‌ ఐదేసి సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. రోహిత్ నాయకత్వంలో ముంబయి ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరూ ఐపీఎల్‌ జట్లకు సారథులుగా వ్యవహరించడం లేదు. కానీ, గెలిచిన జట్టులో సభ్యులుగా ఉండే అవకాశం వీరిద్దరికి ఉంది. ఇప్పటికే ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా ధోనీ నిలిచాడు. మరో 43 పరుగులు చేస్తే.. సీఎస్కే జట్టు తరఫున 5వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు.
  2. అత్యధిక స్కోరర్‌గా కోహ్లీయేనా?: మెగా టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ (Virat Kohli).. మరో అరుదైన రికార్డుకు చేరువగా ఉన్నాడు. ప్రస్తుతం 237 మ్యాచుల్లో 7,263 పరుగులతో ఉన్న కోహ్లీ.. మరో 737 పరుగులు చేస్తే.. 8 వేలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలుస్తాడు. గత 16 సీజన్లలో ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయిన ఆర్సీబీ ఇప్పుడైనా విజేతగా నిలుస్తుందేమో చూడాలి. అలా గెలిచినా ఇదీ రికార్డు అవుతుంది. కోహ్లీ ఈ సీజన్‌లో మరో 13 మ్యాచ్‌లు ఆడితే 250 మ్యాచ్‌ల్లో పాల్గొన్న క్రికెటర్‌గా అవతరిస్తాడు. 
  3. 7 వేల క్లబ్‌లోకి వస్తారా?: ఐపీఎల్‌లో ధోనీ తర్వాత అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma). ఈసారి ముంబయి జట్టు సారథిగా కాకుండా బ్యాటర్‌గా బరిలోకి దిగబోతున్నాడు. ఐపీఎల్‌లో 243 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 6,211 పరుగులు చేశాడు. మరో 789 పరుగులు చేస్తే 7 వేల క్లబ్‌లోకి వస్తాడు. అలాగే ఏడు మ్యాచ్‌లు ఆడితే చాలు 250 మ్యాచ్‌లు ఆడిన బ్యాటర్ల జాబితాలోకి చేరతాడు. శిఖర్ ధావన్‌ (6,617), డేవిడ్ వార్నర్ (6,397) కూడా ఈ లిస్ట్‌లో చేరే అవకాశాలు లేకపోలేదు. 
  4. టీ20ల్లో నంబర్‌ వన్.. సూర్య: ముంబయి బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ (Surya Kumar Yadav) ప్రస్తుతం టీ20ల్లో టాప్‌ ర్యాంకర్‌. దాదాపు నెలన్నర తర్వాత మైదానంలోకి దిగబోతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో 139 మ్యాచ్‌లు ఆడిన సూర్య 3,249 పరుగులు చేశాడు. మరో 751 చేస్తే 4 వేల క్లబ్‌లోకి వస్తాడు. రాజస్థాన్ రాయల్స్‌ కెప్టెన్ సంజూ శాంసన్ (3,888), మనీశ్‌ పాండే (3,808), జోస్ బట్లర్ (3,223) కూడా నాలుగు వేల పరుగులు జాబితాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
  5. ఈసారి సెంచరీలు చేస్తారా?: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) ఇప్పటివరకు 101 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. మొత్తం 2,776 పరుగులు చేసిన అయ్యర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 96. మరో 224 పరుగులు చేస్తే 3 వేల క్లబ్‌లోకి చేరతాడు. ఆర్సీబీ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ మరో 281 పరుగులు చేస్తే 3 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా మారతాడు. ఇతడి అత్యధిక స్కోరు కూడా 95 కావడం విశేషం. 
  6. చాహల్‌.. 200 వికెట్లు తీస్తాడా?: ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ యుజ్వేంద్ర చాహల్ (Chahal). ఇప్పటివరకు 145 మ్యాచుల్లో 187 వికెట్లు పడగొట్టాడు. మరో 13 తీస్తే 200 క్లబ్‌లోకి వస్తాడు. ద్విశతక వికెట్లు సాధించిన ఏకైక బౌలర్‌గా అవతరిస్తాడు. స్టార్‌ పేసర్ బుమ్రా మరో ఐదు వికెట్లు తీస్తే 150 పడగొట్టిన బౌలర్‌గా మారతాడు. ప్రస్తుతం బుమ్రా 120 మ్యాచుల్లో 145 వికెట్లు తీశాడు. గుజరాత్‌ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ కూడా 150కి 11 వికెట్ల దూరంలో ఉన్నాడు. 
  7. డాట్‌ బాల్స్‌లో పోటాపోటీ..: ఎక్కువ డాట్‌బాల్స్‌ వేసిన బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneswar Kumar). ఇప్పటివరకు 160 మ్యాచుల్లో 1,534 బంతులను డాట్‌లుగా వేశాడు. ఆ తర్వాత సునీల్‌ నరైన్ (1,478), రవిచంద్రన్ అశ్విన్ (1,477) ఉన్నారు. మరో 25 బంతులను డాట్‌లుగా వేస్తే 1500+ జాబితాలో చేరతారు. ఆ ఘనత సాధించిన ముగ్గురు బౌలర్లుగా మారతారు. అలాగే భువీ 12 మెయిడిన్‌ ఓవర్లు విసిరాడు. ఈ జాబితాలో మాజీ పేసర్ ప్రవీణ్‌ కుమార్‌ టాప్. అతడు 14 మెయిడిన్లు చేశాడు. భువనేశ్వర్‌ మరో 3 ఓవర్లలో పరుగులేమీ ఇవ్వకపోతే అగ్రస్థానంలోకి వస్తాడు. 
  8. మరో 4 క్యాచ్‌లు పడితే..: ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యధిక క్యాచ్‌లు అందుకొన్న ప్లేయర్‌గా అవతరించాలంటే మరో నాలుగు అందుకోవాలి. ప్రస్తుతం ఈ రికార్డు సురేశ్‌ రైనా (Suresh Raina) పేరిట ఉంది. 205 మ్యాచుల్లో 109 క్యాచ్‌లు పట్టాడు. విరాట్ (106), కీరన్ పొలార్డ్ (103) ఉండగా.. రోహిత్ శర్మ (98), రవీంద్ర జడేజా (97), ధావన్ (96) సెంచరీకి చేరువగా ఉన్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని