Bengaluru Vs Rajasthan: మా స్పెషాలిటీ చూపించలేకపోయాం.. ‘ఇంపాక్ట్‌’ రూల్‌తో ఆ స్కోరు సరిపోదు: డుప్లెసిస్‌

Bengaluru Vs Rajasthan: కీలక ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ చేతిలో బెంగళూరు ఓటమిపాలై టోర్నీ నుంచి బయటకొచ్చింది. ఈ సందర్భంగా తమ ప్లేయర్ల ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్‌ డుప్లెసిస్‌ మరో 20 పరుగులు చేసుండాల్సిందని అభిప్రాయపడ్డాడు.

Updated : 23 May 2024 10:18 IST

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-17లో బెంగళూరు కథ ముగిసింది. ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ టీమ్‌ చేతిలో ఓటమి చవిచూసింది. ‘‘ఈసారి కప్‌ మనదే’’ అన్న ఆ జట్టు అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. పరాజయంపై ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ డెప్లెసిస్‌ (Faf du Plessis) స్పందించాడు. విజయం కోసం మరికొన్ని పరుగులు చేసుండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తమ జట్టు గొప్ప పోరాట పటిమను ప్రదర్శించిందని ఆటగాళ్లను కొనియాడాడు.

‘‘పిచ్‌పై మంచు ప్రభావం ఉండటంతో.. మరికొన్ని పరుగులు చేసుండాల్సిందని అనుకున్నాం. మంచి స్కోరుకు 20 పరుగుల దూరంలో ఆగిపోయినట్లు అనిపించింది. మా టీమ్‌ అద్భుతంగా పోరాడింది. పిచ్‌ను పరిశీలిస్తే ఎవరైనా దీంట్లో 180 మంచి స్కోరని అంచనా వేస్తారు. కానీ, ఇంపాక్ట్‌ ప్లేయర్ వంటి మార్పుల నేపథ్యంలో ఈ సీజన్‌లో సాధారణ స్కోర్‌తో సరిపెట్టుకుంటే కుదరదు. అయినప్పటికీ మా ప్లేయర్ల పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. వరుసగా ఆరు విజయాలు అంత సులభమైన విషయం కాదు. అంతలా పుంజుకోవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది. కానీ, మరో 20 పరుగులు చేయడంలో మాత్రం ఈరోజు మా ప్రత్యేకతను నిలబెట్టుకోలేకపోయాం’’ అని మ్యాచ్‌ అనంతరం డుప్లెసిస్‌ అన్నాడు.

దినేశ్‌ కార్తిక్‌..ఆ ఎల్బీ నాటౌటా?

టీమ్‌లో అందరూ ఫిట్‌గా లేరు: సంజూ

తమ ప్లేయర్లలో కొంత మంది పూర్తి ఫిట్‌నెస్‌తో లేరని రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) తెలిపాడు. బెంగళూరుపై గెలుపుతో వారంతా తిరిగి ఫామ్‌లోకి వచ్చారని వెల్లడించాడు. ‘‘అన్ని రోజులూ ఒకేలా ఉండవని క్రికెట్‌తో పాటు జీవితం మాకు నేర్పింది. తిరిగి పుంజుకోవడం చాలా ముఖ్యం. మా ఆటతీరుపై నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ఘనత ప్లేయర్లకే దక్కుతుంది. కుమార సంగక్కర, సపోర్టింగ్‌ స్టాఫ్‌ సహకారం మరువలేనిది. అశ్విన్‌, ఆవేశ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. బ్యాటింగ్‌లో అంతా యువకులే అయినప్పటికీ గొప్పగా ఆడారు. మాలో అందరూ ఫిట్‌గా లేరు. డ్రెస్సింగ్ రూమ్‌లో కొంత మంది దగ్గుతూ, ఇబ్బంది పడ్డారు. కానీ, ఇప్పుడు అందరం పుంజుకున్నాం’’ అని శాంసన్‌ వెల్లడించాడు.

మ్యాచ్‌ విషయానికి వస్తే కీలక ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దూకుడుగానే ఆట ప్రారంభించిన బెంగళూరు ప్లేయర్లు భారీ స్కోర్‌ చేయడంలో మాత్రం విఫలమయ్యారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. రజత్‌ పటీదార్‌ (34), విరాట్‌ (33), మహిపాల్‌ లొమ్రార్‌ (32) ఫర్వాలేదనిపించారు. అశ్విన్‌ (2/19), అవేష్‌ ఖాన్‌ (3/44), బౌల్ట్‌ (1/16) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో రాజస్థాన్‌ 6 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. యశస్వి జైస్వాల్‌ (45), రియాన్‌ పరాగ్‌ (36) రాణించారు. సిరాజ్‌ (2/33) మెరిశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని