IPL 2024: సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు

ఉత్కంఠ పరిస్థితుల్లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న బెంగళూరు ఆటగాళ్లు సంబరాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకు కాస్త సమయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

Updated : 20 May 2024 12:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌లో సంచలన విజయంతో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. చివరి ఓవర్‌లో 18 పరుగులు చేస్తే చెన్నై నాకౌట్‌కు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఆర్సీబీ బౌలర్ యశ్‌ దయాళ్ ఏడు పరుగులే ఇచ్చి ఎంఎస్ ధోనీ (MS Dhoni) వికెట్‌ను తీశాడు. దీంతో సంబరాల్లో మునిగిపోయిన బెంగళూరు ఆటగాళ్లు.. చెన్నై ప్లేయర్లతో కరచాలనం చేసేందుకూ కాస్త సమయం తీసుకున్నారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ధోనీ మైదానంలోకి వచ్చి వారి కోసం వేచి చూశాడు. అయితే, ఎంతకూ రాకపోవడంతో అక్కడున్న వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చి డగౌట్‌కు వెళ్లిపోయాడు. దీంతో సోషల్ మీడియాలో ఎంఎస్‌డీ తీరును ప్రశ్నిస్తూ కొందరు కామెంట్లు చేశారు. ఆ తర్వాత ధోనీ వద్దకు విరాట్ వెళ్లినట్లు వీడియోలు ట్రెండింగ్‌గా మారాయి. అయితే, ఈ విషయంలో ఆర్సీబీ ఆటగాళ్లు సంబరాలను కాసేపు పక్కన పెట్టి కరచాలనం ఇచ్చేందుకు వెళ్లి ఉంటే బాగుండేదని మాజీ క్రికెటర్ మైకెల్‌ వాన్‌తోపాటు క్రికెట్ విశ్లేషకుడు హర్షా భోగ్లే వ్యాఖ్యానించారు.

‘‘నేను మ్యాచ్ అయిన తర్వాత కూడా అంతా చూశా. ఆర్సీబీ జట్టు చాలా ఎంజాయ్‌ చేసింది. అభిమానులకు చేతులు ఊపుతూ సంతోషించారు. ఇప్పుడేమీ వారు ఐపీఎల్‌ టైటిల్‌ను గెలిచిన స్థితిలో లేరు. కానీ, ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంతో ముందుడుగు వేసినట్లు ఆనందపడ్డారు. టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించే ప్రమాదం నుంచి బయపడటంతో సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కరచాలనం చేసే సమయం కూడా లేనట్లుంది. ఇప్పుడు వారు చేసిన దానికి పశ్చాత్తాప పడతారా? ధోనీకిదే చివరి మ్యాచ్‌ అయ్యేదేమో? ఎవరికి తెలుసు. ఆటగాళ్లందరూ అతడి చుట్టూ చేరి ఒక్కక్షణం కరచాలనం చేసి ఉంటే బాగుండేది. అక్కడ దిగ్గజ క్రికెటర్ మీ కోసం వేచి చూశాడు. ఒక్కసారి అతడిని కలిశాక.. మీ సంబరాలు చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఆర్సీబీ ప్లేయర్‌గా మీరు అతడి వీడ్కోలును కోరుకోకపోయినా.. కనీసం మ్యాచ్‌ ముగిసిన తర్వాత గౌరవార్థం కరచాలనం చేసి ఉన్నా మర్యాదగా ఉండేది’’ అని మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు. 

ఎలాంటి సందర్భమైనా కరచాలనం చేయాల్సిందే: భోగ్లే

‘‘నేను అక్కడ ఏం జరిగిందో గమనించలేదు. కానీ, మీరు వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో విజేతగా నిలిచినా సరే.. మీ భావోద్వేగాలను ప్రదర్శించడంలో తప్పేంలేదు. కానీ, ప్రత్యర్థి ఆటగాళ్లతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేయాలి. క్రికెట్‌ గొప్పదనాన్ని తెలిపేందుకు ఇదొక మార్గం. మ్యాచ్‌లోనే పోరాడుతాం.. మేం విరోధులం కాదు అని తెలియజేసేందుకే ఈ కరచాలనం సంస్కృతిని తీసుకొచ్చారు. ఒక్కసారి ఆ ప్రక్రియ ముగిసిన తర్వాత మీ సంబరాలను ఎంతసేపైనా నిర్వహించుకోవచ్చు’’ అని భోగ్లే తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు