ఐపీఎల్‌ 2024: చెలరేగిన కోహ్లీ.. ఖాతా తెరిచిన బెంగళూరు

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడా గెలిచి బోణీ కొట్టింది. విరాట్‌ కోహ్లీ (77: 49 బంతుల్లో) అర్ధశతకంతో చెలరేగగా, చివర్లో డీకే(28), లామ్రోర్‌ (17*) జట్టును విజయతీరాలకు చేర్చారు.  

Updated : 25 Mar 2024 23:51 IST

బెంగళూరు:ఐపీఎల్‌ (IPL 2024) 17వ సీజన్‌లో బెంగళూరు (Bengaluru) ఖాతా తెరిచింది. పంజాబ్‌ (Punjab)తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్‌ కోహ్లీ (77; 49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. చివర్లో కాస్త ఉత్కంఠ ఏర్పడినా.. దినేశ్ కార్తిక్‌ (28*; 10 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మహిపాల్ లామ్రోర్ (17*; 8 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి నాలుగు బంతులు మిగిలుండగానే బెంగళూరును విజయతీరాలకు చేర్చారు. పంజాబ్‌ బౌలర్లలో కగిసో రబాడ 2, హర్‌ప్రీత్ బ్రార్‌ 2, హర్షల్ పటేల్, సామ్‌ కరన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

కింగ్ మెరుపులు.. చివర్లో ఉత్కంఠ

177 పరుగుల లక్ష్యఛేదనలో డుప్లెసిస్ (3), కామెరూన్‌ గ్రీన్‌ (3), మ్యాక్స్‌వెల్ (3) తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరారు. కానీ, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. రెండుసార్లు జీవదానం లభించిన తర్వాత మరింత చెలరేగాడు. అతడు 31 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీ.. హర్షల్ పటేల్ వేసిన 16 ఓవర్‌లో రెండు ఫోర్లు బాది అదే ఓవర్‌లో చివరి బంతికి హర్‌ప్రీత్ బ్రార్‌కు చిక్కాడు. సామ్ కరన్‌ వేసిన తర్వాతి ఓవర్‌లోనే అనుజ్ రావత్ (11) ఔటయ్యాడు. దీంతో బెంగళూరు శిబిరంలో ఆందోళన మొదలైంది. చివరి రెండు ఓవర్లలో 23 పరుగులు అవసరం కాగా..  అర్ష్‌దీప్‌ వేసిన 18 ఓవర్లో మహిపాల్ లామ్రోర్‌ వరుసగా సిక్స్‌, ఫోర్ బాదాడు. హర్షల్ పటేల్ వేసిన 19 ఓవర్‌లో దినేశ్‌ కార్తిక్ ఫోర్‌, సిక్స్‌ రాబట్టాడు. దీంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 10గా మారగా.. సిక్స్‌, ఫోర్‌తో కార్తిక్‌ ఫినిషింగ్ టచ్‌ ఇచ్చాడు. 

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (45: 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్. ప్రభ్‌సిమ్రాన్‌ (25), జితేశ్‌ శర్మ (27), సామ్‌ కరన్‌ (23), శశాంక్‌ సింగ్‌ (21) విలువైన పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్‌, మ్యాక్స్‌వెల్ తలో రెండు వికెట్లు తీయగా.. యశ్‌ దయాల్‌, అల్జారీ జోసెఫ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని