Mumbai Indians: హార్దిక్.. అంత వీజీ కాదు

గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తిరిగి ముంబయి ఇండియన్స్‌కు చేరుకుని కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.

Updated : 19 Mar 2024 16:18 IST

గుజరాత్ టైటాన్స్‌ ఐపీఎల్‌ (IPL)లోకి అడుగుపెట్టిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. జట్టు అంత గొప్పగా కనిపించకపోయినా.. నిలకడైన ప్రదర్శనతో టైటిల్ గెలిచింది. రెండో సీజన్లోనూ ఫైనల్ చేరి రన్నరప్ అయింది. ఈ ప్రదర్శన వెనక హార్దిక్ పాండ్య (Hardik Pandya) స్ఫూర్తివంతమైన నాయకత్వం ఉందనడంలో సందేహం లేదు. ఆటగాడిగా బ్యాటుతో, బంతితో రాణించడమే కాక.. కెప్టెన్‌గా జట్టును సమష్టిగా నడిపించి గుజరాత్‌ను గొప్పస్థాయిలో నిలబెట్టాడు హార్దిక్. కానీ అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో అతను గుజరాత్‌ను వదిలేసి ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) గూటికి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. పట్టుబట్టి ముంబయి కెప్టెన్ అయ్యాడు కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టును నడిపించడం అతడికి కఠిన సవాలు కాబోతోంది.

గుజరాత్‌ జట్టును రెండేళ్ల పాటు ఎంత బాగా నడిపించినా.. అక్కడంతా బాగానే ఉన్నా.. తన మాతృ జట్టయిన ముంబయి వైపే హార్దిక్ మనసు లాగింది. 2022 సీజన్‌కు తనను అట్టిపెట్టుకోకపోవడం రుచించక వేలానికి వెళ్లి గుజరాత్ సొంతమైన హార్దిక్.. కెప్టెన్‌గా అందరూ ఆశ్చర్యపోయే రీతిలో గుజరాత్‌ను నడిపించాడు. కొన్నేళ్ల పాటు గుజరాత్‌తోనే అతడి ప్రయాణం సాగుతుందని అనుకుంటే.. ఉన్నట్లుండి ఈ సీజన్ ముంగిట ముంబయి యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి ఆ జట్టు కెప్టెన్‌ అయిపోయాడు హార్దిక్. ఇది ఎవరూ ఊహించని పరిణామం. కెప్టెన్సీ ఇస్తేనే ముంబయితో కలుస్తాననే ప్రపోజల్ పెట్టి మరీ హార్దిక్ ఆ జట్టులోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌ను సారథిని చేయడం ముంబయి అభిమానులకు రుచించలేదు. కానీ గత రెండు సీజన్లలో ముంబయి పేలవ ప్రదర్శన చేయడం, రోహిత్ కెరీర్ చరమాంకానికి రావడంతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముంబయి హార్దిక్‌కే పగ్గాలు అప్పగించింది.

సమన్వయం సాధిస్తాడా?

హార్దిక్ పాండ్యకు ముంబయి జట్టు కొత్త కాదు. ఆరేళ్ల పాటు ఆ జట్టుకు ఆడాడు. అక్కడి సహచరులు, కోచింగ్ సిబ్బంది అతడికి బాగా అలవాటే. కానీ ఇంతకుముందు ఆటగాడిగా ఆ జట్టుకు ఆడటం వేరు. ఇప్పుడు కెప్టెన్‌గా జట్టుతో సాగడం వేరు. కెప్టెన్‌గా జట్టుకు అయిదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్‌కు పగ్గాలు అందించడం ముంబయి సహచరులకే రుచించలేదు. హార్దిక్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్ ఆటగాళ్లు తమ అసంతృప్తిని సోషల్ మీడియా ద్వారా చెప్పకనే చెప్పేశారు. రోహిత్ సైతం ఈ విషయంలో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో మెజారిటీ జట్టు హార్దిక్‌ను కెప్టెన్‌గా అంగీకరించట్లేదన్న చర్చ జరిగింది. సహచరుల మద్దతు లేకుండా కెప్టెన్ అయిన హార్దిక్‌కు వారితో సమన్వయం సాధించి సమష్టిగా జట్టును నడిపించడం సవాలే. ముఖ్యంగా రోహిత్‌తో అతనెలా డీల్ చేస్తాడన్నది ఆసక్తికరం. రోహిత్ తర్వాత తమకు పగ్గాలు అందుతాయని సూర్యకుమార్, బుమ్రా లాంటి వాళ్లు కూడా ఆశలు పెట్టుకుని ఉండొచ్చు. అలాంటి వారి అసంతృప్తిని చల్లార్చాలి. మరోవైపు కొన్నేళ్లుగా ముంబయి ప్రదర్శన ఆశాజనకంగా లేదు. మలింగ, పొలార్డ్ లాంటి ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాక సమతూకం దెబ్బతింది. ఈసారి తుది జట్టు కూర్పులోనూ నేర్పుగా వ్యవహరించాలి. ఈనేపథ్యంలో జట్టులో సమన్వయం సాధించి సమష్టిగా సత్తా చాటేలా చేయడమే కాక.. ఆటగాడిగా తాను రాణించి జట్టులో స్ఫూర్తి నింపడం హార్దిక్‌కు అంత తేలికైన విషయం కాదు. మరి ఈ సవాలును అతనెలా అధిగమిస్తాడో చూడాలి.

అభిమానుల సంగతేంటి?

రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించడంతో ముంబయి జట్టుకు జరిగిన డ్యామేజీ అంతాఇంతా కాదు. కొన్ని రోజుల వ్యవధిలో సోషల్ మీడియాలో లక్షల మంది ఆ జట్టును అన్‌ఫాలో చేశారు. ఇప్పటికీ వారి అసంతృప్తి చల్లారట్లేదు. హార్దిక్ కింద రోహిత్‌ ఆడడాన్ని వాళ్లు అసలు ఊహించుకోలేకపోతున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ముంబయి యాజమాన్యం ఇంకొంచెం పద్ధతిగా డీల్ చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. జట్టుకు అయిదు కప్పులు అందించిన రోహిత్ పై ముంబయి యాజమాన్యం అవమానకరంగా వ్యవహరించిందని అభిమానులు బాధ పడుతున్నారు. రోహిత్ కెప్టెన్‌గా లేని ముంబయిని వాళ్లు ఓన్ చేసుకోలేకపోతున్నారు. ఫలితాలతో సంబంధం లేకుండా గత సీజన్ వరకు లీగ్‌లో అత్యంత ఆదరణ ఉన్న జట్లలో ఒకటిగా ఉండేది ముంబయి. కానీ ఇప్పుడు ఫాలోయింగ్ బాగా దెబ్బతింది. ఆటగాడిగా రోహిత్ జట్టులో కలిసిపోయి హార్దిక్‌తో స్నేహపూర్వకంగా ఉంటే.. కెప్టెన్సీ మార్పు సామరస్యపూర్వకంగానే జరిగిందని చెబితే.. అభిమానులు ముంబయికి బాసటగా నిలవాలని కోరితే తప్ప ఒకప్పట్లా ఆ జట్టును ఆదరించడం కష్టమే.

- ఈనాడు క్రీడావిభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని