World Cup: ప్రపంచకప్‌లో మేటి జట్లను కంగుతినిపించిన చిన్న జట్లు..

ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ (England)కు గట్టి షాక్. పసికూన అఫ్గానిస్థాన్‌ చేతిలో ఓ జట్టు ఓటమిపాలైంది. గతంలోనూ పెద్ద జట్లు చిన్న టీమ్‌ల చేతిలో ఓడిన సందర్భాలున్నాయి. వాటిపై లుక్కేద్దాం. 

Updated : 16 Oct 2023 12:59 IST

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో కొన్నిసార్లు అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన జట్లూ మేటి జట్లకు షాకిస్తాయి. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అదే జరిగింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ (England)ను ఇప్పుడిప్పుడే బలమైన జట్టుగా ఎదుగుతున్న అఫ్గానిస్థాన్‌ (Afghanistan) చిత్తుగా ఓడించింది. దీంతో వన్డే ప్రపంచకప్‌ (World Cup)లో.. టెస్టులు ఆడే 11 దేశాలతో ఓటమిపాలైన తొలి జట్టుగా ఇంగ్లిష్‌ జట్టు అనవసరపు రికార్డును మూటగట్టుకుంది. మరి ప్రపంచకప్‌లో ఇప్పటివరకు పెద్ద జట్లను కంగుతినిపించిన చిన్న టీమ్‌ల గురించి తెలుసుకుందాం.

మొదటి దెబ్బ మనదే

ప్రపంచకప్‌ చరిత్రలో పెద్ద జట్టును ఓడించిన మొదటి జట్టు టీమ్‌ఇండియా (Team India)నే. 1983లో విశ్వవిజేతగా నిలిచిన భారత్‌.. ఆ సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగింది. వెస్టిండీస్‌, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలతో పోలిస్తే మన జట్టు బలహీనంగానే ఉంది. వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని ‘హ్యాట్రిక్‌’పై కన్నేసిన వెస్టిండీస్‌కు భారత్ షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ దశలో విండీస్‌తో రెండుసార్లు తలపడగా.. మొదటి మ్యాచ్‌లో భారత్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో మాత్రం విండీస్ 66 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే ఎడిషన్‌ తొలి సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను భారత్ 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఫైనల్‌లో వెస్టిండీస్, భారత్ మరోసారి తలపడగా.. భారత్ 43 పరుగుల తేడాతో జయకేతనం ఎగరేసి తొలి ప్రపంచకప్‌ను ఎగరేసుకుపోయింది.

ఆసీస్‌కు జింబాబ్వే షాక్‌

1983లోనే మరో సంచలన విజయం నమోదైంది. పసికూన జింబాబ్వే.. బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 60 ఓవర్లలో (అప్పట్లో 60 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేవారు) 6 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. 
అనంతరం ఆసీస్‌ను 226/7కే పరిమితం చేసి చారిత్రాక విజయాన్ని అందుకుంది.

అనామక జట్టు.. విండీస్‌ చిత్తు..

1996 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను ఓడించి కెన్యా సంచలనం సృష్టించింది. పుణె వేదికగా జరిగిన మ్యాచ్‌లో కెన్యా 73 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్‌ చరిత్రలో టెస్టు హోదా ఉన్న జట్టును నాన్‌ టెస్టు టీమ్‌ ఓడించడం ఇదే తొలిసారి. తొలుత బ్యాటింగ్ చేసిన కెన్యా 49.3 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్‌ కాగా.. లక్ష్యఛేదనలో వెస్టిండీస్‌ 93 పరుగులకే కుప్పకూలింది.

పాక్‌, భారత్‌పై 

1996 ప్రపంచకప్‌లో తన కంటే బలమైన పాకిస్థాన్‌ జట్టును బంగ్లాదేశ్ కంగుతినిపించింది. మొదట బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేయగా.. బంగ్లా బౌలర్ల ధాటికి పాక్‌ 161 పరుగులకే చేతులేత్తేసింది. బంగ్లాదేశ్.. 2007లో టీమ్‌ఇండియాకూ షాకిచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49.3 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. సౌరభ్ గంగూలీ (66), యువరాజ్‌ సింగ్ (47) మాత్రమే రాణించారు. ఈ లక్ష్యాన్ని బంగ్లా 9 బంతులు మిగిలుండగా ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

దంచికొట్టినా.. ఐర్లాండ్ వదల్లేదు

2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. కెవిన్ ఓబ్రియన్ (113; 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు శతకం బాదాడు. అతడు 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ శ్రీలంకపై 49 బంతుల్లో సెంచరీ చేసే వరకు ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు అతడి పేరు మీదే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని