IND vs AUS: 32 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌

ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్న బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని ఐదు టెస్టుల సిరీస్‌గా నిర్వహించనున్నారు.

Published : 25 Mar 2024 18:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య ఎంతో ప్రతిష్ఠాత్మక సిరీస్‌ బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ సిరీస్‌లో మార్పు చోటుచేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌గా దీన్ని నిర్వహించనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకూ ఎక్కువగా నాలుగు టెస్టుల సిరీస్‌గా దీన్ని నిర్వహించారు. ఇలా రెండు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ నిర్వహించడం 32 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 

‘‘1991-92 తర్వాత తొలిసారి భారత్‌-ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనున్నాయి. పొడిగించిన బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తాం’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా, బీసీసీఐ సంయుక్తగా ఎక్స్‌లో పోస్టు చేశాయి.

ఈ ఏడాది నవంబర్‌లో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. పెర్త్‌లో తొలి టెస్టు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు మ్యాచ్‌లకు ఆడిలైడ్‌, బ్రిస్బేన్‌లు వేదికలు కానున్నట్లు సమాచారం. బాక్సింగ్‌ డే టెస్టు మెల్‌బోర్న్‌ వేదికగా.. చివరి టెస్టు సిడ్నీలో జరిగే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.

ఈ రెండు జట్ల మధ్య జరిగిన గత నాలుగు సిరీస్‌ల్లో టీమ్‌ఇండియానే వరుసగా విజేతగా నిలిచింది. ఇందులో రెండు సిరీస్‌ల్లో ఆసీస్‌ను వారి సొంత గడ్డపైనే ఓడించడం విశేషం. అయితే.. గత ఏడాది లండన్‌లో జరిగిన WTC ఫైనల్‌లో మాత్రం భారత్‌ను ఆస్ట్రేలియా ఓడించి గదను ఎగరేసుకుపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని