Virat Kohli: బ్యాటింగ్‌ ఆర్డర్‌ను బట్టే స్ట్రైక్‌రేట్‌..: కోహ్లీ ఇన్నింగ్స్‌పై లారా కీలక వ్యాఖ్యలు

ఒక్కడే బ్యాటింగ్‌ భారం మోస్తున్న విరాట్ కోహ్లీ.. బెంగళూరు సాధిస్తున్న స్కోరులో అగ్రభాగం అతడిదే. కొన్నిసార్లు నెమ్మదిగా ఆడుతుండటంపై విమర్శలూ ఎదుర్కోవాల్సిన పరిస్థితి.

Published : 09 Apr 2024 17:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాజస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించినా విరాట్ కోహ్లీ (Virat Kohli) మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురికావాల్సి వచ్చింది. తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడని.. టీ20ల్లో అలా ఆడటం సరైంది కాదని కామెంట్లు చేశారు. ఐపీఎల్‌లో రెండో అత్యంత నెమ్మదైన సెంచరీగా (67 బంతుల్లో) ఇది నిలిచింది. ప్రస్తుత సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా కొనసాగుతున్న ఆటగాడు కోహ్లీనే. ఐదు మ్యాచుల్లో 316 పరుగులతో ఇతర బ్యాటర్లకు చాలా దూరంలోనే ఉన్నాడు. కోహ్లీ ఆటతీరుపై వస్తున్న విమర్శలపై వెస్టిండీస్‌ స్టార్‌ బ్రియాన్‌ లారా స్పందించాడు. గణాంకాలు కంటే అతడి ఇన్నింగ్స్‌ అత్యంత విలువైందని వ్యాఖ్యానించాడు. వచ్చే పొట్టి కప్‌లో కోహ్లీ ఉండాల్సిందేనని స్పష్టం చేశాడు. 

‘‘స్ట్రైక్‌రేట్‌ అనేది ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఓపెనర్‌గా వచ్చినవారి స్ట్రైక్‌రేట్‌ 130-140 మధ్యలో ఉన్నా గొప్పదే. అదే మిడిలార్డర్‌లో వస్తే మాత్రం 150+ ఉండాల్సిందే. ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌ చివర్లో చాలామంది బ్యాటర్లు 200+ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబడుతున్నారు. ఇక విరాట్ కోహ్లీ విషయానికొస్తే.. అతడు ఓపెనర్‌గా 130 స్ట్రైక్‌రేట్‌తో ప్రారంభిస్తున్నాడు. చివరికి 160 దగ్గరగా వస్తున్నాడు. ఒక్క ఆటగాడు మాత్రమే రాణిస్తే మ్యాచ్‌ గెలవడం కష్టం. జట్టులోని మిగతావారూ భాగస్వామ్యం అందించాలి. బెంగళూరు జట్టులో అదే లోపించింది. బౌలింగ్‌ కూడా బలంగా లేదు. 

టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ జట్టులో విరాట్ కోహ్లీ తప్పకుండా ఉండాలి. అయితే, ఓపెనర్‌గా రోహిత్‌తో కోహ్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించొద్దు. రోహిత్‌తో కలిసి యువ బ్యాటర్‌ను పంపించాలి. అప్పుడే వారి దూకుడును ప్రత్యర్థులపై ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అనుభవం కలిగిన ప్లేయర్లు మిడిలార్డర్‌లో ఉండటం అత్యంత కీలకం. సీనియర్‌ ఆటగాళ్లందరూ టాప్‌లోనే ఉంటే జట్టు సమతూకంగా ఉండదు. త్వరగా వారు ఔటైతే ఆ ప్రభావం కుర్రాళ్ల ప్రదర్శనపై పడుతుంది. అందుకే, విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో వస్తే అతడి నుంచి మంచి ఇన్నింగ్స్‌లను మనం ఆశించొచ్చు’’ అని లారా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని