SuryaKumar Yadav: రెండేళ్ల నుంచి బుమ్రాను నెట్స్‌లోనూ ఎదుర్కోలేదు.. కారణమదే: సూర్యకుమార్‌

సూర్యకుమార్‌ యాదవ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. బెంగళూరుపై ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు.

Published : 12 Apr 2024 17:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ముంబయి బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్ (SuryaKumar Yadav) తన రెండో మ్యాచ్‌ ఆడాడు. దిల్లీపై అనూహ్యంగా డకౌట్‌గా పెవిలియన్‌కు చేరిన టీ20 టాప్ బ్యాటర్ .. బెంగళూరుపై వీరవిహారం చేశాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లినప్పుడు గాయపడ్డాడు. ఆ తర్వాత ఏ సిరీస్‌లోనూ ఆడలేదు. ఇప్పుడు ఐపీఎల్ ఎడిషన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మళ్లీ తన పూర్వ ఫామ్‌ను అందుకోవడంపై సూర్యకుమార్‌ స్పందించాడు. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘వాంఖడే స్టేడియంలో మళ్లీ హాఫ్ సెంచరీ సాధించడం బాగుంది. టోర్నమెంట్ ప్రారంభమైనప్పుడు నా మనసంతా ఇక్కడే ఉంది. గాయం నుంచి కోలుకోవడానికి బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉండిపోయా. ఇంకెప్పుడూ అలా జరగకూడదని బలంగా కోరుకుంటున్నా. ఈ మ్యాచ్‌లో దాదాపు 200 టార్గెట్‌ను ఛేదించాం. మంచు ప్రభావం ఉంటుందని తెలుసు. దీంతో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఎలాంటి అవకాశాలను వదులుకోలేదు. రోహిత్ - ఇషాన్ కిషన్ తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యంతో మా పని ఇంకా తేలికైంది. రన్‌రేట్‌ను దృష్టిలోఉంచుకుని త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆడా. భారీ షాట్లను నెట్స్‌లో విపరీతంగా ప్రాక్టీస్‌ చేస్తా. బుమ్రా బౌలింగ్‌ మాకు అత్యంత బలం. అతడిని గతంలో నెట్స్‌లో ఎదుర్కొనేవాడిని. కానీ, గత రెండేళ్లుగా ప్రాక్టీస్‌ సెషన్స్‌లోనూ ఆడటం లేదు. ఎందుకంటే, అతడు నా బ్యాట్‌నైనా విరగ్గొడతాడు. లేకపోతే నా పాదాలనైనా బ్రేక్‌ చేస్తాడు’’ అని సూర్య వ్యాఖ్యానించాడు. 

బుమ్రా బౌలింగ్‌కు రేటింగ్ ఇవ్వడమా?: రజత్‌

ముంబయితో మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటర్ రజత్ పటీదార్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొన్ని మ్యాచుల్లో విఫలమైన అతడు మళ్లీ ఫామ్‌ను అందుకొన్నాడు. ఈసందర్భంగా బుమ్రా బౌలింగ్‌ (5/21)కు ఎంత రేటింగ్‌ ఇస్తావని ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ‘‘బుమ్రా బౌలింగ్‌కు ఎవరూ రేటింగ్‌ ఇవ్వలేరు. అతడు లెజండరీ బౌలర్. పర్‌ఫెక్ట్ బౌలర్. బుమ్రా బౌలింగ్‌ గురించి చెప్పడానికి ఇంతకంటే మాటలు రావడం లేదు’’ అని పటీదార్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని