T20 World Cup 2024: టాప్‌ వికెట్‌ టేకర్ జస్‌ప్రీత్ బుమ్రా.. టాప్‌ స్కోరర్‌ ట్రావిస్ హెడ్‌: పాంటింగ్‌

టీమ్‌ఇండియా స్టార్ పేసర్ బుమ్రాపై భారీ అంచనాలు ఉన్నాయని, వాటిని అందుకోగల సత్తా అతడికి ఉందని ఆసీస్‌ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ వ్యాఖ్యానించాడు.

Published : 30 May 2024 17:46 IST

ఇంటర్నెట్ డెస్క్: జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ప్రారంభం కానుంది. ఈసారి విజేత ఎవరు అనేది పక్కనపెడితే.. మొత్తం 20 జట్లు బరిలో నిలిచాయి. ఇందులో సగం జట్ల నుంచి ఏవైనా సంచలనాలు నమోదైతే టోర్నీ ఆసక్తికరంగా మారడం ఖాయం. హాట్‌ ఫేవరెట్లుగా భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాతోపాటు విండీస్‌ కూడా ఉంది. ఇక మెగా సంగ్రామంలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్‌, ఎక్కువ పరుగులు చేసే బ్యాటర్ ఎవరనేది ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వెల్లడించాడు. 

‘‘టోర్నీలో ఎక్కువ వికెట్లు తీసే బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah). అతడి ప్రదర్శన ఆ స్థాయిలో ఉంది. ఐపీఎల్‌లోనూ టాప్‌-3లో నిలిచాడు. గత కొన్నేళ్లుగా నిలకడైన ఆటతీరుతో రాణిస్తున్నాడు. కొత్త బంతితో ఇరువైపులా స్వింగ్‌ చేయగల సమర్థుడు. డెత్‌ ఓవర్లలోనూ వికెట్లు తీస్తాడు. అందుకే, అతడి వైపు మొగ్గు చూపా. ఇక అత్యధిక పరుగులు సాధించే బ్యాటర్ల జాబితాలో ట్రావిస్ హెడ్ ఉంటాడని అనుకుంటున్నా. ఐపీఎల్‌ చివర్లో మినహా మిగతా అంతటా దూకుడుగా పరుగులు రాబట్టాడు. ఈసారి అతడు టాప్‌ స్కోరర్‌ అవుతాడు’’ అని పాంటింగ్‌ విశ్లేషించాడు.

భారత్‌లో నేర్చుకున్న వాటిని అమలుచేస్తాం: బట్లర్

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్‌ జట్టు ఈసారి కూడా విజేతగా నిలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే గత కొన్ని అంతర్జాతీయ మ్యాచుల్లో ఓటములను చవిచూసిన తర్వాత ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ జట్టు సారథి జోస్ బట్లర్ స్పందిస్తూ.. ‘‘ద్వైపాక్షిక సిరీసుల్లో మేం సరైన ప్రదర్శన చేయలేదు. స్వేచ్ఛగా ఆడటంపై ఉన్న సందిగ్ధతను తొలగించుకుని పూర్తి స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆటగాళ్లు ఫ్రీడమ్‌తో ఆడేందుకు అవకాశం ఇవ్వాలి. అన్నిసార్లూ ఇది వర్కౌట్‌ కాకపోవచ్చు. కానీ, పరిస్థితికి తగ్గట్టుగా ఆటతీరు విషయంలో క్లారిటీతో ఉండాలి. భారత్‌లో వన్డే ప్రపంచకప్‌, ఐపీఎల్‌ వంటి టోర్నీలను ఆడాం. అక్కడ చాలా విషయాలను నేర్చుకున్నాం. ఈసారి వాటిని అమలుచేసేందుకు ప్రయత్నించి ఫలితాలను రాబడతాం’’ అని బట్లర్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు