Ishan- Shreyas: కాంట్రాక్ట్‌లు పోయాయి.. ఇషాన్‌ - శ్రేయస్‌ ఇప్పుడేం చేస్తారో?

దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడం వల్ల ఏకంగా తమ వార్షిక కాంట్రాక్ట్‌లనే కోల్పోవాల్సిన పరిస్థితి ఇద్దరు భారత క్రికెటర్లకు ఎదురైంది.

Updated : 29 Feb 2024 17:01 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer), ఇషాన్‌ కిషన్‌కు (ishan Kishan) సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లు చేజారాయి. దీంతో భారత్‌ తరఫున వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. కాంట్రాక్ట్‌లో లేకుండా జాతీయ జట్టుకు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందా? లేదా? అనే ప్రశ్నలూ తలెత్తడం సహజమే. గతేడాది అక్టోబర్‌ 1 నుంచి 2024 సెప్టెంబర్‌ 30 వరకు ఈ కాంట్రాక్ట్ గడువు ఉంటుంది. భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్, బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పిన మాటలను పెడచెవిన పెట్టడమే వారికి చేటు తెచ్చింది.

ఇషాన్‌ కిషన్ దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో నుంచి వచ్చేసిన తర్వాత నుంచి జాతీయ జట్టుతోపాటు దేశవాళీ క్రికెట్‌కు అందుబాటులో ఉండలేదు. హార్దిక్‌ పాండ్య, కృనాల్ పాండ్యతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐపీఎల్ కోసం దేశవాళీ క్రికెట్‌ ఆడకపోవడంపై బీసీసీఐ కన్నెర్ర చేసింది. మరోవైపు శ్రేయస్‌ మాత్రం ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడాడు. కానీ, వెన్ను నొప్పి కారణంతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌ ఉన్నా రంజీల్లో ఆడకపోవడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఏకంగా కాంట్రాక్ట్‌లనే కోల్పోయి ప్రమాదంలో పడ్డారు.

ఆడే అవకాశం ఉందా...?

కాంట్రాక్ట్‌లను కోల్పోయిన ఇషాన్, శ్రేయస్‌ను మళ్లీ భారత జట్టులో చూసే అవకాశాలూ ఉన్నాయి. జాతీయ జట్టు కోసం ఎంపిక చేసేటప్పుడు ప్రస్తుత ఫిట్‌నెస్, ఫామ్‌ ఆధారంగానే చూస్తారు. కాబట్టి, వీరిద్దరూ తమ ఫామ్‌ను నిరూపించుకొని.. ఫిట్‌గా ఉంటే మళ్లీ భారత్‌కు ఆడొచ్చు. సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని వారిని ప్రతిభ ఆధారంగా  ఎంపిక చేస్తారు. ఇప్పుడు ఇలాంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ.. న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్‌ బౌల్ట్. కాంట్రాక్ట్‌ను వద్దనుకొని బయటకు వెళ్లిపోయాడు. కానీ, వన్డే వరల్డ్‌ కప్‌ కోసం అతడిని బ్లాక్‌క్యాప్స్‌ ఎంపిక చేసింది. తర్వాత ద్వైపాక్షిక సిరీసుల్లోనూ ఆడాడు. 

ఏం చేయాలంటే?

బీసీసీఐ నుంచి మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్‌ దక్కించుకోవాలంటే శ్రేయస్‌, ఇషాన్‌ చేయాల్సిందల్లా.. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దేశవాళీ క్రికెట్‌లోనూ ఆడాలి. ఫామ్‌, ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ జట్టులో స్థానం కోసం రేసులో నిలవాలి. బీసీసీఐ షరతులను అంగీకరిస్తేనే మళ్లీ కాంట్రాక్ట్‌ లభిస్తుంది. అలా కాకుండా.. మేం ఇలానే ఉంటామంటే మాత్రం వాళ్ల అంతర్జాతీయ కెరీర్‌ భారత్‌ తరఫున ముగిసినట్లే లెక్క. జాతీయ జట్టులోకి వచ్చి సత్తా చాటితే ఆటోమేటిక్‌గా వారినీ పరిగణనలోకి తీసుకుంటారు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుతంగా ఆడితే టీ20 ప్రపంచ కప్‌ జట్టులో స్థానం దక్కే అవకాశం లేకపోలేదు. 

జూనియర్లకు వరం.. సీనియర్లు కష్టం..!

ఛెతేశ్వర్‌ పుజారా, శిఖర్ ధావన్‌, ఉమేశ్‌ యాదవ్‌, చాహల్, రహానె పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పుజారా, రహానె ఇటు దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్నప్పటికీ జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. సెలక్టర్లు వీరిని పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. మరోవైపు యువ క్రికెటర్లకు బీసీసీఐ అధికారికంగా బౌలింగ్‌ కాంట్రాక్ట్‌లను ఇవ్వడం గమనార్హం. పేసర్లు ఆకాశ్‌ దీప్‌, విజయ్‌కుమార్ వైశాక్‌, ఉమ్రాన్‌ మాలిక్, యశ్ దయాల్, విద్వత్‌ కవేరప్పకు అవకాశం దక్కింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్‌ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. దీంతో అతడికి బౌలింగ్‌ కాంట్రాక్ట్ ఇవ్వాలని సెలక్టర్ల కమిటీ సూచించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని