T20 World Cup 2024: కెనడా కేక

కెనడా అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆ జట్టు శుక్రవారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై సంచలన విజయం సాధించింది.

Updated : 08 Jun 2024 05:01 IST

ఐర్లాండ్‌పై గెలుపు
టీ20 ప్రపంచకప్‌ 

న్యూయార్క్‌: కెనడా అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆ జట్టు శుక్రవారం గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై సంచలన విజయం సాధించింది. మొదట కెనడా 7 వికెట్లకు 137 పరుగులే చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నికోలాస్‌ కిర్టాన్‌ (49; 35 బంతుల్లో 3×4, 2×6), శ్రేయస్‌ మొవ్వా (37; 36 బంతుల్లో 3×4) రాణించారు. యంగ్‌ (2/32), మెకార్టీ (2/24) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఛేదనలో ఐర్లాండ్‌ 125/7కే పరిమితమైంది. అడైర్‌ (34; 24 బంతుల్లో 3×4, 1×6), డోక్రెల్‌ (30 నాటౌట్‌; 23 బంతుల్లో 2×4, 1×6) పోరాటం ఫలితాన్ని ఇవ్వలేదు. గోర్డాన్‌ (2/16), హెలిజర్‌ (2/18) ఐర్లాండ్‌కు కళ్లెం వేశారు.

వాళ్లిద్దరూ నిలిచినా..: ఛేదనలో ఐర్లాండ్‌ మొదట బాగానే మొదలుపెట్టినా తర్వాత తడబడింది. తొలి వికెట్‌కు బాల్‌బిర్నీ (17), కెప్టెన్‌ స్టిర్లింగ్‌ (9).. 26 పరుగులు జత చేసి ఓవర్‌ తేడాతో ఔటయ్యారు. అక్కడ నుంచి ఐర్లాండ్‌ పతనం వేగంగా సాగింది. 27 పరుగుల తేడాతో 4 వికెట్లు పడిపోయాయి. టకర్‌ (10), టెక్టార్‌ (7), కాంఫెర్‌ (4), డెల్నీ (3) ఇలా వచ్చి అలా వెళ్లడంతో ఐర్లాండ్‌ 12.3 ఓవర్లలో 59/6తో తీవ్ర కష్టాల్లో చిక్కుకుంది. ఈ స్థితిలో డోక్రెల్, అడైర్‌ నిలిచారు. ధాటిగా ఆడి ఆ జట్టులో ఆశలు రేపారు. కానీ సాధించాల్సిన రన్‌రేట్‌ అదుపులోకి రాలేదు. చివరి రెండు ఓవర్లలో 28 పరుగులు అవసరం కాగా 19వ ఓవర్లో 11 పరుగులే వచ్చాయి. చివరి ఓవర్లో ఐర్లాండ్‌ 17 పరుగులు చేయాల్సి రాగా.. ఆ జట్టు ఒక వికెట్‌ కోల్పోయి నాలుగు పరుగులే సాధించింది. 

కెనడా కట్టడి: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెనడా కూడా బ్యాటింగ్‌లో ఇబ్బందిపడింది. పిచ్‌ నుంచి అదనపు బౌన్స్‌ రాబట్టిన ఐర్లాండ్‌ బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు కళ్లెం వేశారు. పవర్‌ప్లేలోపే ఈ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అరోన్‌ జాన్సన్‌ (14), నవ్‌నీత్‌ (6) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పర్గత్‌సింగ్‌ (18) నిలిచినా.. అది కూడా కాసేపే! 8.1 ఓవర్లకు కెనడా 53/4తో కష్టాల్లో చిక్కుకుంది. ఈ స్థితిలో కిర్టాన్, శ్రేయస్‌ మొవ్వా జట్టును ఆదుకున్నారు. సమయోచితంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ జోడీ అయిదో వికెట్‌కు 75 పరుగులు జత చేయడంతో కెనడా పోరాడగలిగే స్కోరు చేయగలిగింది. 

కెనడా ఇన్నింగ్స్‌: అరోన్‌ జాన్సన్‌ (సి) కాంఫెర్‌ (బి) యంగ్‌ 14; నవ్‌నీత్‌ (సి) డోక్రెల్‌ (బి) అడైర్‌ 6; పర్గత్‌సింగ్‌ (సి) లిటిల్‌ (బి) యంగ్‌ 18; దిల్‌ప్రీత్‌ బజ్వా (సి) అండ్‌ (బి) డెల్నీ 7; కిర్టాన్‌ (సి) బాల్‌బిర్నీ (బి) మెకార్టీ 49; శ్రేయస్‌ మొవ్వా రనౌట్‌ 37; హెలిజర్‌ (సి) లిటిల్‌ (బి) మెకార్టీ 0; జాఫర్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 137 వికెట్ల పతనం: 1-12, 2-28, 3-42, 4-53, 5-128, 6-128, 7-137 బౌలింగ్‌: మార్క్‌ అడైర్‌ 4-0-23-1; జోష్‌ లిటిల్‌ 4-0-37-0; యంగ్‌ 4-0-32-2; మెకార్టీ 4-0-24-2; డెల్నీ 2-0-10-1; కాంఫెర్‌ 2-0-11-0


ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: బాల్‌బిర్నీ (సి) అండ్‌ (బి) సిద్ధిఖీ 17; స్టిర్లింగ్‌ (సి) శ్రేయస్‌ (బి) గోర్డాన్‌ 9; టకర్‌ రనౌట్‌ 10; టెక్టార్‌ (బి) జాఫర్‌ 7; కాంఫెర్‌ (సి) జాన్సన్‌ (బి) హెలిజర్‌ 4; డోక్రెల్‌ నాటౌట్‌ 30; డెల్నీ (సి) శ్రేయస్‌ (బి) హెలిజర్‌ 3; అడైర్‌ (సి) అండ్‌ (బి) గోర్డాన్‌ 34; మెకార్టీ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 125 వికెట్ల పతనం: 1-26, 2-32, 3-41, 4-50, 5-53, 6-59, 7-121 బౌలింగ్‌: కలీమ్‌ సనా 4-0-38-0; గోర్డాన్‌ 4-0-16-2; సిద్ధిఖీ 4-0-27-1; సాద్‌ బీన్‌ జాఫర్‌ 4-0-22-1; హెలిజర్‌ 4-0-18-2

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు