Rajasthan Vs Bengaluru: ‘విరాట్’ ప్లాన్‌తో బెంగళూరుపై ఒత్తిడి తెస్తాం: యుజ్వేంద్ర చాహల్‌

వరుసగా రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో కిందికి దిగజారిన బెంగళూరును రాజస్థాన్‌ జట్టు తన సొంత మైదానంలో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఈక్రమంలో చాహల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published : 06 Apr 2024 17:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో సొంత మైదానం వేదికగా బెంగళూరుతో రాజస్థాన్‌ తలపడనుంది. హ్యాట్రిక్ విజయాలతో ఉత్సాహంగా ఉన్న రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ క్రమంలో బెంగళూరును (Rajasthan Vs Bengaluru) ఎలా అడ్డుకుంటారనే ప్రశ్నకు రాజస్థాన్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ (Chahal) ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఒకప్పుడు చాహల్ కూడా బెంగళూరు తరఫున ఆడిన సంగతి తెలిసిందే. అలాగే స్టార్‌ క్రికెటర్లు ధోనీ, విరాట్, రోహిత్ ఎక్కడికెళ్లినా అభిమానులు బ్రహ్మరథం పడతారని.. అలా అందరికీ సాధ్యం కాదని చాహల్‌ వ్యాఖ్యానించాడు. బెంగళూరుతో మ్యాచ్‌కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చాహల్ మాట్లాడాడు.

‘‘ఈ మ్యాచ్‌లో బెంగళూరును ఒత్తిడికి గురి చేయాలంటే విరాట్ కోహ్లీ (Virat Kohli) వికెట్‌ అత్యంత కీలకం. అతడిని త్వరగా ఔట్‌ చేస్తేనే మేం మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. మా సొంత మైదానంలో మ్యాచ్‌ ఆడబోతున్నాం. అయితే ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్లు ఎక్కడికెళ్లినా ప్రేక్షకులు మద్దతుగా నిలుస్తారు. ఫ్యాన్స్‌ మా టికెట్లను కూడా కొనేయాలని చూస్తారు. కానీ, మేం మాత్రం ఇవ్వం (నవ్వుతూ)’’ అని చాహల్‌ వ్యాఖ్యానించాడు. 

టీ20 ప్రపంచ కప్‌లో యశస్వి ఉండాల్సిందే: చోప్రా

ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) ఫామ్‌ను చూడకుండా వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో చోటు కల్పించాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సెలక్టర్లకు సూచించాడు. ఈ సీజన్‌లో యశస్వి మూడు మ్యాచుల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. ‘‘వరల్డ్‌ కప్‌లో విరాట్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలా ఎప్పుడూ జరగదు. ఏప్రిల్ 30వ తేదీ వరకు యశస్వి పరుగులు చేయలేడనుకుందాం. కేవలం ఏడెనిమిది మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకొని యశస్విని పక్కన పెడతారా? అప్పుడు ఆ నిర్ణయం అన్యాయమే అవుతుంది. యశస్విని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరంభ ఓవర్లలో రోహిత్‌తో కలిసి శుభారంభం ఇస్తాడు’’ అని చోప్రా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని