Virat Kohli: ఛేదన అంటే చాలు చెలరేగిపోతాడు..

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మేటి బ్యాటర్లుగా పేరున్న ఎవ్వరి గణాంకాలైనా తీసుకోండి. మొదట బ్యాటింగ్ చేస్తున్నపుడు ఎక్కువ పరుగులు చేసి ఉంటారు. సగటు కూడా చాలా బాగుంటుంది. అప్పుడే ఎక్కువగా శతకాలు, అర్ధశతకాలు సాధించి ఉంటారు. కానీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నపుడు గణాంకాలు ఆ స్థాయిలో ఉండవు. పరుగులు, సగటు, శతకాలు మొదట బ్యాటింగ్‌ చేస్తున్నప్పటితో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కానీ విరాట్ కోహ్లి (ñVirat Kohli) మాత్రం ఇందుకు మినహాయింపు. 

Updated : 09 Oct 2023 16:46 IST

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మేటి బ్యాటర్లుగా పేరున్న ఎవ్వరి గణాంకాలైనా తీసుకోండి. మొదట బ్యాటింగ్ చేస్తున్నపుడు ఎక్కువ పరుగులు చేసి ఉంటారు. సగటు కూడా చాలా బాగుంటుంది. అప్పుడే ఎక్కువగా శతకాలు, అర్ధశతకాలు సాధించి ఉంటారు. కానీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నపుడు గణాంకాలు ఆ స్థాయిలో ఉండవు. పరుగులు, సగటు, శతకాలు మొదట బ్యాటింగ్‌ చేస్తున్నప్పటితో పోలిస్తే తక్కువగా ఉంటాయి. కానీ విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం ఇందుకు మినహాయింపు. మిగతా బ్యాటర్లందరికీ అతను పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. లక్ష్యాన్ని ఛేదిస్తున్నపుడే అతడి పరుగులు ఎక్కువ. సగటు, శతకాలు.. ఇలా అన్నింట్లోనూ అతను మెరుగ్గా కనిపిస్తాడు. ఇదే అతణ్ని గొప్ప బ్యాటర్‌గా, మిగతా బ్యాటర్ల నుంచి భిన్నంగా నిలబెడుతోంది. 

సచిన్ తెందుల్కర్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఉత్తమ బ్యాటర్‌గా తన కాలంలో కితాబు అందుకున్న ఆటగాడు. వన్డే క్రికెట్లో సచిన్ పరుగుల ప్రవాహం గురించి, రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏకంగా 18 వేలకు పైగా పరుగులు, 49 శతకాలు సాధించిన ఘనుడు సచిన్. అలాంటి సచిన్ కూడా మొదట బ్యాటింగ్ చేస్తూ 47.34 సగటుతో 11,114 పరుగులు చేసి, 32 శతకాలు నమోదు చేశాడు. లక్ష్యాన్ని ఛేదిస్తున్నపుడు సచిన్ పరుగులు 10,254 కాగా.. సగటు 42.33. సాధించిన శతకాలు 17 మాత్రమే. సచిన్ అనే కాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఏ మేటి బ్యాటర్ గణాంకాలు తీసినా దాదాపు ఇలాగే ఉంటాయి. మొదట బ్యాటింగ్ చేస్తున్నపుడే ఎక్కువ పరుగులు చేస్తారు, ఎక్కువ శతకాలు బాదుతారు. ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేస్తున్నపుడు ఒత్తిడి తక్కువగా ఉంటుంది. స్వేచ్ఛగా పరుగులు చేయడానికి అవకాశముంటుంది. కానీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నపుడు లెక్కలు వేసుకుని ఆడాల్సి ఉంటుంది. లక్ష్యానికి తగ్గట్లు.. రన్‌రేట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆడాల్సి ఉంటుంది. వికెట్లు పడ్డా, సాధించాల్సిన రన్ రేట్ పెరిగినా.. బ్యాటర్ల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అందువల్లే భారీ ఇన్నింగ్స్‌లు ఆడటం కష్టమవుతుంది. కానీ విరాట్ కోహ్లి విషయంలో మాత్రం ఈ సమీకరణాలేవీ పని చేయవు. అతను ఛేదన అంటే చాలు చెలరేగిపోతాడు. ఎంత ఒత్తిడి ఉంటే అంత బాగా రాణిస్తాడు. పరిస్థితులు ప్రతికూలంగా మారితేనే అతడిలోనే ఉత్తమ బ్యాటర్ బయటికి వస్తాడు. ఒక టార్గెట్ పెట్టుకుని పని చేయడంలో అతను కిక్కు వెతుక్కుంటాడు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి జట్టును గెలిపించడాన్ని అతను బాగా ఆస్వాదిస్తాడు. అందుకే అతడికి ఛేదనలో మొనగాడిగా పేరొచ్చింది.

గణాంకాలే రుజువు..

ఇంతకీ వన్డేల్లో కోహ్లి గణాంకాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. అతను 282 వన్డేల్లో 57.50 సగటుతో 13,168 పరుగులు సాధించాడు. అందులో 47 శతకాలు ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేస్తున్నపుడు 50.38 సగటుతో 5643 పరుగులు సాధించాడు విరాట్. అందులో 21 శతకాలున్నాయి. ఇక లక్ష్యాలను ఛేదిస్తున్నపుడు విరాట్ 64.31 సగటుతో 7525 పరుగులు చేయడం విశేషం. అందులో 26 శతకాలున్నాయి. బహుశా ప్రపంచ క్రికెట్ చరిత్రలో మరే బ్యాటర్‌కూ రెండో ఇన్నింగ్స్‌లో ఇలాంటి గణాంకాలు ఉండవు, ఉండబోవు కూడా. తీవ్ర ఒత్తిడి ఉండే ఛేదనల్లో ఇలాంటి గణాంకాలు నమోదు చేయడం అసాధారణమైన విషయం. జట్టు కష్టాల్లో ఉండగా, ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో విరాట్ మొండి పట్టుదలతో నిలబడి, అద్భుత ఇన్నింగ్స్‌లతో విజయాలు అందించిన సందర్భాలు కోకొల్లలు. 2012లో కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ సందర్భంగా ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై 40 ఓవర్లలోనే 320 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే.. 86 బంతుల్లోనే 133 పరుగులతో అజేయంగా నిలిచి 36.4 ఓవర్లలోనే జట్టును గెలిపించడంతో మొదలుపెడితే కోహ్లిని ఛేదనలో మొనగాడిగా నిలిపిన ఇన్నింగ్స్‌లు ఎన్నో. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఛేదనలో కోహ్లి ఆడిన సంచలన ఇన్నింగ్స్‌ను అంత సులవుగా మరువగలమా? తాజాగా వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో ఆరంభ మ్యాచ్‌లో 200 పరుగుల చిన్న లక్ష్య ఛేదనలో 2 పరుగులకే జట్టు 3 వికెట్లు కోల్పోతే.. రాహుల్‌తో కలిసి అద్భుతంగా పోరాడిన కోహ్లి 85 పరుగుల ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఛేదనల్లో చెలరేగడంలో కోహ్లికి కోహ్లీనే సాటి అనే అభిప్రాయం మరింత బలపడింది.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు