Mumbai Vs Chennai: మా యువ వికెట్ కీపర్‌ సిక్స్‌లే కాపాడాయి: రుతురాజ్‌ గైక్వాడ్

ముంబయిపై రుతురాజ్ గైక్వాడ్, శివమ్‌ దూబె హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, ఇద్దరి ఆటగాళ్ల వల్లే తమ జట్టు గెలిచిందని చెన్నై కెప్టెన్ వ్యాఖ్యానించాడు. 

Updated : 15 Apr 2024 14:15 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే మైదానంలో ముంబయిపై 20 పరుగుల తేడాతో గెలిచింది. ఎంఎస్ ధోనీ (MS Dhoni) చివరి ఓవర్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లు బాదగా.. బౌలింగ్‌లో పతిరన నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌ విజయంలో వారిద్దరి పాత్ర కీలకమని చెన్నై కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) తెలిపాడు. రుతురాజ్‌, శివమ్‌ దూబె హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో పాయింట్ల పట్టికలో చెన్నై మూడో స్థానానికి ఎగబాకింది. మ్యాచ్‌ అనంతరం చెన్నై కెప్టెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ముంబయిపై విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. కానీ, మా యువ వికెట్‌ కీపర్ (ఎంఎస్ ధోనీని ఉద్దేశించి) కొట్టిన మూడు సిక్స్‌లు జట్టును ఆదుకున్నాయి. ఇలాంటి పిచ్‌పై మేం చేసిన దానికంటే మరో 15 పరుగులు అవసరమని భావించా. బుమ్రా అద్భుతంగా బౌలింగ్‌ వేశాడు. లక్ష్య ఛేదనలో బంతితో మేం మెరుగ్గా రాణించాం. హార్డ్‌ హిట్టర్లున్న ముంబయిని కట్టడి చేయడం సులువేం కాదు. మా యువ మలింగ (పతిరన)  మరోసారి పదునైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తుషార్, శార్దూల్ కూడా పరుగులను నియంత్రించారు. మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేస్తే చాలని మ్యాచ్‌ ముందు అనుకున్నాం. అజింక్యను ఓపెనర్‌గా పంపించడానికి కారణం ఉంది. వన్‌డౌన్‌లో కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఫామ్‌ దక్కించుకోవడానికి అతడితో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాం. నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధమే. ఇప్పుడు కెప్టెన్‌ అయిన తర్వాత మరింత బాధ్యతాయుతంగా ఆడాల్సి ఉంటుంది’’ అని రుతురాజ్‌ తెలిపాడు. 

పవర్‌ ప్లే సమయంలో ఆందోళన పడ్డా: పతిరన

‘‘ముంబయి ఇండియన్స్‌ పవర్‌ ప్లేలో 60+ స్కోరు చేసింది. దీంతో కాస్త ఆందోళనకు గురయ్యా. ఏమాత్రం కంగారు పడకుండా ప్రణాళికలకు కట్టుబడి బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రదర్శన నాలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించను. అనుకున్నట్లుగా బౌలింగ్‌ వేస్తున్నానా? లేదా? అనేది ముఖ్యం. అలా చేస్తే ఫలితం అనుకూలంగా వస్తుంది. బ్యాటర్‌ను బట్టి కూడా నా ప్రణాళికలను మార్చుకుంటా. రెండు వారాల కిందట వరకు నేను ఫామ్‌తో ఇబ్బంది పడ్డా. మేనేజ్‌మెంట్, సహాయక సిబ్బంది మద్దతుగా నిలిచి ప్రోత్సహించారు’’ అని పతిరన (Patirana) తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన అతడు 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి 28 పరుగులు ఇచ్చాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు సొంతం చేసుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని