MS Dhoni: ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్

‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఈ సీజన్‌లో హిట్టింగ్‌ చేస్తూ సిక్స్‌లు, ఫోర్లు బాదేశాడు. మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ ఆట కోసమే అభిమానులు స్టేడియాలకు హోరెత్తారు.

Published : 19 May 2024 13:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆటతీరు అభిమానులను అలరించింది. చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విఫలమైనప్పటికీ ఎంఎస్‌డీ క్రేజ్‌ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ప్రతి స్టేడియంలోనూ అతడి కోసమే అభిమానులు వచ్చేవారంటే అతిశయోక్తికాదు. అయితే, ఈ సీజన్‌ తర్వాత ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు విపరీతంగా వచ్చాయి. బెంగళూరుతో మ్యాచ్‌ అనంతరం నిర్ణయాన్ని వెల్లడిస్తాడని అంతా భావించారు. కానీ, ధోనీ మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో ‘కెప్టెన్ కూల్’ భవితవ్యంపై సీఎస్కే బౌలింగ్‌ కోచ్ ఎరిక్ సైమన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 2010 నుంచి ధోనీతో పరిచయం ఉందని.. గేమ్‌ను అర్థం చేసుకోవడంలో అతడిని మించిన వారెవరూ లేరని తెలిపాడు.

‘‘ధోనీతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జట్టును కాపాడే కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలెన్నో చూశాం. అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే మ్యాచ్‌ విజయం సాధించే స్థితిలో మేమున్నట్లేనని డగౌట్‌లో కూర్చొని అనుకొనేవాళ్లం. జట్టులో ఆత్మవిశ్వాసం నింపడంలో ధోనీకి మించినవారెవరూ ఉండరు. గేమ్‌ను ఎప్పటికప్పుడు అర్థం చేసుకోవడంలో ముందుంటాడు. గొప్ప క్రికెటర్లు అందరూ అలా చేయగలిగినప్పటికీ.. దానిని ఆచరణలో పెట్టాలంటే మాత్రం ధోనీకే సాధ్యం. యువ క్రికెటర్లకు ఎల్లవేళలా మద్దతుగా నిలుస్తాడు. 

ప్రతి మ్యాచ్‌ సమయంలోనూ ధోనీ భవితవ్యంపై చర్చ కొనసాగుతోంది. వినడానికి చాలా క్రేజీ ఉంటుంది. ఎంఎస్‌డీకి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. ఈ సీజన్‌కు ముందు ప్రి సెషన్‌ ప్రాక్టీస్‌ సమయంలోనూ అతడి బ్యాటింగ్‌ను చూశా. బంతిని హిట్టింగ్‌ చేయడంలో ఉత్సాహం చూపించాడు. ఇదే ఆటతీరును టోర్నీలోని మ్యాచుల్లోనూ చూశాం. కాబట్టి, అతడు తన భవిష్యత్తుపై పూర్తి అవగాహనతో ఉంటాడు. తప్పకుండా నిర్ణయం తీసుకుంటాడు’’ అని ఎరిక్‌ వెల్లడించాడు. ఈ సీజన్‌లో ధోనీ 14 మ్యాచుల్లో 161 పరుగులు సాధించాడు. దాదాపు ఇవన్నీ సిక్స్‌లు, ఫోర్లు రూపంలో వచ్చినవే కావడం గమనార్హం. తాజాగా బెంగళూరుతో చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ 13 బంతుల్లోనే 25 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు