ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్‌మెంట్‌పై చెన్నై ఫ్రాంచైజీ!

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై ప్లేఆఫ్స్‌కు చేరలేదు. దీంతో ధోనీ ఆటను చూసే అవకాశం కోల్పోయామనే బాధ అభిమానుల్లో ఉంది. అయితే, అతడి భవితవ్యంపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది.

Published : 20 May 2024 11:34 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్‌లో చెన్నై లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైంది. కీలక మ్యాచ్‌లో సీఎస్కేపై బెంగళూరు విజయం సాధించడంతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) దూకుడుగా ఆడి జట్టును గెలిపించే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఈ సీజన్‌ తర్వాత క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అంతా భావిస్తున్నప్పటికీ.. ధోనీ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇదే విషయాన్ని చెన్నై క్రికెట్ వర్గాలు మరోసారి స్పష్టం చేశాయి. 

‘‘ధోనీ ఇప్పటి వరకు అతడి భవితవ్యం గురించి మాట్లాడలేదు. వైదొలుగుతానని ఎప్పుడూ చెప్పలేదు. మేనేజ్‌మెంట్‌తో తన నిర్ణయం వెల్లడించేందుకు కాస్త సమయం తీసుకుంటాడని అనుకుంటున్నాం. ప్రస్తుత సీజన్‌లో అతడు వికెట్ల మధ్య పరుగెత్తడంలో ఎక్కడా ఇబ్బంది పడినట్లు అనిపించలేదు. వచ్చే సీజన్‌లో ఇంపాక్ట్‌ రూల్‌ను ఉపయోగించుకుని ధోనీని కేవలం బ్యాటింగ్‌కే దిగేలా చూడాలని అభిమానులు కోరుతున్నారు. కానీ, ‘కెప్టెన్ కూల్’ ఎలాంటి డెసిషన్‌ తీసుకుంటాడో తెలియదు. ఈ సీజన్‌ ఇప్పుడే ముగిసింది. అతడితో మాట్లాడేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం. జట్టు ప్రయోజనాల కోసమే ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి ధోనీ. కాబట్టి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు’’ అని సీఎస్కే వర్గాలు తెలిపాయి. 

బంతిని మార్చడం వల్లే..

బెంగళూరు యశ్‌ దయాళ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 20వ ఓవర్ తొలి బంతిని ధోనీ భారీ సిక్స్‌గా మలిచాడు. 110 మీటర్ల దూరం కొట్టాడు. ఇదే ఆర్సీబీ విజయానికి కారణమైందనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఆ బంతి కనిపించకపోవడంతో దాని స్థానంలో వేరే బాల్‌ను ఆర్సీబీ తీసుకుంది. దయాళ్‌కు పట్టు దొరకడంతో తర్వాత బంతికే ధోనీ క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ధోనీ ఔట్‌ కావడంపై సీఎస్కే అధికారి స్పందిస్తూ.. ‘‘భారీ సిక్స్‌ కొట్టడంతో మరొక బంతిని తీసుకోవడం జరిగింది. ఆ బాల్‌కు తేమ లేకపోవడంతో బౌలర్‌కు పట్టుదొరికింది. దీంతో బ్యాటర్ హిట్టింగ్‌ చేయడం కష్టంగా మారింది’’ అని పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని