Ruturaj Gaikwad: ఒత్తిడేం లేదు.. కెప్టెన్సీని ఆస్వాదించా: రుతురాజ్‌ గైక్వాడ్

ఐపీఎల్ 17వ సీజన్‌ (IPL 2024) అద్భుతంగా మొదలైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై విజయంతో ఈ సిరీస్‌ను మొదలుపెట్టింది.

Updated : 23 Mar 2024 07:52 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై బోణీ కొట్టింది. చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్సీ చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే జట్టును గెలిపించాడు రుతురాజ్‌ గైక్వాడ్. మ్యాచ్‌ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని.. సీనియర్ల సహకారం బాగుందని తెలిపాడు. 

‘‘ఆట మొత్తం మా నియంత్రణలోనే ఉంది. తొలి మూడు ఓవర్లలో మేం భారీగా పరుగులు ఇచ్చినా తర్వాత పుంజుకున్నాం. స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు తీసుకున్నాం. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్‌ను ఔట్‌ చేయడమే టర్నింగ్‌ పాయింట్. బెంగళూరు మిడిలార్డర్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఆ జట్టు భారీ స్కోరు చేయకుండా..  15 పరుగులు తక్కువకే కట్టడి చేయగలిగాం. సీనియర్లు ఉన్న జట్టును ఎలా నడిపిస్తాడో అని చాలామంది అనుకొని ఉంటారు. నేను మాత్రం కెప్టెన్సీని ఆస్వాదించా. ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. సారథ్యం ఎలా నిర్వర్తించాలనేది అనుభవమే. మహీ భాయ్‌ మద్దతు ఉందక్కడ. మా జట్టులోని ప్రతి ఒక్కరూ స్ట్రోక్‌ ప్లేయర్లు. అజింక్య రహానె అద్భుతంగా ఆడాడు. ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏంటో తెలుసు. టాప్ -3 బ్యాటర్లలో ఒకరు  15వ ఓవర్‌ వరకూ క్రీజ్‌లో ఉంటే ఛేదన మరింత తేలికవుతుంది’’ అని రుతురాజ్‌ తెలిపాడు. 

మరో 20 పరుగులు చేయాల్సింది: డుప్లెసిస్‌

‘‘ఆరు ఓవర్ల తర్వాత బ్యాటింగ్‌లో కాస్త తగ్గాల్సి ఉంటుంది. చెన్నై బౌలర్లు మిడిల్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. మరీ ముఖ్యంగా స్పిన్నర్లు మమ్మల్ని కట్టడి చేశారు. కనీసం మరో 15 నుంచి 20 పరుగులు చేస్తే బాగుండేది. పిచ్ బాగానే ఉంది. తొలి 10 ఓవర్లలో త్వరగా వికెట్లను కోల్పోయాం. ఛేదనలోనూ ప్రత్యర్థి బ్యాటర్లు మాపై ఆధిక్యం ప్రదర్శించారు. ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేయడం మంచిదే. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. దినేశ్ కార్తిక్‌ సూపర్‌గా ఆడాడు. ఇటీవల ఎక్కువగా క్రికెట్ ఆడని అతడు.. తొలి మ్యాచ్‌లోనే దూకుడైన ప్రదర్శన చేశాడు. కుర్రాడు అనుజ్‌ రావత్ ఆకట్టుకున్నాడు’’ అని బెంగళూరు కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ తెలిపాడు.

మరికొన్ని విశేషాలు.. 

  • ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన శివమ్‌ దూబె ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అతడికి బెంగళూరుపై మంచి రికార్డు ఉంది. మొత్తం నాలుగు మ్యాచుల్లో 227 పరుగులు రాబట్టాడు. 
  • ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభ మ్యాచుల్లో బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. మొత్తం ఐదు మ్యాచుల్లో తలపడగా.. ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచింది. 2021 సీజన్‌లో ముంబయిపై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిగతా నాలుగింటిలోనూ పరాజయమే.
  • చెపాక్‌ స్టేడియంలో చెన్నై X బెంగళూరు జట్లు 9 మ్యాచుల్లో తలపడగా.. 8 మ్యాచుల్లో చెన్నై గెలిచింది. కేవలం ఒక్క దాంట్లోనే (2008 సీజన్‌లో) బెంగళూరు విజయం సాధించడం గమనార్హం.
  • ఐపీఎల్‌లో ఒక జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన రెండో జట్టుగా చెన్నై నిలిచింది. బెంగళూరుపై 21 మ్యాచుల్లో చెన్నై విజయం సాధించింది. కోల్‌కతాపై ముంబయి 23 విజయాలతో ముందుంది. 
  • ఒక్క హాఫ్‌ సెంచరీ లేకుండా.. ఎక్కువ పరుగులు నమోదైన తొలి మ్యాచ్‌గా చెన్నై-బెంగళూరు పోరు నిలిచింది. ఈ మ్యాచ్‌లో 349 పరుగులు నమోదు కావడం విశేషం. టాప్‌ స్కోరర్‌ బెంగళూరు బ్యాటర్ అనుజ్‌ రావత్ (48).
  • దినేశ్ కార్తిక్ - అనుజ్‌ రావత్ కలిసి ఆరో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ఐపీఎల్‌లో బెంగళూరుకు ఈ వికెట్‌కు రెండో అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు 2022లో షహబాజ్‌తో కలిసి కార్తిక్ 97 పరుగులు జోడించాడు. చెన్నై జట్టుపై ఆరో వికెట్‌కు ఇదే అత్యధికం కావడం విశేషం.
  • చెన్నై తరఫున ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేసిన రెండో బౌలర్‌గా ముస్తాఫిజర్ రహ్మాన్ (4/29) నిలిచాడు.  2009లో షాదాబ్‌ జకాతి (4/24) బెస్ట్‌ బౌలింగ్‌ వేశాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని