Chennai vs Lucknow: చెపాక్‌లో చూసుకుందాం.. లఖ్‌నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?

మళ్లీ మ్యాచ్‌ చెపాక్‌కు వచ్చేసింది. లఖ్‌నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్‌నవూ విజయం సాధించింది.

Updated : 23 Apr 2024 10:57 IST

నాలుగు రోజుల కిందట.. వరుసగా రెండు విజయాలతో జోష్‌ మీదుంది చెన్నై. లఖ్‌నవూలో అడుగుపెట్టిన ఆ జట్టుకు అనూహ్యంగా ఓటమి ఎదురైంది. కేఎల్ రాహుల్‌ సేన అలవోకగా గెలిచింది. ఇప్పుడు మరోసారి ఇరు జట్లూ తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈసారి సొంతమైదానం చెపాక్‌ వేదికగా చెన్నై దూకుడుగా ఆడే అవకాశాలున్నాయి. మరి లఖ్‌నవూ ఏమాత్రం తట్టుకోగలదో చూడాలి.

ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై - లఖ్‌నవూ జట్ల మధ్య మళ్లీ మ్యాచ్‌ వచ్చేసింది. వీటి మధ్య జరిగిన గత పోరులో లఖ్‌నవూ విజయం సాధించింది. ప్లేఆఫ్స్‌ రేసులో ముందుకుపోవాలంటే ప్రతీ మ్యాచూ కీలకమే. పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఎవరు గెలిస్తే వారి స్థానం ఇంకాస్త మెరుగయ్యే అవకాశం ఉంది. బలాబలాలపరంగా ఇరు జట్లూ సమానంగానే ఉన్నా.. సొంత మైదానం కావడంతో చెన్నై జట్టే ఫేవరెట్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 

రచిన్‌.. రిజ్వీ గాడిలో పడాలి

చెన్నై బ్యాటింగ్ విభాగంలో ప్రభావం చూపని వారు ఇద్దరే. ఓపెనర్ రచిన్ రవీంద్ర, సమీర్ రిజ్వీ. గత వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ తరఫున అదరగొట్టిన రచిన్‌ ఈ ఐపీఎల్ సీజన్‌లో జట్టుకు బలంగా మారతాడని అంతా ఆశించారు. డేవన్ కాన్వే లేని లోటును ఓపెనర్‌గా తీరుస్తాడని భావించారు. కానీ, రచిన్‌ నుంచి ఒక్క మంచి ఇన్నింగ్స్‌ కూడా రాకపోవడం గమనార్హం. దూకుడుగా ఆడే క్రమంలో చెత్త షాట్లకు వికెట్లను సమర్పించేస్తున్నాడు. యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ కూడా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం లేదు. గత మ్యాచ్‌లో అజింక్య రహానె ఫర్వాలేదనిపించి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఎంఎస్ ధోనీ, జడ్డూ సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జడ్డూ కీలక ఇన్నింగ్స్‌లతో జట్టుకు అండగా నిలుస్తుంటే..  ధనాధన్‌ షాట్లతో ధోనీ వీరవిహారం చేస్తున్నాడు. చివరి ఓవర్లలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబడుతూ ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. 

పదును తగ్గిన తుషార్‌ బౌలింగ్‌

గత సీజన్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో చెన్నై జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన తుషార్‌ పాండే.. ఈసారి కాస్త ఇబ్బందిపడుతున్నాడు. బౌలింగ్‌ లయను అందుకొని డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించాలి. ఆరంభంలో ముస్తాఫిజుర్‌ చెలరేగిపోయాడు. ఇప్పుడు మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. రవీంద్ర జడేజా, పతిరన, దీపక్‌ చాహర్‌ లఖ్‌నవూతో మ్యాచ్‌లో ఆకట్టుకున్నారు. మరోసారి వారినుంచి ఇలాంటి ప్రదర్శనే పునరావృతం కావాలనేది అభిమానుల ఆకాంక్ష. లఖ్‌నవూ ఓపెనింగ్‌ జోడీ డికాక్, కేఎల్ రాహుల్‌ను త్వరగా ఔట్‌ చేస్తేనే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్‌లో డికాక్‌ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేయడంతో చెన్నైకి ఇబ్బందులు తప్పలేదు. జడ్డూలా మెరుపు ఫీల్డింగ్‌ చేస్తేనే విజయం వరించే అవకాశం ఉంది. 

లఖ్‌నవూ కలసికట్టుగా.. 

కేఎల్ రాహుల్‌ నాయకత్వంలోని లఖ్‌నవూ కలసికట్టుగా ఆడుతోంది. పేస్‌ బౌలింగ్‌లో సీనియర్లు లేకపోయినా.. కుర్రాళ్లే అదరగొట్టేస్తున్నారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మోసిన్‌ ఖాన్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌ ఆకట్టుకుంది. స్పిన్ విభాగం రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యతో ఫర్వాలేదనిపిస్తోంది. చెపాక్ పిచ్‌తో స్పిన్నర్లకు కాస్త సహకారం లభించనున్న నేపథ్యంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించే అవకాశం లేకపోలేదు. ఆల్‌రౌండర్ స్టాయినిస్‌ రెండు విభాగాల్లోనూ రాణించడం లఖ్‌నవూకు అదనపు బలం. ఇప్పటివరకు పెద్దగా ఫామ్‌లో లేని క్వింటన్‌ డికాక్‌ గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అలరించాడు. కెప్టెన్ కేఎల్‌ కూడా బ్యాట్‌ను ఝళింపించాడు. నికోలస్‌ పూరన్‌ను చెన్నై బౌలర్లు ఎలా అడ్డుకుంటారో చూడాలి. బ్యాటింగ్‌ విభాగంలో ఈ ముగ్గురితోపాటు యువ ఆటగాడు ఆయుష్‌ బదోనిని తక్కువగా అంచనా వేస్తే చెన్నైకి ఇబ్బందులు తప్పవు. ఫాస్టెస్ట్‌ పేసర్ మయాంక్‌ యాదవ్‌ మళ్లీ మైదానంలోకి అడుగుపెడతాడని లఖ్‌నవూ ఆశలు పెట్టుకుంది. అతడు వస్తే మాత్రం ఆ జట్టు బౌలింగ్‌ విభాగం మరింత పటిష్ఠంగా మారనుంది. 

పిచ్‌ రిపోర్ట్‌.. 

చెన్నై పిచ్‌ స్పిన్‌కు సహకారం అందిస్తుంది. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండదు. అయితే, ఆరంభంలో పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడమూ కష్టమే. టాస్‌ నెగ్గే జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గు చూపుతుంది. చెపాక్‌లో ఎప్పుడూ చెన్నైదే హవా. ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఆ జట్టే గెలిచింది. 

తుది జట్లు (అంచనా)

చెన్నై: రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తాఫిజర్‌ రహ్మాన్, మతీశా పతిరన

లఖ్‌నవూ: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్/వికెట్ కీపర్), దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, నికోలస్‌ పూరన్, ఆయుశ్‌ బదోని, కృనాల్ పాండ్య, మ్యాట్ హెన్రీ, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యశ్‌ ఠాకూర్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని