Divya Deshmukh: వచ్చింది కొత్త చెస్‌ రాణి

ఆమె చెస్‌లోకి రావడమే ఒక అనూహ్య పరిణామం. ఆటను ఎంత వేగంగా నేర్చుకుందో అంతే వేగంగా వార్తల్లోకి వచ్చింది. 17 ఏళ్ల ఆమె ఆటకు అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ కూడా ముగ్దుడయ్యాడు.

Published : 09 Sep 2023 13:12 IST

ఆ టోర్నీలో ఆ అమ్మాయికి ఎంట్రీనే లేదు. కానీ, అనుకోకుండా అవకాశం దక్కింది. రేటింగ్‌లో, అనుభవంలో తనకంటే ఎంతో పెద్ద్ద క్రీడాకారులు బరిలో ఉన్న ఆ టోర్నీలో ఈ టీనేజర్‌పై ఎవరికీ అంచనాలు లేవు. ఎవరిదాకో ఎందుకు ఆమెకే ఏ ఆశలూ లేవు. కానీ, టోర్నీ ముగిసే సరికి ట్రోఫీ ఆ అమ్మాయి చేతిలో ఉంది! ప్రత్యర్థులు షాక్‌లో ఉన్నారు. ఇలా అనుకోకుండా వచ్చి బలమైన ప్రత్యర్థులను తోసిరాణైంది 17 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్‌ (Divya Deshmukh). ఇటీవల టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్లో పరాజయం ఎరుగకుండా టైటిల్‌ ఎగరేసుకుపోయిందీ చిన్నది. భారత చెస్‌లో కొత్త తారగా అవతరించింది.

బ్యాడ్మింటన్‌ రాకెట్‌ వదిలి

మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన దివ్యకు జీవితంలో అనుకోనిది జరగడం అదే తొలిసారి కాదు. ఆమె చెస్‌లోకి రావడమే ఒక అనూహ్యం. దివ్య అక్క బ్యాడ్మింటన్‌ ఆడుతుంటే ఆమె వెనకాలే తాను ఆడటానికి వెళ్లేది. అయితే ఎత్తు తక్కువగా ఉండడంతో షటిల్‌ను అవతలి కోర్టులోకి కొట్టడమే వచ్చేది కాదు. బ్యాడ్మింటన్‌ స్టేడియంలోనే మరోవైపు చెస్‌ శిబిరం జరుగుతూ ఉండేది. వాళ్ల నాన్న జితేంద్ర అక్కడికి తీసుకెళ్లడంతో దివ్య ఆ ఆటకు ఆకర్షితురాలైంది. బ్యాడ్మింటన్‌ రాకెట్‌ పక్కనపెట్టేసి చెస్‌ బోర్డు ముందు వాలిపోయింది. చెస్‌పై ఆమె ఆసక్తి, వేగంగా ఎత్తులు వేసే తీరును చూసిన కోచ్‌ రాహుల్‌ జోషి దివ్యకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు. ఆటను ఎంత వేగంగా నేర్చుకుందో అంతే వేగంగా వార్తల్లోకి వచ్చింది. ఆరేళ్ల వయసులో దివ్య మహారాష్ట్ర స్టేట్‌ అండర్‌-7 ఛాంపియన్‌గా నిలిచింది. అలా నెమ్మదిగా ఒక్కో మెట్టే ఎక్కిన దివ్య జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. ప్రజ్ఞానందను తీర్చిదిద్దిన ఆర్‌బీ రమేశ్‌ శిక్షణలో ఈ అమ్మాయి మరింత రాటుదేలింది. నెలలో పది రోజులు నాగ్‌పుర్‌ నుంచి చెన్నై వచ్చి శిక్షణ తీసుకునేది.

వరుస విజయాలు

దివ్య ఆట మెరుగైన కొద్దీ టైటిళ్లు కూడా వరుస కట్టాయి. అండర్‌-7 (2012), అండర్‌-9 (2013, 2014), అండర్‌-11 (2015, 2016), అండర్‌-13 (2017), అండర్‌-15 (2017, 2018, 2019) టైటిళ్లు ఆమె ముంగిట వాలాయి. 2019లో తొలిసారి సీనియర్‌ టోర్నీలో అడుగుపెట్టి కాంస్యం నెగ్గిన దివ్య.. ఆపై కరోనా విరామం తర్వాత 2022లో నాగ్‌పుర్‌లో సీనియర్‌ కేటగిరిలో తొలిసారి జాతీయ ఛాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు సీనియర్లలో ఛాంపియన్‌ అయిన పిన్న వయస్కురాలిగా దివ్య (16 సంవత్సరాల 2 నెలల 22 రోజులు) ఘనత సాధించింది.. ఈ క్రమంలో కోనేరు హంపి (16 సంవత్సరాల 7 నెలల 20 రోజులు) రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది జనవరిలో జాతీయ టైటిల్‌ను నిలబెట్టుకుని తన ప్రదర్శన గాలివాటం కాదని దివ్య నిరూపించుకుంది.

విషీ మెచ్చుకోలు

దివ్య ఆటకు అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ కూడా ముగ్దుడయ్యాడు. ఈ అమ్మాయికి మంచి భవిష్యత్‌ ఉందని ప్రశంసించాడు. ఈ ప్రశంసలే దివ్యకు మరింత బలాన్ని ఇచ్చాయి. ప్రపంచ ఛాంపియన్‌ వెన్‌జువాన్, షవలోవా, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక లాంటి టాప్‌ ప్లేయర్లు పోటీపడిన టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీలో ర్యాపిడ్‌ విభాగంలో ప్రజ్ఞానంద సోదరి వైశాలి చివరి నిమిషంలో తప్పుకోవడంతో దివ్యకు అవకాశం దక్కింది. 9 రౌండ్లలో 7 విజయాలతో దివ్య టైటిల్‌ నెగ్గి సంచలనం సృష్టించింది. ప్రపంచ ఛాంపియన్‌ వెన్‌జువాన్, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అనా యుషెనినా (ఉక్రెయిన్‌) లాంటి హేమాహేమీలు బరిలో ఉన్న చోట ఏమాత్రం అనుభవం లేని ఒక భారత అమ్మాయి నెగ్గడం పెద్ద విశేషం. ముఖ్యంగా ఆఖరి రౌండ్లో తన కన్నా ఎంతో సీనియర్‌ కోనేరు హంపిని ఓడించడం దివ్య సత్తాకు నిదర్శనం. ప్రస్తుతం 2372 ఎలో పాయింట్లు ఖాతాలో ఉన్న ఈ అమ్మాయి.. ఇంకా గ్రాండ్‌మాస్టర్‌ హోదా దిశగా అడుగులు వేస్తోంది. ఈ టోర్నీకన్నా ముందు గతేడాది నవంబర్‌లో ఆసియా కాంటినెంటల్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన దివ్య.. మహిళల విభాగంలో భవిష్యత్‌ తారగా ఎదుగుతోంది.

- ఈనాడు క్రీడా విభాగం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు