T20 World Cup: ధోనీ స్క్వాడ్‌ అలా.. రోహిత్‌ సేన ఇలా..

రెండోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలవాలనే లక్ష్యంతో టీమ్‌ఇండియా బరిలోకి దిగింది. అయితే, తొలిసారి ఛాంపియన్‌గా నిలిచిన ఆ జట్టుకు.. ఇప్పుడు రోహిత్‌ సేనకు మధ్య ఉన్న పోలికలు ఏంటో ఓ లుక్కేద్దాం..

Updated : 01 Jun 2024 12:59 IST

అలవాటు లేని ఫార్మాట్‌.. అనుభవం లేని ఆట.. కానీ ధోనీ నాయకత్వంలో 2007లో భారత్‌ అనూహ్యంగా ప్రపంచ కప్‌  సాధించింది. ఇప్పుడు కావాల్సినంత అనుభవం ఉంది. ఫార్మాట్‌కు సరిపోయే స్టార్లూ ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో భారత్‌ తన ప్రపంచకప్‌ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్న నేపథ్యంలో.. మాహీ టీమ్‌ను, రోహిత్‌ సేనను పక్కపక్కన పెట్టి చూస్తే... 

బ్యాటింగ్‌ ఇలా.. 

ధోనీ హయాంలో..: గౌతమ్‌ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌ వంటి డ్యాషింగ్‌ ఓపెనర్లు ఉన్నారు. ఇక కుర్రాళ్ల జాబితాలో ఇప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్‌, రాబిన్ ఉతప్పకు స్థానం దక్కింది. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించడంలో సెహ్వాగ్‌ను మించినవారూ లేరు. ఉన్న కాసేపు అయినా ధనాధన్‌తో పరుగులు రాబట్టేవాడు. మరోవైపు ఎడమ చేతివాటం బ్యాటర్ గౌతమ్‌ గంభీర్‌ ఆటలో జోరు మనకు తెలిసిందే. యువరాజ్‌ సింగ్‌, ఎంఎస్ ధోనీ, యూసఫ్ పఠాన్‌తో కూడిన మిడిలార్డర్‌ అత్యంత బలంగా ఉంది. 

రోహిత్‌కు ఎవరంటే?: ఇప్పుడు జట్టులోని ప్రతిఒక్కరూ కావాల్సినంత టీ20 క్రికెట్‌ ఆడినవారే. కెప్టెన్ రోహిత్‌తో యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‌ చేయడం ఖాయం. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ ఫిక్స్. ఆ తర్వాత సూర్యకుమార్‌ యాదవ్, రిషభ్ పంత్ వస్తారు. అప్పటి (2007) జట్టుతో పోలిస్తే బ్యాటింగ్‌ విభాగంలో ఈసారి బలమైన టీమ్‌తోనే బరిలోకి దిగుతోంది. తాజాగా ఐపీఎల్‌ ఆడి రావడం కూడా భారత ఆటగాళ్లకు కలిసొస్తుందనేది క్రీడా పండితుల అభిప్రాయం.


ఆల్‌రౌండర్లు వీళ్లే.. 

ధోనీ టీమ్‌లో..: భారత జట్టులో ఆల్‌రౌండర్లు అంటే ఎప్పుడూ స్పిన్‌ వీరులదే హవా. ధోనీ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా జట్టులోనూ యువరాజ్‌ సింగ్‌, యూసఫ్‌ పఠాన్‌ రూపంలో ఆల్‌రౌండర్లు ఉన్నారు. మరీ ముఖ్యంగా యువరాజ్‌ టీ20 ప్రపంచ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌తోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీసేవాడు. ఇక పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఇర్ఫాన్‌ పఠాన్‌ను భావించాలి. అప్పట్లో ఎక్కువగా బౌలింగ్‌కే పరిమితమైనప్పటికీ..  ఆ తర్వాత ఫాస్ట్‌ బౌలర్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. 

రోహిత్‌ ఆప్షన్స్‌..: ఇప్పుడు భారత జట్టులో ఆల్‌రౌండర్లకు కొదవేం లేదు. కానీ, ఎప్పటిలానే స్పిన్‌ ఆల్‌రౌండర్లదే హవా. హార్దిక్‌ పాండ్య బెస్ట్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. కానీ, అతడు గత ఐపీఎల్‌లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ఇక శివమ్‌ దూబెను కూడా పరిగణించినా.. సీఎస్కే జట్టులో బౌలింగ్‌ చేసిన సందర్భాలు చాలా తక్కువ. అత్యుత్తమ స్పిన్‌ ఆల్‌రౌండర్లు కలిగిన జట్టు భారతే. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో టాప్‌ ఆటగాళ్లు ఉన్నారు. ఐసీసీ ర్యాంకుల్లో భారత్‌ తరఫున బెస్ట్‌ ర్యాంకర్ అక్షర్. 


పేసర్లు ఎవరు?

ధోనీకి వారు..: ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టు చీఫ్‌ సెలక్టర్ అజిత్‌ అగర్కార్‌ సీనియర్‌ పేసర్‌గా.. ఆర్పీ సింగ్‌, శ్రీశాంత్ ఫాస్ట్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టారు. ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా మీడియం పేస్‌తో ఆకట్టుకున్నాడు. ప్రపంచ కప్‌ ఫైనల్‌ చివరి ఓవర్‌ హీరో జోగిందర్ శర్మ సందర్భానుచితంగా ప్రదర్శన చేశాడు.

రోహిత్‌కి వీరు..: తొలి వరల్డ్‌ కప్‌లో భారత్‌ ఐదుగురు సీమర్లతో బరిలోకి దిగింది. ఇప్పుడు కూడా ముగ్గురు ప్రధాన ఫాస్ట్‌ బౌలర్లతోపాటు ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. ప్రపంచస్థాయి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, హైదరాబాదీ బౌలర్ సిరాజ్‌, యువ ఫాస్ట్‌ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌తోపాటు హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె ఉండనే ఉన్నారు.


స్పిన్‌ ఎటాక్‌ ఎవరికంటే?

ధోనీకీ స్పిన్‌ బలం: తొలి టోర్నీ దక్షిణాఫ్రికా వేదికగా జరిగింది. బ్యాటర్లకు స్వర్గధామం. వారిని అడ్డుకోవాలంటే స్పిన్నర్లదే కీలక పాత్ర. ధోనీ జట్టులో హర్భజన్‌ సింగ్‌ ప్రధాన స్పిన్నర్ కాగా.. పీయూష్ చావ్లా, యువీ, యూసఫ్ ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శించారు. పార్ట్‌ టైమ్‌ స్పిన్నర్‌ అయిన యువీ ఈ టోర్నీలో అత్యంత ప్రభావం చూపిన బౌలర్‌ కావడం విశేషం. భారత్‌ తొలి కప్‌ను సాధించడంలో వీరిదే ముఖ్య భూమిక. 

రోహిత్‌ స్పిన్నర్లు వీరే: విండీస్‌ పిచ్‌లు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయనే కారణంతో ఈసారి ఎక్కువగా స్పిన్నర్లను తీసుకెళ్లింది. జడ్డూ, అక్షర్‌ రూపంలో స్పిన్‌ ఆల్‌రౌండర్లు ఉండగా.. స్పెషలిస్ట్‌లు కుల్చా జోడీ (కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్) తమ మణికట్టు మంత్రంతో రాణించేందుకు సిద్ధమైంది. తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఆసక్తికరం.


యంగ్‌.. సీనియారిటీ

ధోనీ నాయకత్వంలోని అప్పటి టీమ్‌ఇండియాలో 25 ఏళ్లలోపు ఉన్న క్రికెటర్ల సంఖ్య 9. ఈ జట్టులో అతిపెద్ద వయసు కలిగిన ఆటగాడు అజిత్ అగార్కర్ (29 ఏళ్ల 247 రోజులు). అందరిలోనూ చిన్నవాడు పీయూశ్ చావ్లా కావడం గమనార్హం. అప్పటికి అతడి వయసు కేవలం 18 ఏళ్ల 227 రోజులు మాత్రమే. అయితే, అప్పటి యువ జట్టుకు టీ20 ఫార్మాట్‌ చాలా కొత్త. తొలి పొట్టి కప్‌ నాటికి సింగిల్‌ డిజిట్‌ మ్యాచులనే ఆడింది. ఇతర దేశాల క్రికెటర్లూ దాదాపు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. 

గతంతో పోలిస్తే రోహిత్ సేన వయసులో పెద్దదే. అనుభవం కూడా అన్ని జట్ల కంటే అధికంగానే ఉంది. ఐపీఎల్‌లో ఆడటం వల్ల ప్రతిఒక్కరూ టీ20 ఫార్మాట్‌కు అలవాటు పడిపోయారు. పాతికేళ్లలోపు క్రికెటర్లు ఇద్దరే ఉన్నారు.. వాళ్లే అర్ష్‌దీప్‌ సింగ్‌, యశస్వి జైస్వాల్. తొలి పొట్టి కప్‌ సభ్యుడు, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మే (37 ఏళ్లు) ఇప్పటి జట్టులో పెద్దోడు.

-ఇంటర్నెట్ డెస్క్


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు