Axar Patel: అక్షర్‌.. ఇది చాలదు.. ప్రపంచకప్‌ ముందు ఫామ్‌పై ఆందోళన!

బంగ్లాదేశ్‌తో చివరి వరకూ పోరాడినా జట్టును గెలిపించలేకపోయిన అక్షర్ పటేల్ (Axar Patel).. బ్యాటింగ్‌ పరంగా ఫర్వాలేదు. కానీ, బౌలింగ్‌ విషయానికొచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాడు. మెగా టోర్నీకి ముందు ఇలాంటి ప్రదర్శన అతడి స్థానంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

Published : 16 Sep 2023 12:54 IST

భారత్‌లో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి మరెంతో సమయం లేదు. ఇంకో 20 రోజుల్లోపే ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అక్టోబర్‌ 5న వన్డే విశ్వ సమరం ఆరంభమవుతుంది. ఈ ప్రపంచకప్‌ ముందు తుది జట్టుపై ఓ అంచనాకు రావడంతో పాటు ప్రాక్టీస్‌ కోసం ఆసియా కప్‌ను ఉపయోగించుకోవాలన్నది టీమ్‌ఇండియా ఆలోచన. కానీ ఇప్పుడు భారత జట్టుకు మరో ఆందోళన మొదలైంది. అదే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ప్రదర్శన. బంతితో, బ్యాట్‌తో అంచనాలను అందుకోలేకపోతున్నాడు. బంగ్లాదేశ్‌పై పోరాడినా కీలక సమయంలో నిష్క్రమించాడు. కానీ బౌలింగ్‌లో అతను ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను కాదని తనపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని అతను నిలబెట్టుకోవాల్సి ఉంది. 

ఏ రకంగానూ..

ఈ ఏడాది వన్డేల్లో అక్షర్‌ ప్రదర్శన ఏ రకంగానూ ఆశాజనకంగా లేదు. వికెట్లు పడగొట్టకపోవడంతో పాటు పరుగులూ కట్టడి చేయడం లేదు. 2023లో ఇప్పటివరకూ ఆడిన 8 వన్డేల్లో 4 వికెట్లు మాత్రమే తీశాడు. దాదాపు 6 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌లో బ్యాటర్లు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా పరుగులు సాధిస్తున్నారు. ఆసియా కప్‌లో పిచ్‌లు స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తున్నాయి. ఈ పిచ్‌లపై కుల్‌దీప్‌ ఎలా రెచ్చిపోతున్నాడో చూస్తూనే ఉన్నాం. ఇక శ్రీలంకతో మ్యాచ్‌లో అయితే పిచ్‌ స్పిన్‌కు స్వర్గధామంగా మారిందనే చెప్పాలి. లంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలాగె ఈ మ్యాచ్‌లో అయిదు వికెట్లతో విజృంభించాడు. పార్ట్‌టైమ్‌ స్పిన్నర్‌ అయిన అసలంక నాలుగు వికెట్లు పడగొట్టాడు. తీక్షణ ఓ వికెట్‌ తీసుకున్నాడు. దీంతో తొలిసారి స్పిన్నర్ల చేతిలో టీమ్‌ఇండియా ఆలౌటైంది. కానీ అదే పిచ్‌పై అక్షర్‌ మాత్రం తేలిపోయాడు. కుల్‌దీప్‌ 4, జడేజా 2 వికెట్లు తీసుకోగా.. అక్షర్‌ 5 ఓవర్లు వేసి ఒక్క వికెట్టూ పడగొట్టకుండా 29 పరుగులు సమర్పించుకున్నాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పైనే రాణించలేకపోతే అక్షర్‌ ఇంకెక్కడ సత్తాచాటుతాడనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అతను ఇప్పటివరకూ 54 వన్డేల్లో 59 వికెట్లు పడగొట్టాడు. 20 సగటుతో 481 పరుగులే చేశాడు. 

విమర్శలు వచ్చినా..

జట్టులో ఎడమ చేతి వాటం స్పిన్నర్‌ రవీంద్ర జడేజా ఉన్నాడు. అయినప్పటికీ జడేజా లాంటి స్పిన్నరే అయిన అక్షర్‌ను ప్రపంచకప్‌ జట్టులోకి ఎంపిక చేయడం ఏమిటనే విమర్శలు వచ్చాయి. జట్టు ప్రకటనకు ముందే అక్షర్‌ బదులు అశ్విన్‌ను తీసుకోవాలనే డిమాండ్లూ వినిపించాయి. కానీ జట్టు మేనేజ్‌మెంట్‌ అక్షర్‌ వైపే మొగ్గు చూపింది. దీంతో ఒకే తరహా స్పిన్నర్లు ఇద్దరు జట్టులో ఎందుకన్నది ఇప్పుడు ప్రశ్న. జడేజాకు బ్యాకప్‌గా అక్షర్‌ను ఎంపిక చేశారని అనుకుందాం. కానీ అదే స్థానంలో సీనియర్‌ అయిన ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ను తీసుకుంటే బాగుండేది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు జట్టులో ఒక ఎడమ చేతి వాటం స్పిన్నర్‌ (జడేజా), ఒక చైనామన్‌ స్పిన్నర్‌ (కుల్‌దీప్‌), ఒక కుడిచేతి వాటం ఆఫ్‌ స్పిన్నర్‌ (అశ్విన్‌) ఉండేవాళ్లు. అప్పుడు బౌలింగ్‌లో వైవిధ్యం ఉండేది. పైగా స్వదేశంలో పరిస్థితులు అశ్విన్‌కు కొట్టిన పిండి. ఏ పరిస్థితుల్లో ఏ బ్యాటర్‌ను ఎలాంటి బంతితో పెవిలియన్‌ చేర్చాలన్నది అశ్విన్‌కు బాగా తెలుసు. స్వదేశంలో ఆడిన 42 వన్డేల్లో అశ్విన్‌ 65 వికెట్లు తీశాడు. పైగా అతని అనుభవం జట్టుకు మరింత కలిసొచ్చేదే.

అక్షర్‌ ప్రదర్శన భారత్‌లో టెస్టుల్లో అద్భుతంగా ఉంది. అలా చూసుకుంటే అక్షర్‌ కంటే అశ్విన్‌దే మెరుగైన ప్రదర్శన. అలాంటప్పుడు అశ్విన్‌ను పక్కనపెట్టాల్సిన అవసరం ఏముందని మాజీలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడేమో జట్టుకు తన సేవలు అవసరం అనుకుంటే ఆడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ అశ్విన్‌ చెప్పాడు. పైగా భారత్‌లో జరిగే ప్రపంచకప్‌ కావడంతో అశ్విన్‌ను ఆడించే విషయంపై ఆలోచించాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈ నెల 28 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత జట్టులో ఏమైనా మార్పులు చేయాలంటే ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మరి అక్షర్‌ విషయంలో బీసీసీఐ, సెలక్షన్‌ కమిటీ మరోసారి ఆలోచిస్తుందా? అతని స్థానంలో అశ్విన్‌ను జట్టులోకి ఏమైనా తీసుకుంటారా? అన్నది ఇక్కడ ప్రశ్న. లేదంటే అక్షర్‌నే కొనసాగించాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటారేమో చూడాలి. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని