Olympic Games 2028: ఆ ఆనందం దక్కుతుందా..? ఒలింపిక్స్‌లో ఆ స్టార్లు ఆడేనా?

ఒలింపిక్స్‌లో (Olympic Games) క్రికెట్‌ను చూస్తామనే ఆనందం ఒక వైపు ఉన్నా.. ఇప్పుడున్న సీనియర్లను మెగా సంబరంలో చూస్తామా..? లేదా అనే సందిగ్ధత ప్రతి అభిమాని మదిలో మెదిలే ప్రశ్న. 

Published : 17 Oct 2023 18:41 IST

ఒలింపిక్స్‌లో (Olympic Games) క్రికెట్, స్క్వాష్‌! నిజంగా మన క్రీడాకారులకు ఇది శుభవార్తే. దశాబ్దాల నిరీక్షణకు తెరదించిన సమయమిది. 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ ఆరంభమయ్యే నాటికి ఇప్పుడు ఆడుతున్న క్రీడాకారుల్లో ఎంతమంది ఉంటారు? ముఖ్యంగా భారత సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లికి ఈ అవకాశం చిక్కుతుందా అనేది సందేహం!

విరాట్‌ కోహ్లి ప్రస్తుత వయసు 34 ఏళ్లు. 2028 లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ నాటికి 39 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటివరకు కోహ్లి కెరీర్‌ను కొనసాగించడమే ఎక్కువ. ఒకవేళ ఆడినా టీ20 ఫార్మాట్లో కొనసాగుతాడా అనేది కూడా అనుమానం. అందుకే ఒలింపిక్స్‌లో ఈ స్టార్‌ ఆటగాడు జట్టులో ఉంటాడా అనే అనుమానాలున్నాయి. లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో అయిదు క్రీడలను చేర్చిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ.. ఆ పోస్టర్‌లో క్రికెట్‌కు విరాట్‌ కోహ్లినే గుర్తుగా పెట్టింది. కోహ్లితో పాటు కొంతమంది సీనియర్‌ క్రికెటర్లకు కూడా 2028 ఒలింపిక్స్‌లో ఆడడం అంత తేలికేం కాదు. కానీ ఏ ఆటగాడికైనా ఒలింపిక్స్‌లో ఆడడం పెద్ద కల. క్రికెటర్లకు ఆ అవకాశం ఎప్పుడూ లేదు. ఇలాంటి అరుదైన అవకాశాన్ని కోహ్లి మరి ఒడిసిపడతాడో లేదో చూడాలి. అయితే ఫిట్‌నెస్‌కు మారుపేరు అయిన విరాట్‌ అంతర్జాతీయ క్రికెట్లో మరో మూడేళ్లు కచ్చితంగా కొనసాగే అవకాశం ఉంది. విపరీతమైన షెడ్యూల్‌ కారణంగా అలసిపోతున్న ఈ భారత స్టార్‌.. మున్ముందు అన్ని ఫార్మాట్లలో ఆడతాడా అనేది కీలకం. ముఖ్యంగా వేగం అవసరమైన టీ20ల్లో కొనసాగుతాడా అనేది ముఖ్యం. కోహ్లి ఒక్కడికే కాదు రోహిత్‌కు 41 ఏళ్లు, సూర్యకుమార్‌కు 37 ఏళ్లు, పాండ్యకు 34 ఏళ్లు వచ్చేస్తాయి అప్పటికి. మరి వీరిలో ఎందరు లాస్‌ఏంజెలస్‌ విమానం ఎక్కుతారో భవిష్యత్తే తేల్చాలి.

స్క్వాష్‌లో ఆ ముగ్గురు

భారత స్క్వాష్‌లో సౌరభ్‌ ఘోషల్, దీపిక పల్లికల్, జోష్న చిన్నప్ప వెటరన్‌ స్టార్లు. వీళ్లిద్దరిది కూడా విరాట్‌ లాంటి పరిస్థితే. ఒలింపిక్స్‌లో స్క్వాష్‌ను చేర్చడం కోసం ఏళ్ల తరబడి పోరాటం సాగుతోంది. ఇన్నాళ్లకు ఈ కల ఫలించింది. అయితే భారత్‌లో స్క్వాష్‌కు పర్యాయపదంగా నిలిచిన సౌరభ్‌ ఘోషల్, దీపిక పల్లికల్‌లకు లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌ వరకు కొనసాగడం కత్తిమీద సామే. ప్రస్తుతం సౌరభ్‌ ఘోషల్‌ వయసు 37 ఏళ్లు.. జోష్నకు 37 ఏళ్లు.. దీపికకు 32 ఏళ్లు వచ్చేశాయి. మరో అయిదేళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించాలంటే వీళ్లిద్దరికి అంత సులభం కాదు. ఇటీవల ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచి సత్తా చాటిన సౌరభ్, దీపిక, జోష్న.. కెరీర్‌ చరమాంకంలో ఉన్నారు. వీరితో పాటు హరీందర్‌పాల్‌ సింగ్‌ కూడా చిన్నోడేం కాదు. అతడికి 39 ఏళ్లు. ఈ నేపథ్యంలో 2028 ఒలింపిక్స్‌ వరకు కొనసాగడం  పెద్ద సవాల్‌.

దీపికకు ఇంకా కష్టం

దీపిక తల్లి అయిన తర్వాత పునరాగమనం చేసి ఆసియా క్రీడల్లో పతకం సాధించి సత్తా చాటింది. సౌరభ్‌ కూడా ఇదే తన చివరి క్రీడలు అన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు. అయితే స్క్వాష్‌ను ఒలింపిక్స్‌లో చేరుస్తున్నామన్న వార్త ఈ వెటరన్‌ క్రీడాకారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఎందరో స్క్వాష్‌ స్టార్లు ఒలింపిక్స్‌లో ఆడాలన్న కల తీరకుండానే రిటైర్‌ అయ్యారు. ఎనిమిదిసార్లు ప్రపంచ ఛాంపియన్‌ నికోల్‌ డేవిడ్‌ (మలేసియా) ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో 2028 వరకు కెరీర్‌ను కొనసాగించేందుకు పునరాలోచన చేస్తున్నట్లు ఘోషల్‌ చెప్పాడు. సౌరభ్‌ సంగతి పక్కనపెడితే దీపక మున్ముందు కనిపిస్తుందా అనేది ఆసక్తికరం. ఇక ఆసియా క్రీడల్లో డబుల్స్‌లో రాణించినా వెటరన్‌ జోష్న కూడా కెరీర్‌ ముగించే దశలోనే ఉంది. ఆమెకు కూడా 2028 ఒలింపిక్స్‌లో ఆడడం అంత సులభం కాదు. ఈ మరి వెటరన్లు కెరీర్‌లు కొనసాగిస్తారా.. లేక 2028 ఒలింపిక్స్‌కు ముందే ముగిస్తారా అనేది చూడాలి. 

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని