Rishabh Pant: రిషభ్‌ పంత్‌కు జరిమానా విధించాల్సిందే: ఆడమ్ గిల్‌క్రిస్ట్‌

లఖ్‌నవూతో మ్యాచ్‌లో దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) అంపైర్లతో వాగ్వాదానికి దిగడం సరైంది కాదని మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్‌ వ్యాఖ్యానించాడు.

Published : 13 Apr 2024 11:24 IST

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూతో నిన్న జరిగిన మ్యాచ్‌లో దిల్లీ కెప్టెన్ రిషభ్‌ పంత్ (Rishabh Pant) అంపైర్‌తో స్వల్ప వాగ్వాదానికి దిగాడు. ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో (4వ ఓవర్‌) దేవదుత్‌ పడిక్కల్ బంతిని ఎదుర్కొన్నాడు. లెగ్‌సైడ్‌ వెళ్లడంతో ఫీల్డ్‌ అంపైర్‌ వైడ్‌గా సిగ్నల్‌ ఇచ్చాడు. పంత్ వెంటనే రివ్యూ కోసం అడిగినట్లు కనిపించింది. సమీక్షలో వైడ్‌గానే నిర్ధరణ అయింది. ఆ తర్వాత తాను రివ్యూ అడగలేదని అంపైర్‌తో పంత్ చర్చించాడు. దీనిపై ఆసీస్‌ మాజీ వికెట్ కీపర్, కామెంటేటర్‌ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ స్పందిస్తూ.. పంత్‌ చర్యలపై అసహనం వ్యక్తం చేశాడు.

‘‘ఫీల్డ్‌ అంపైర్లకు మ్యాచ్‌పై మరింత నియంత్రణ అవసరం. ఏ ఫార్మాట్‌లోనైనా తప్పదు. ఇంకాస్త సమర్థవంతంగా విధులను నిర్వర్తించాలంటే అంపైర్లకు అధికారం ఉండాలి. పంత్ రివ్యూ అడిగాడా? లేదా? అనేది ఇక్కడ వివాదంగా మారింది. వారి మధ్య సమాచార లోపం జరిగింది. దాని కోసం నాలుగు నిమిషాల పాటు చర్చించాల్సిన అవసరం లేదు. పంత్‌ అయినా, వేరొక ప్లేయర్‌ ఫిర్యాదు చేసినా అంపైర్‌ మాత్రం ‘ఇది ముగిసిపోయింది’ అనే సమాధానం ఇచ్చేలా ఉండాలి. అలాగే మాట్లాడుతూ ఉంటే ప్లేయర్లకు జరిమానా విధించాలి’’ అని గిల్‌క్రిస్ట్‌ వ్యాఖ్యానించాడు.

కాస్త రిలీఫ్‌ ఇచ్చే విజయం: పంత్

‘‘వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడంతో నిరాశకు గురయ్యాం. ఎలాగైనా గెలిచి తీరాలనే నిర్ణయంతో బరిలోకి దిగాం. ఛాంపియన్‌గా ఆడాలని మ్యాచ్‌కు ముందే అనుకున్నాం. బౌలింగ్ విషయంలో వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలని చెప్పాం. జట్టు కాంబినేషన్‌పై చర్చిస్తూనే ఉంటాం. సరైన తుది జట్టుతోనే బరిలోకి దిగాం. కొందరు ఆటగాళ్లకు గాయాలు కావడం మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తోంది. వచ్చిన అవకాశాన్ని ఫ్రేజర్ చక్కగా వినియోగించుకున్నాడు. కొత్త వన్‌డౌన్ బ్యాటర్‌ వచ్చేశాడు. టోర్నీలో ఇలాంటి ఆటతీరే కొనసాగిస్తాడని ఆశిస్తున్నాం’’ అని పంత్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని