Hardik Pandya: హార్దిక్‌-నటాషా విడిపోతున్నారా? పాండ్య పేరు తొలగించిన సతీమణి

Hardik Pandya: టీమ్‌ఇండియా క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ నుంచి విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన పేరు నుంచి పాండ్య పదాన్ని నటాషా తొలగించడం గమనార్హం.

Updated : 25 May 2024 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌లో ముంబయి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ స్థానంలో జట్టు పగ్గాలు చేపట్టిన నాటినుంచి హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) వార్తల్లోనే నిలుస్తున్నాడు. తాజాగా లీగ్‌ టోర్నీలో ముంబయి ఘోర వైఫల్యంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో పాండ్య వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ (Natasa Stankovic) నుంచి అతడు విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనస్పర్థలు రావడంతో వీరిద్దరూ విడాకులు (Divorce Rumours) తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల నటాషా తన ఇన్‌స్టా ఖాతాలో పాండ్యతో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను తొలగించింది. కేవలం కుమారుడితో ఇద్దరూ ఉన్న చిత్రాలను మాత్రమే ఉంచింది. అంతేకాదు.. ఇన్‌స్టా యూజర్‌నేమ్‌లో పాండ్య అనే పదాన్ని కూడా తీసేసింది. దీంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు వదంతులు మొదలయ్యాయి. సాధారణంగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వీరిద్దరూ ఈ మధ్య కలిసి ఉన్న ఫొటోలను పంచుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాండ్య పోస్ట్‌ చేసిన ఫొటోనే చివరిది.

అంతేకాదు.. ఐపీఎల్‌ టోర్నీ సమయంలోనూ నటాషా స్టాండ్స్‌లో కన్పించలేదు. ముంబయి, పాండ్యకు మద్దతుగా ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు. మార్చి 4న నటాషా పుట్టినరోజు సందర్భంగా పాండ్య విష్‌ చేయకపోవడం గమనార్హం. ఇవన్నీ విడాకుల ప్రచారానికి బలాన్నిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వదంతులపై పాండ్య దంపతులు స్పందించలేదు.

ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం.. ధోనీ ‘సింప్లిసిటీ’కి నెటిజన్లు ఫిదా!

2019 డిసెంబర్‌ 31న దుబాయ్‌లో పాండ్య.. సెర్బియా నటి నటాషా చేతికి ఉంగరం తొడిగి వినూత్నంగా తన ప్రేమను వ్యక్తపరిచి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో ఆమెను రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. 2020లో లాక్‌డౌన్‌లో తన భార్య గర్భిణి అని సోషల్‌మీడియాలో పెట్టినప్పుడే అతడికి పెళ్లైందని తెలిసింది. అదే ఏడాది జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే, అప్పుడు కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వీరిద్దరూ గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 14న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ప్యాలెస్‌లో హిందూ, క్రిస్ట్రియన్‌ పద్ధతుల్లో వివాహమాడారు. ఈ వేడుకకు పలువురు క్రికెట్‌, సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు