Dhoni-Jadeja: జడ్డూను అదే బాధించిందేమో.. వారి మధ్య వివాదాల్లేవు: సీఎస్‌కే సీఈవో

ధోనీ - జడేజా మధ్య (Dhoni - Jadeja) సోదరభావం ఉంటుంది. గురు శిష్యుల అనుబంధమూ కనిపిస్తుంది. కానీ, ఇటీవల ఐపీఎల్‌ 2023 (IPL 2023) సందర్భంగా వారి మధ్య జరిగిన స్వల్ప చర్చను విభేదాలుగా నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై సీఎస్‌కే సీఈవో స్పందించారు.

Published : 22 Jun 2023 11:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) ఎంఎస్ ధోనీ, స్టార్‌ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (MSD -Jaddu) మధ్య ఎలాంటి వివాదాలు లేవని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ స్పష్టం చేశారు. అయితే, జడేజాను మాత్రం ఓ విషయం బాధపెట్టి ఉండొచ్చని తన అభిప్రాయంగా చెప్పారు. తన ఔట్‌ కోసం సీఎస్‌కే అభిమానులు ప్రార్థిస్తుంటారని, ధోనీ బ్యాటింగ్‌ను చూడాలనేదే వారి ఆకాంక్షగా జడేజా గతంలో పేర్కొన్నాడు. తాజాగా సీఎస్‌కే సీఈవో ఇదే విషయంపై స్పందించారు.

‘‘జడేజా బౌలింగ్‌ సూపర్బ్‌. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే, సీఎస్‌కే బ్యాటింగ్ లైనప్‌ రుతురాజ్‌, కాన్వే, మొయిన్‌, రహానెతో టాప్‌ ఆర్డర్‌ ఉంటుంది. జడేజా బ్యాటింగ్‌కు వచ్చేసమయానికి కేవలం 10 బంతులే ఉంటాయి. అలాంటి వేళ ఒక్కోసారి క్లిక్‌ అవ్వొచ్చు. లేకపోతే కొట్టకుండా ఔటయ్యే అవకాశాలూ ఉన్నాయి. అతడి తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు వస్తాడని జడేజాకూ తెలుసు. ఓ రెండు లేదా మూడు బంతులు ఎదుర్కొంటాడు. స్టేడియంలోని ప్రేక్షకులు ధోనీని ఆహ్వానించేందుకు జడేజా త్వరగా ఔటై పోవాలని కోరుకొని ఉంటారు. ఇదే జడేజాకు బాధ కలిగించే అవకాశముంది. జడ్డూనే కాదు మరే ఇతర ఆటగాడికైనా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. దాంతో కాస్త ఒత్తిడికి గురి కావడం సహజం. అయితే, దీనిపై జడేజా ఎలాంటి ఫిర్యాదు చేయలేదనేది మనం గమనించాలి. తన ట్వీట్‌లోనూ ఇలాంటి అర్థం వచ్చేలా ఎప్పుడూ పోస్టులు పెట్టలేదు.

గేమ్‌లో ఇవన్నీ సాధారణం. దిల్లీతో మ్యాచ్‌ తర్వాత అభిమానులు చాలా వీడియోలను చూసి ఉంటారు. నేనేదో జడేజాను శాంతింపజేయడానికి ప్రయత్నించానని అనుకున్నారు. కానీ, అక్కడ అదేం జరగలేదు. కేవలం మ్యాచ్‌ గురించి మాత్రమే మాట్లాడా. అంతేకానీ, మరే ఇతర విషయాలు మా మధ్య చర్చకు రాలేదు. జట్టు వాతావరణం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏం జరింగిందనేది బయటకు ఎవరూ వెల్లడించరు. మాకైతే ఎలాంటి సమస్య కనిపించలేదు. ధోనీ పట్ల జడేజాకూ ఎప్పుడూ గౌరవభావమే ఉంది. ఫైనల్‌ తర్వాత కూడా కప్‌ను ధోనీకి అంకితం చేసినట్లు జడేజా ఇంటర్వ్యూల్లోనూ చెప్పాడు’’ అని కాశీ విశ్వనాథం వెల్లడించారు.

అప్పుడేం జరిగిందంటే..?

ఐపీఎల్ 2023 సీజన్‌ సందర్భంగా దిల్లీతో మ్యాచ్‌లో ధోనీ, జడేజా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు అప్పట్లో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో మరోసారి వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు కామెంట్లు వచ్చాయి. ‘కర్మ అనేది తప్పదు. వెంటనే కావచ్చు.. లేదా కాస్త ఆలస్యంగానైనా తిరిగి వస్తుంది’ అని జడేజా పోస్టు పెట్టాడు. అయితే, ఫైనల్‌లో జడేజానే వరుసగా సిక్స్‌, ఫోర్ కొట్టి సీఎస్‌కేకు ఐదో టైటిల్‌ను అందించాడు. దీంతో జడేజాను ఎత్తుకుని మరీ ధోనీ సంబరాలు జరిపాడు. అలాగే కప్‌ను కూడా జడేజాతోపాటు ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన అంబటిరాయుడుతో కలిసి అందుకోవడం సంచలనంగా మారింది. దీంతో వీరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని తేలిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని