Delhi Vs Chennai: రన్‌రేట్‌ విలువేంటో ధోనీకి తెలుసు.. మేం అక్కడ వెనకబడిపోయాం: స్టీఫెన్ ఫ్లెమింగ్

చాలా రోజుల తర్వాత మైదానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ను వీక్షించే అవకాశం అభిమానులకు దక్కింది. దిల్లీతో మ్యాచ్‌లో దూకుడుగా ఆడేశాడు.

Updated : 01 Apr 2024 14:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నైకి తొలి ఓటమి ఎదురైంది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 20 పరుగుల తేడాతో గెలిచింది. ఎంఎస్ ధోనీ 16 బంతుల్లోనే 37 పరుగులు చేయడం వల్ల ఓటమి అంతరం తగ్గింది. ఈ సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్‌ చేసిన ధోనీ అభిమానులను అలరించాడు. మహీ ముందే బ్యాటింగ్‌కు వచ్చుంటే చెన్నై విజయం సాధించే అవకాశం ఉండేదని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. దీనిపై చెన్నై ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌ స్పందించాడు.

‘‘ధోనీ అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. తీవ్రమైన గాయం నుంచి కోలుకుని వచ్చాక.. ఇలాంటి ఆటతీరును ఊహించలేదు. దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. క్లిష్టమైన మ్యాచ్‌లోనూ మాకు సానుకూల అంశం ఇదే. అతడి వల్లే కేవలం 20 పరుగుల తేడాతోనే మ్యాచ్‌ను కోల్పోయాం. రన్‌రేట్‌ ఎంత ముఖ్యమో ధోనీకి తెలుసు. దానికి అతడు ఆడిన విధానమే నిదర్శనం. ఈ ఓటమిపై సమీక్షించుకుంటాం. బ్యాటింగ్‌లో మేం ఆరంభంలోనే వెనుకబడ్డాం. బౌలింగ్‌లోనూ మొదట్లో ఎక్కువ పరుగులిచ్చాం. డేవిడ్ వార్నర్, రిషభ్‌ పంత్ దూకుడుగా ఆడటంతో దిల్లీ భారీ స్కోరు సాధించగలిగింది’’ అని ఫ్లెమింగ్‌ వ్యాఖ్యానించాడు.

కాలమే సమాధానం చెబుతుంది: రవిశాస్త్రి

చెన్నై కెప్టెన్సీని ధోనీ వదిలేయడంపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దిల్లీతో చెన్నై మ్యాచ్‌కు అతడు కామెంటేటర్‌గా వ్యవహరించాడు. ‘‘ధోనీకిదే చివరి సీజన్‌ అని చెబుతున్నారు. అది అతడి శరీరం, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్‌ మొత్తం ఆడతాడా? కొన్ని మ్యాచ్‌లకే పరిమితం అవుతాడా? అనేది కాలమే చెబుతుంది. కెప్టెన్సీ త్యజించడంలోనూ ధోనీ చాలా ముందు చూపుతో వ్యవహరించాడు. గతంలో జడేజా మాదిరిగా కాకుండా.. ఈసారి రుతురాజ్‌ విషయంలో పూర్తిస్వేచ్ఛ ఇచ్చేలా కెప్టెన్సీని వదిలేశాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా కొత్త కెప్టెన్‌ నిర్ణయాలు తీసుకుంటున్నాడు’’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని