Hyderabad Vs Chennai: రనౌట్‌ అప్పీలుపై వెనక్కి.. ధోనీని ఆలస్యంగా రప్పించేందుకేనా..?

సొంతమైదానంలో చెన్నైపై హైదరాబాద్‌ అద్భుత విజయం సాధించింది. అయితే, పాట్ కమిన్స్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది.

Updated : 06 Apr 2024 12:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్టార్‌ బ్యాటర్‌ ఎంఎస్ ధోనీ (MS Dhoni) చివరి ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. అయితే, అతడు ఇంకాస్త ముందుగానే బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉండేదని.. హైదరాబాద్‌ కెప్టెన్‌ పాట్ కమిన్స్‌ (Pat Cummins) నిర్ణయం వల్లే అలా జరగలేదని సోషల్ మీడియాలో చర్చకు తెరలేచింది. భారత మాజీ క్రికెటర్‌ మహమ్మద్‌ కైఫ్‌ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందంటే? 

హైదరాబాద్‌ పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ (Bhuvneswar Kumar) ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ వేశాడు. నాలుగో బంతిని రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఎదుర్కొన్నాడు. అద్భుతమైన యార్కర్‌ సంధించడంతో లెగ్‌సైడ్ ఆడే క్రమంలో బౌలర్‌ వద్దకే బంతి వెళ్లింది. ఈ క్రమంలో రన్‌ కోసం జడ్డూ కాస్త ముందుకు పరిగెత్తాడు. అయితే, భువీ బంతిని తీసుకొని స్ట్రైకర్‌ వికెట్ల వైపు విసిరాడు. అప్పుడే జడేజా వికెట్లను కవర్‌ చేసేలా వెనక్కి వెళ్లాడు. దీంతో బంతి జడేజాను తాకి పక్కకు వెళ్లింది. బ్యాటర్‌ ఉద్దేశపూర్వకంగా బంతిని అడ్డుకుంటే.. రనౌట్‌ అప్పీల్‌కు ఛాన్స్‌ ఉంది. వికెట్‌ కీపర్ క్లాసెన్‌, బౌలర్‌ భువీ ఇందు కోసం ప్రయత్నించినా.. కమిన్స్ మాత్రం వద్దని ఆగిపోయాడు. దీంతో ఫెయిర్‌ప్లే పాయింట్లు హైదరాబాద్ ఖాతాలో పడినప్పటికీ.. ధోనీ క్రీజులోకి రాకుండా ఉండేందుకే ఇలా చేశాడని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

‘‘అప్పీలును వెనక్కి తీసుకోవడంపై పాట్ కమిన్స్‌కు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. ఇబ్బంది పడుతున్న జడేజాను క్రీజ్‌లోనే ఉంచేందుకు ఇలాంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాడా? లేకపోతే ధోనీని అప్పుడే క్రీజ్‌లోకి రాకుండా చేయడానికి ఇలా చేశాడా? ఒకవేళ టీ20 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ చేస్తే.. కమిన్స్‌ ఇలానే స్పందిస్తాడా?’’ అని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. కొందరు కైఫ్‌కు మద్దతుగా పోస్టులు పెడుతుండగా.. మరికొందరు హైదరాబాద్‌ నిర్ణయాన్ని వెనకేసుకొస్తున్నారు. ఒకవేళ అప్పీలు చేసి ఉంటే థర్డ్‌ అంపైర్‌ రనౌట్‌గా ప్రకటించే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో వచ్చిన ధోనీ.. ఇంకాస్త ముందుగా 19వ ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు దిగేవాడు. వైజాగ్‌ తరహా మెరుపులను చూసి ఉండేవాళ్లమని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని