IPL 2024: నెల రోజుల్లో ఐపీఎల్-2024 సీజన్.. గాయాలబారిన కాన్వే, వార్నర్‌

ఇటీవలే ఐపీఎల్‌ 2024 (IPL 2024) షెడ్యూల్‌కు సంబంధించిన 15 రోజుల మ్యాచ్‌ల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఆటగాళ్లు గాయాలబారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Published : 24 Feb 2024 18:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ (IPL 2024) సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 15 రోజుల షెడ్యూల్‌ను ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఈ మెగా టోర్నీకి ముందు తమ ప్రధాన ఆటగాళ్లు గాయాలబారిన పడుతుండటం ఆయా ఫ్రాంచైజీల అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. గాయం తిరగబెట్టడంతో టీమ్‌ఇండియా స్టార్‌ బౌలర్ మహమ్మద్‌ షమీ దాదాపు ఐపీఎల్‌కు దూరమైనట్లే. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్‌ బ్యాటర్ డేవన్ కాన్వే కూడా గాయపడినట్లు సమాచారం.  ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఆసీస్‌ పర్యటన కొనసాగుతోంది. మూడో టీ20 ఆదివారం జరగనుంది. అయితే, వీరిద్దరూ గాయాల కారణంగా ఆ మ్యాచ్‌లో ఆడటం లేదు. దీంతో ఐపీఎల్‌ నాటికి కోలుకుని వస్తారా? లేదా? అనేది తెలియడం లేదు. 

కాన్వే బొటన వేలికి గాయం.. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవన్ కాన్వే ఓపెనర్‌గా సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడేస్తాడు. ప్రస్తుతం ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో ఎడమచేతి బొటనవేలికి గాయమైంది. కివీస్‌ బౌలర్ ఆడమ్‌ మిల్నే 140 కి.మీ వేగంతో సంధించిన బంతిని ఆపే క్రమంలో బొటనవేలిని తాకింది. దీంతో మధ్యలోనే మైదానం వీడాడు. అతడికి బదులు ఫిన్‌ అలెన్‌ కీపింగ్‌ బాధ్యతలు చేపట్టాడు. వెల్లింగ్టన్‌కు వెళ్లి ప్రత్యేక వైద్యుడిని సంప్రదిస్తాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కాన్వే గాయం పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయలేమని.. స్కానింగ్‌ తీసి వైద్యబృందం పరిశీలించాక తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కనీసం నాలుగైదు వారాల విశ్రాంతి తీసుకుంటే మాత్రం తొలి ఫేజ్‌లో చెన్నై ఆడే కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. 

గజ్జల్లో నొప్పి కారణంగా వార్నర్ దూరం..

వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా టాప్‌ ప్లేయర్‌ డేవిడ్ వార్నర్‌ ప్రస్తుతం టీ20ల్లోనే ఆడుతున్నాడు. ఇటీవల ఇంటర్నేషనల్‌ లీగ్‌లోనూ ప్రాతినిధ్యం వహించిన వార్నర్‌ను కివీస్‌తో టీ20 సిరీస్‌కు మేనేజ్‌మెంట్ ఎంపిక చేసింది. అయితే, రెండో మ్యాచ్‌ అనంతరం గజ్జల్లో నొప్పి తిరగబెట్టింది. చివరి టీ20కి అందుబాటులో ఉండడని ఆసీస్‌ క్రికెట్ బోర్డు వెల్లడించింది. దీంతో ఐపీఎల్‌లో వార్నర్‌ ఆడటంపై అనుమానాలు రేకెత్తాయి. దిల్లీ క్యాపిటల్స్‌ సారథిగా ఉన్న వార్నర్‌ ఒకవేళ దూరమైతే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. మరోవైపు రిషభ్‌ పంత్‌ కోలుకుని వస్తాడనే సంబరం దిల్లీకి లేకుండా పోతుంది. అయితే, దాదాపు నెల రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో వార్నర్‌ ఐపీఎల్‌ నాటికి సిద్ధంగా ఉంటాడని దిల్లీ క్యాపిటల్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు