DC vs SRH: అక్షర్‌ను ఆ స్థానంలో ఎందుకు పంపానంటే..?: డేవిడ్ వార్నర్

హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలు కావడంతో దిల్లీ క్యాపిటల్స్‌ (DC vs SRH) పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. విజయానికి చేరువగా వచ్చి మరీ ఓడిపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని డీసీ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ అన్నాడు.

Updated : 30 Apr 2023 12:06 IST

ఇంటర్నెట్ డెస్క్: సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో దిల్లీ క్యాపిటల్స్ ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. ఉప్పల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించిన దిల్లీ.. ఇక్కడ మాత్రం చివర్లో తడబాటుకు గురై పరాజయంపాలైంది. మిచెల్‌ మార్ష్‌ (63), ఫిలిప్‌ సాల్ట్ (59) దూకుడుగా ఆడటంతో 11 ఓవర్లలో 111/1 స్కోరుతో విజయం వైపుగా దూసుకెళ్తున్న దిల్లీ ఆ తర్వాత వికెట్లను కోల్పోతూ కష్టాల్లో పడింది. అయితే, అక్షర్ పటేల్ (29*: 14 బంతుల్లో) చివరి వరకు పోరాడాడు. ఈ క్రమంలో అతడిని ఇంకాస్త ముందుగా పంపించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదనే అభిప్రాయం దిల్లీ అభిమానుల్లో కలిగింది. దానిపై మ్యాచ్‌ అనంతరం డీసీ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

‘‘అక్షర్‌ పటేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మేం మంచి ఆరంభం సాధించాం. అక్షర్‌ను లోయర్‌ ఆర్డర్‌లో పంపించడానికి కారణం ఉంది. స్పిన్‌ బౌలింగ్‌లో లెఫ్ట్‌ హ్యాండర్లు ఆడటం కాస్త కష్టంగా అనిపించింది. అందుకే అక్షర్‌ను లోయర్‌ ఆర్డర్‌లో ఉంచాం. మ్యాచ్‌ మా చేతిలో ఉందనిపించినప్పుడు మరో ఆలోచన చేయలేదు. పరిస్థితులు ఒక్కసారిగా కఠినంగా మారాయి. అతడిని ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. 9 పరుగుల తేడాతో ఓడిపోవడం నిరుత్సాహపరిచింది. తొలుత మా బౌలర్లు కాస్త పరుగులు అదనంగా ఇచ్చారు. అయితే, మిచెల్ మార్ష్‌ మాత్రం అద్భుతమైన బౌలింగ్‌తో అలరించాడు. అతడు మా బెస్ట్‌ బౌలర్. అయితే ఛేదన చివరి దశలో కాస్త వెనుకబడిపోయాం. సాల్ట్, మార్ష్‌లో ఒకరు చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నా విజయం మా సొంతమయ్యేది. నాతో సహా సీనియర్లు బాధ్యత తీసుకోవాలి’’ అని వార్నర్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని