David Warner: సెహ్వాగ్ రికార్డును బ్రేక్‌ చేసిన డేవిడ్ వార్నర్.. టాప్‌ 5లోకి ఎంట్రీ

Eenadu icon
By Sports News Team Published : 20 Jun 2023 16:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్ వార్నర్ (David Warner) అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ (36) పరుగులు చేసి రాబిన్సన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్  (Virender Sehwag) రికార్డును అధిగమించాడు. ఇప్పటివరకు 105 టెస్టులు ఆడిన వార్నర్‌.. ఓపెనర్‌గా 8,208 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ జాబితాలో సెహ్వాగ్ 8,207 పరుగులతో ఐదో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా ఓపెనర్ సెహ్వాగ్‌ను వెనక్కినెట్టి టాప్‌-5లోకి ఎంట్రీ ఇచ్చాడు. 

టెస్టుల్లో ఓపెనర్‌గా ఎక్కువ పరుగులు చేసిన వారిలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్ (11,845 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా.. భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ (9,607 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ (9,030 పరుగులు) మూడో స్థానంలో ఉండగా.. ఆసీస్ మాజీ ప్లేయర్ మథ్యూ హేడెన్‌ (8,625 పరుగులు) నాలుగో స్థానంలో నిలిచాడు. 

ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు అంచనాలకు తగ్గట్లే నువ్వానేనా అన్నట్లు సాగుతోంది.  281 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. నాలుగో రోజు, సోమవారం ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. చివరి రోజు ఆస్ట్రేలియా  మరో 174 పరుగులు చేస్తే విజయాన్ని సొంతం చేసుకుంటుంది. తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో ఖవాజా (34 బ్యాటింగ్‌) మరోసారి పట్టుదలతో క్రీజులో నిలిచాడు. అతడికి తోడుగా నైట్‌ వాచ్‌మెన్ బోలాండ్‌ (13 బ్యాటింగ్‌) ఉన్నాడు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 273 పరుగులకు ఆలౌటైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు