DC vs RCB: సిరాజ్‌పై మా ‘మాస్టర్‌ ప్లాన్’అదే: డేవిడ్ వార్నర్

బెంగళూరుపై విజయం సాధించిన దిల్లీ క్యాపిటల్స్ (DC vs RCB) పాయింట్ల పట్టికలో ఒక అడుగు ముందుకేసింది. చివరి స్థానం నుంచి 9వ స్థానంలోకి చేరింది.

Published : 07 May 2023 15:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2023 సీజన్‌లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరుపై దిల్లీ క్యాపిటల్స్‌ (DC vs RCB) ప్రతీకార విజయం నమోదు చేసింది. ఆర్‌సీబీ నిర్దేశించిన 182 పరుగుల టార్గెట్‌ను కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలోనే ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఫిలిప్ సాల్ట్ (87: 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌ సందర్భంగా సాల్ట్‌, ఆర్‌సీబీ పేసర్ మహమ్మద్ సిరాజ్ మధ్య చిన్నపాటి కవ్వింపు వ్యవహారం చోటు చేసుకుంది. అయితే, సహచరులు ఇరువురికి సర్ది చెప్పడంతో వాగ్వాదం జరగకుండా అడ్డుకోగలిగారు. మ్యాచ్‌ అనంతరం ఇదే విషయంపై దిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. సిరాజ్‌ మాస్టర్‌ ప్లాన్‌ వెనుక ఉన్న సీక్రెట్‌ను వెల్లడించాడు.

‘‘బెంగళూరు నిర్దేశించిన లక్ష్యం ఛేదించదగినదేనని నేను భావించా. రెండో ఇన్నింగ్స్‌లో బంతి ఎక్కువగా జారిపోవడం వల్ల బౌలర్లకు ఇబ్బందిగా మారింది. మా బ్యాటర్ ఫిలిప్‌ సాల్ట్ దూకుడుగా ఆడటంతో విజయం సాధించగలిగాం. మహమ్మద్ సిరాజ్‌ బౌలింగ్‌ను ఆడేందుకు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగాం. ఈ సీజన్‌లో చాలా అద్భుతంగా బౌలింగ్‌ వేస్తున్నాడు. అతడు ఎక్కువగా బౌల్డ్‌ చేయడం, ఎల్బీ రూపంలో వికెట్లు తీస్తాడు. అందుకే అతడి లైన్‌ అండ్ లెంగ్త్‌ బౌలింగ్‌ గతిని తప్పించాలని భావించాం. ఇందులో సక్సెస్‌ అయ్యాం. స్పీడెస్టర్‌ ఆన్రిచ్ నోకియా లేకపోయినా మా సీనియర్‌ బౌలర్ ఇషాంత్ శర్మ నేతృత్వంలోని బౌలింగ్‌ దళం అద్భుతంగా రాణించింది. ఖలీల్‌, ఇషాంత్, కుల్‌దీప్‌ యాదవ్, అక్షర్ పటేల్ వికెట్లు తీస్తూ బెంగళూరుపై ఒత్తిడి పెంచారు. సరైన సమయంలోనే ఫామ్‌లోకి వచ్చామని భావిస్తున్నా. తదుపరి మ్యాచ్‌లో చెన్నైతోనూ ఇదే ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం’’ అని వార్నర్‌ తెలిపాడు. 

ధోనీతో సమంగా వార్నర్

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తన ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగులు చేస్తున్నాడు. పది మ్యాచుల్లో నాలుగు అర్ధశతకాలతో 330 పరుగులు చేసిన వార్నర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా బెంగళూరుతో మ్యాచ్‌లో 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆర్‌సీబీపై 31 మ్యాచుల్లో సెంచరీ, నాలుగు అర్ధశతకాల సాయంతో 839 పరుగులు సాధించిన వార్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీని సమం చేశాడు. ధోనీ కూడా 31 ఇన్నింగ్స్‌ల్లో 41.90 సగటుతో 839 పరుగులు చేశాడు. వీరిద్దరి తర్వాత ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ (785 పరుగులు), చెన్నై బ్యాటర్ అంబటి రాయుడు (714 పరుగులు) ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని