IND vs ENG: ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌ 219/7.. ఇంగ్లాండ్‌కు కలిసొచ్చిన ‘అంపైర్స్‌ కాల్’

రాంచీలో నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిసింది. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో ఆధిపత్యం ప్రదర్శించింది.

Updated : 24 Feb 2024 17:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో (IND vs ENG) టీమ్‌ఇండియా పోరాడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజ్‌లో కుల్‌దీప్‌ యాదవ్ (17*), ధ్రువ్‌ జురెల్ (30*) ఉన్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు ఇప్పటికే 106 బంతుల్లో 42 పరుగులు జోడించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73) మరోసారి తన ఫామ్‌ను కొనసాగిస్తూ హాఫ్‌ సెంచరీ చేశాడు. శుభ్‌మన్‌ గిల్ (38) ఫర్వాలేదనిపించాడు. రోహిత్ శర్మ (2), రజత్‌ పటీదార్ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్‌ (14), రవిచంద్రన్ అశ్విన్ (1) విఫలమయ్యారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బషీర్‌ 4 వికెట్లు, టామ్‌ హార్ట్‌లీ 2, అండర్సన్ ఒక వికెట్‌ తీశారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఇంకా 134 పరుగుల వెనకంజలో ఉంది. 

ఇంగ్లాండ్‌కు కలిసొచ్చిన ‘అంపైర్స్‌ కాల్’

గత టెస్టులో తమ బ్యాటర్ జాక్‌ క్రాలే ‘అంపైర్స్‌ కాల్’ వల్ల ఔట్‌ కావడంపై అసహనం వ్యక్తం చేసిన ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌లో మాత్రం బాగా కలిసొచ్చింది. టీమ్‌ఇండియా ముగ్గురు బ్యాటర్లు ఇలానే పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. మరి ఈసారి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్ స్టోక్స్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

  • రోహిత్ శర్మ త్వరగానే పెవిలియన్‌కు చేరినప్పటికీ.. రెండో వికెట్‌కు యశస్వితో కలిసి గిల్ 82 పరుగులు జోడించాడు. మంచి ఊపులో ఉన్నప్పుడు ‘అంపైర్స్‌ కాల్’ వల్ల గిల్ ఔట్‌ కావాల్సి వచ్చింది. బషీర్‌ వేసిన (24.1వ ఓవర్) బంతిని ఆడే క్రమంలో గిల్‌ ప్యాడ్లను తాకింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు అప్పీలు చేయడంతో ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇచ్చేశాడు. దీనిపై భారత్ డీఆర్‌ఎస్‌ తీసుకుంది. అక్కడ ఇంపాక్ట్‌లో ‘అంపైర్స్‌ కాల్’ రావడంతో గిల్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. 
  • మరో యువ ఆటగాడు రజత్‌ పటీదార్‌ కూడా ఇలానే ఔటయ్యాడు. బషీర్ బౌలింగ్‌లోనే (34.3వ ఓవర్) ఎల్బీ అయ్యాడు. అదీనూ ‘అంపైర్స్‌ కాల్‌’ వల్ల భారత్‌ వికెట్‌ను నష్టపోవాల్సి వచ్చింది.
  • రవిచంద్రన్ అశ్విన్‌ను టామ్‌ హార్ట్‌లీ (55.2వ ఓవర్) ఎల్బీ చేశాడు. భారత్‌ డీఆర్‌ఎస్‌ తీసుకుంది. బంతి లెగ్‌స్టంప్‌ చివరిన తాకడంతో ‘అంపైర్స్‌ కాల్‌’ అని సమీక్షలో వచ్చింది. అయితే, ఫీల్డ్‌ అంపైర్‌ ఔట్‌ ఇవ్వడంతో అశ్విన్‌ పెవిలియన్‌ బాట పట్టకతప్పలేదు. 

ఓలీ రాబిన్‌సన్ హాఫ్‌ సెంచరీ..

ఓవర్‌నైట్‌ 302/7 స్కోరుతో రెండో రోజును ప్రారంభించిన ఇంగ్లాండ్‌ ఆరంభంలో బాగానే ఆడింది. ఓలీ రాబిన్‌సన్ (58) హాఫ్‌ సెంచరీ సాధించాడు. రవీంద్ర జడేజా ఈ జోడీని విడగొట్టాడు. చివరి మూడు వికెట్లను జడ్డూనే తీయడం విశేషం. క్రీజ్‌లో ఒకవైపు జో రూట్ (122*) పాతుకు పోయాడు. బషీర్‌ (0), అండర్సన్ (0) డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. దీంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌ దీప్‌ 3, సిరాజ్ 2, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు