Team India: కుర్రాళ్లోయ్‌ కుర్రాళ్లు.. అరంగేట్రంలో సత్తా చాటుతున్న క్రికెటర్లు

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణిస్తే జట్టులో స్థానం శాశ్వతమవుతుంది. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేస్తే గుర్తింపు దక్కించుకోవడం తేలికవుతుంది.  

Published : 24 Feb 2024 10:03 IST

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌. వ్యక్తిగత కారణాలతో కోహ్లి సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయంతో కేఎల్‌ రాహుల్‌ మూడు టెస్టుల్లో ఆడలేదు. శ్రేయస్‌ కూడా దూరమయ్యాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో అనుభవలేమి. కానీ సిరీస్‌లో 2-1తో భారత్‌దే ఆధిక్యం. ఇక అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ప్రధాన పేసర్‌ బుమ్రాకు నాలుగో టెస్టుకు విశ్రాంతినిచ్చారు. అయినా తొలి సెషన్‌లోనే అయిదు వికెట్లు డౌన్‌. ఇంగ్లిష్‌ జట్టుపై ఈ ఆధిపత్యానికి ప్రధాన కారణం భారత యువ ఆటగాళ్లు. ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసిన కుర్రాళ్లు.. అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ సత్తాచాటుతున్నారు. అద్భుత నైపుణ్యాలు ప్రదర్శిస్తూ.. జట్టు భవిష్యత్‌పై భరోసా కల్పిస్తున్నారు. 

వస్తూనే వికెట్ల వేట

అయిదు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమ్‌ఇండియా.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో వర్క్‌ లోడ్‌ మేనేజ్‌మెంట్‌ కారణంతో నాలుగో టెస్టుకు బుమ్రాకు జట్టు విశ్రాంతినిచ్చింది. దీంతో యువ పేసర్‌ ఆకాశ్‌దీప్‌కు అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఈ పేసర్‌ వస్తూనే అదరగొట్టాడు. బౌన్స్, స్వింగ్‌తో ఇంగ్లాండ్‌ బ్యాటర్లను హడలెత్తించాడు. నిప్పుల్లాంటి బంతులతో చెలరేగాడు. రెండు ఓవర్ల వ్యవధిలో ఇంగ్లాండ్‌ టాప్‌-3 బ్యాటర్లను ఔట్‌ చేసి సత్తాచాటాడు. నిలకడగా ఒకే లెంగ్త్‌లో బౌలింగ్‌ చేసి వికెట్లు రాబట్టాడు. తొలి టెస్టు ఆడుతున్నాననే ఒత్తిడి లేకుండా, ఎలాంటి కంగారు లేకుండా ఆకాశ్‌ గొప్పగా బంతులేశాడు. 27 ఏళ్ల ఈ బెంగాల్‌ పేసర్‌ 30 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 23.58 సగటుతో 104 వికెట్లు పడగొట్టడం విశేషం. 28 లిస్ట్‌- ఎ మ్యాచ్‌ల్లో 24.50 సగటుతో 42 వికెట్లు, 41 టీ20 మ్యాచ్‌ల్లో 22.81 సగటుతో 48 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

బ్యాటింగ్‌లో అదుర్స్‌

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆకాశ్‌దీప్‌తో కలిసి ఇప్పటికే నలుగురు భారత ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశారు. రెండో టెస్టు నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం ఓ అరంగేట్ర ఆటగాడు బరిలో దిగాడు. విశాఖలో జరిగిన రెండో టెస్టులో రజత్‌ పటీదార్‌ అవకాశం దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. అత్యున్నత స్థాయిలో ఆడే ప్రతిభ ఉందనే సంకేతాలు పంపించాడు. కానీ ఆ తర్వాత మూడు ఇన్నింగ్స్‌లో అవకాశాలను వృథా చేసుకున్న అతను.. సత్తాచాటాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టులో సర్ఫరాజ్‌ ఖాన్, ధ్రువ్‌ జూరెల్‌ టెస్టు టోపీలు అందుకున్నారు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా అవకాశం దక్కక నిరాశకు లోనైన 26 ఏళ్ల సర్ఫరాజ్‌.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వచ్చిన ఛాన్స్‌ను వదులుకోలేదు. వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించాడు. ఈ ముంబయి ఆటగాడు దూకుడైన బ్యాటింగ్‌తో అలరించాడు. అరంగేట్ర టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధసెంచరీలు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. మరోవైపు వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ కూడా ఆకట్టుకున్నాడు. 23 ఏళ్ల ఈ ఉత్తరప్రదేశ్‌ ఆటగాడు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేశాడు. ఓపికతో క్రీజులో నిలబడి ఉత్తమ పరిణతి ప్రదర్శించాడు. ఇలా కుర్రాళ్లు అరంగేట్రంలోనే అదరగొడుతున్నారు. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నారు. సంధి దశలో ఉన్న జట్టుకు భరోసా కల్పిస్తున్నారు. యువ ఆటగాళ్ల ప్రదర్శన చూస్తుంటే.. భారత క్రికెట్‌కు ఢోకా లేదనిపిస్తోంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని