విమానంలో ఫుడ్‌ పెట్టలేదు.. లగేజ్‌ ఇంకా ఇవ్వలేదు: ఎయిర్‌లైన్స్‌పై మండిపడ్డ క్రికెటర్‌

మలేషియన్స్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో తమకు దారుణమైన పరిస్థితి ఎదురైందని క్రికెటర్‌ దీపక్‌ చాహర్‌ వివరించారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ ఆ సంస్థపై మండిపడ్డాడు.

Updated : 03 Dec 2022 15:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌లో భారత క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో దారుణమైన అనుభవాన్ని చవి చూశామని ఈ మేరకు బౌలర్‌ దీపక్‌ చాహర్‌ ట్వీట్‌ చేశాడు. తమ లగేజీని ఇంకా ఇవ్వలేదని..  బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించిన తమకు ఎలాంటి ఆహారం కూడా అందించలేదని అతడు ఆరోపించాడు.

న్యూజిలాండ్‌ నుంచి ఢాకాకు మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌  విమానంలో చాహర్‌తోపాటు సిరాజ్‌, శార్దుల్‌ ఠాకూర్‌, ధావన్‌, గిల్‌, సుందర్‌ వచ్చారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌ కోసం టీమ్‌ ఇండియా జట్టుతో కలిశారు. అయితే ఈ ప్రయాణంలో తాము ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు చాహర్‌ తెలిపాడు. ‘మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌లో దారుణమైన అనుభవం ఇది. మొదట ఎలాంటి సమాచారం లేకుండా మా విమానాన్ని మార్చారు. బిజినెస్‌ క్లాస్‌లో మాకు ఆహారం అందించలేదు. ఇక మేం మా లగేజ్‌ కోసం 24 గంటలుగా వేచి చూస్తున్నాం. రేపు మాకు మ్యాచ్‌ ఉంది. మా పరిస్థితిని ఊహించుకోండి’ అంటూ చాహర్‌ శనివారం ట్రైనింగ్‌ సెషన్‌కు ముందు ట్వీట్‌ చేశాడు. దీనిపై మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ కంప్లైంట్‌ లింక్‌ పంపించగా.. అది ఓపెన్‌ కావడం లేదని చాహర్‌ పేర్కొన్నాడు. ఆ తర్వాత ఫ్లైట్‌ ఛేంజ్‌కు సంబంధించి విమానయాన సంస్థ బదులిచ్చింది. ‘అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం. వాతావరణ, సాంకేతిక కారణాల వల్ల అలా జరిగింది’ అంటూ పేర్కొంది. ఆదివారం నుంచి భారత్‌,బంగ్లాదేశ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని