Deepika pallikal: ఈ ఛాంపియన్‌.. క్రికెటర్‌ భార్య, కవలల అమ్మ

అమ్మయ్యాక కూడా ఆటలో అద్భుతాలు చేయొచ్చని స్క్వాష్‌ స్టార్‌ దీపిక పల్లికల్‌ చాటుతోంది. ఆమె క్రీడా ప్రయాణం తెలుసుకోండి.

Published : 07 Oct 2023 09:52 IST

స్క్వాష్‌ స్టార్‌ దీపిక పల్లికల్‌

దీపిక పల్లికల్‌.. స్క్వాష్‌ క్రీడతో పరిచయం ఉన్న అభిమానులకు బాగా తెలిసిన పేరు ఇది. అలాగే క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌నూ అనుసరించే వాళ్లకూ ఈ పేరు తెలుసు. అదెలా అంటారా? దినేశ్‌ కార్తీక్‌ భార్యనే ఈ దీపిక. ఇప్పుడు ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్‌ టీమ్‌లో చారిత్రక పతకంతో మరోసారి తన పేరు మార్మోగేలా చేసింది ఈ స్క్వాష్‌ దిగ్గజం. ఆటలో అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతూ.. మధ్యలో దినేశ్‌తో ప్రేమాయణం, పెళ్లి.. అనంతరం ఇద్దరు కవలలకు జన్మనివ్వడం.. ఇప్పుడు మళ్లీ దేశానికి పతకాలు అందించడం.. ఇదే దీపిక జీవితం. అమ్మయ్యాక కూడా ఆటలో అద్భుతాలు చేయొచ్చని ఆమె చాటుతోంది. 

తల్లి క్రికెటర్‌..

కేరళలోని కొట్టాయంలో దీపిక జన్మించింది. ఆమె తల్లి సుసాన్‌ పల్లికల్‌ భారత మాజీ మహిళా క్రికెటర్‌. టెస్టుల్లో, వన్డేల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించింది. అందుకే దీపిక రక్తంలోనే ఆట ఉందనే చెప్పొచ్చు. స్క్వాష్‌ను కెరీర్‌గా ఎంచుకున్న దీపిక అంచెలంచెలుగా ఎదిగింది. 2006లో ప్రొఫెషనల్‌ కెరీర్‌ మొదలెట్టిన ఆమె.. ఆరంభంలో ఒడుదొడుకులు ఎదుర్కొంది. 2011 నుంచి నిలకడగా విజయాలు సాధించడం ప్రారంభించింది. భారత స్క్వాష్‌ సత్తాను ప్రపంచానికి చాటింది. ప్రపంచ మహిళల స్క్వాష్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో చోటు దక్కించుకున్న తొలి భారత క్రీడాకారిణి దీపికనే. ఆటలోనే కాదు పోరాటంలోనూ ఆమె వెనక్కి తగ్గదు. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పురుషులతో సమానంగా మహిళలకు నగదు బహుమతి ఇవ్వాలని దీపిక పట్టుబట్టింది. ఈ డిమాండ్‌తో 2012 నుంచి 2015 వరకు జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఆడలేదు. 2016లో పురుషులతో పాటు మహిళలకు సమానంగా నగదు బహుమతి ఇస్తామని ప్రకటించడంతో జాతీయ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడీ విజేతగానూ నిలిచింది. 32 ఏళ్ల దీపిక 2012లో అర్జున, 2014లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది. 

దినేశ్‌తో ప్రేమ..

దినేశ్, దీపిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమాయణం జిమ్‌లో మొదలైంది. ఇద్దరూ ఒకే జిమ్‌కు వెళ్లేవాళ్లు. దీపికతో తొలి చూపులోనే దినేశ్‌ ప్రేమలో పడిపోయాడు. మొదట స్నేహితులుగా మొదలై.. అనంతరం ప్రేమికులుగా మారారు. 2013లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2015 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. 2021 అక్టోబర్‌లో కవలలు కబీర్, జియాన్‌కు దీపిక జన్మనిచ్చింది. 2018 నుంచి తల్లి కావడానికి ప్రయత్నించిన దీపిక ఆటకు నాలుగేళ్ల పాటు దూరంగా ఉంది. ఫెర్టిలిటీ చికిత్స తీసుకుంది. ఈ సమయంలో ఖాళీగా ఉండలేక ఇంటీరియర్‌ డిజైనింగ్‌ వ్యాపారాన్ని కూడా నెలకొల్పింది. తిరిగి 2022లో ఆటలో అడుగుపెట్టింది. తల్లిగా మారిన తర్వాత మళ్లీ ఆటలోకి రావడం అంత సులువు కాదు. శారీరకంగా జరిగే మార్పులను తట్టుకుని, ఆటకు తగ్గట్లుగా ఫిట్‌నెస్‌ సాధించడమే సవాలే. కానీ దీపిక ఆత్మవిశ్వాసంతో సాగింది. సవాళ్ల ప్రయాణంలో ముందడుగు వేసింది. తిరిగి మునుపటి జోరు అందుకుంది. 

నిరుడు ప్రపంచ డబుల్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు స్వర్ణాలు (మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌) గెలిచి ఔరా అనిపించింది. ఈ ప్రపంచ డబుల్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె 2016లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం, మహిళల డబుల్స్‌లో కాంస్యం, 2017 మహిళల డబుల్స్‌లో కాంస్యం కూడా గెలిచింది. 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ కాంస్యంతో సత్తాచాటింది. ఈ క్రీడల్లో గతంలోనే ఆమె ఓ స్వర్ణం, రెండు రజతాలు నెగ్గింది. ఇప్పుడు ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హరిందర్‌తో కలిసి ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. దీని కంటే ముందు ఓ రజతం, నాలుగు కాంస్యాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. దీపిక, దినేశ్‌ ఒకరికొకరు అండగా నిలుస్తూ, ప్రోత్సహించుకుంటూ సాగుతున్నారు. దినేశ్‌ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీపిక మద్దతుగా నిలిచింది. దీంతో ఐపీఎల్‌లో రాణించిన అతను మళ్లీ టీమ్‌ఇండియాలోకి రాగలిగాడు. ఇప్పుడు దినేశ్‌ ప్రోత్సాహంతో దీపిక అదరగొడుతోంది. తల్లి, భర్త క్రికెటర్లయినప్పటికీ దీపికకు మొదట్లో ఈ ఆటంటే ఇష్టం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు భర్త కోసం మ్యాచ్‌ల చూస్తోంది. ‘‘ఎన్నో త్యాగాలు చేశాం. కానీ కలలను త్యాగం చేయాలని కాదు. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కూడా తిరిగి ఆటలోకి రావొచ్చు. పోటీల కోసం పిల్లలను వదిలి వచ్చామనే బాధ ఉంటుంది. కానీ తప్పదు. అమ్మ సరదా కోసం కాదు.. దేశానికి పతకం అందించడానికి చైనాకు వెళ్లిందని పిల్లలు పెద్దయ్యాక తెలుసుకుంటారు’’ అని దీపిక గర్వంగా చెబుతోంది. 

- ఈనాడు క్రీడా విభాగం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని