ENGLAND: అప్పుడు లంక, ఆసీస్.. ఇప్పుడు ఇంగ్లాండ్.. 1992, 1999 టోర్నీలను మించి ఛాంపియన్‌ పతనం

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఇంగ్లాండ్‌ కేవలం ఒక్క విజయం, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ ఈసారి సెమీస్‌కు చేరుకోవడం దాదాపు కష్టమే.

Updated : 27 Oct 2023 15:36 IST

ప్రపంచకప్ (ODI World Cup 2023) వస్తోందంటే.. ఆటోమేటిగ్గా గత పర్యాయం కప్పు గెలిచిన జట్టు మీద అందరి దృష్టీ నిలుస్తుంది. నాలుగేళ్ల ముందు కప్పు గెలిచిన జట్టుపై.. తర్వాతి టోర్నీలోనూ మంచి అంచనాలుండటం సహజం. మరోసారి కప్పు గెలవకపోయినా.. మెరుగైన ప్రదర్శనను ఆశిస్తారు ఆ జట్టు అభిమానులు. ఐతే ప్రపంచకప్ చరిత్రలో డిఫెండింగ్ ఛాంపియన్ తర్వాతి టోర్నీలో నిరాశపరిచిన సందర్భాలు రెండే. 1992లో ఆస్ట్రేలియా, 1999లో శ్రీలంక అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. సాధారణ ప్రదర్శనతో సెమీస్ చేరకుండానే నిష్క్రమించాయి. ఐతే అప్పుడు ఆ జట్లే ఎంతో నయం అనిపించేలా.. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ప్రపంచకప్‌లో ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. అద్భుతాలు జరిగితే తప్ప 2019 ఛాంపియన్.. 2023లో సెమీస్ చేరడం అసాధ్యం.

ఇంగ్లాండ్‌ దాసోహం.. శ్రీలంక చేతిలో చిత్తు

1975లో తొలి వన్డే ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న వెస్టిండీస్.. రెండో కప్పులో కూడా అంచనాలను నిలబెట్టుకుంటూ టైటిల్ సాధించింది. 1983లోనూ ఆ జట్టు ఫైనల్ చేరింది. భారత్‌కు కప్పును కోల్పోయింది. ఆ టోర్నీలో విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా.. తర్వాతి కప్పులో సెమీస్‌లో ఓడింది. కానీ డిఫెండింగ్ ఛాంపియన్ అంచనాలకు తగ్గ ప్రదర్శన చేయకపోవడం తొలిసారి 1992లో జరిగింది. 1987 విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. 1992లో సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాకపోతే ఆసీస్.. గ్రూప్ దశలో పాకిస్థాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్ల చేతిలోనే ఓటములు చవిచూసింది. 1992 విజేత పాకిస్థాన్ 1996లో బాగానే ఆడింది. కానీ క్వార్టర్స్‌లో భారత్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ 1996 విజేత శ్రీలంక 1999కు వచ్చేసరికి తుస్సుమనిపించింది. ఎంతమాత్రం ఛాంపియన్ జట్టులా అది కనిపించలేదు. సూపర్-6లో ఐదు మ్యాచ్‌లాడి జింబాబ్వే, కెన్యా లాంటి చిన్న జట్ల మీద మాత్రమే నెగ్గి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 1999లో ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా ఆ తర్వాతి రెండు టోర్నీల్లోనూ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ జట్టు 2011లో క్వార్టర్స్ వరకు వచ్చింది. అక్కడ భారత్ చేతిలో ఓడింది. ఆ టోర్నీలో కప్పు నెగ్గిన భారత్.. 2015లో సెమీస్‌లో ఓడింది. 2015లో మళ్లీ విజేతగా నిలిచిన ఆసీస్.. 2019లో సెమీస్ వరకు వచ్చింది. కానీ 2019లో తొలిసారి ప్రపంచకప్‌ను ఒడిసిపట్టిన ఇంగ్లాండ్ మాత్రం.. ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగి తుస్సుమనిపించింది. ఇప్పటిదాకా అయిదు మ్యాచ్‌లు ఆడి ఒక్క బంగ్లాదేశ్ మీద మాత్రమే నెగ్గిన ఇంగ్లిష్ జట్టు.. అఫ్గానిస్థాన్, శ్రీలంక లాంటి బలహీన జట్ల చేతిలోనూ పరాజయాలు చవిచూసింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సైతం ఆ జట్టును మట్టికరిపించాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి సెమీస్ చేరని జట్లలో ఆస్ట్రేలియా, శ్రీలంకే కొంచెం మెరుగైన ప్రదర్శన చేశాయి. కానీ ఈసారి ఇంగ్లాండ్ ప్రదర్శన మాత్రం మరీ ఘోరంగా ఉంది.

ఆశలు వదులుకోవడమే

ఇంకా ఇంగ్లాండ్ సెమీస్ చేరుతుందని ఎవరైనా ఆశలు పెట్టుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆ జట్టు సాంకేతికంగా మాత్రమే సెమీస్ రేసులో ఉన్నట్లుగా కనిపిస్తోంది. 5 మ్యాచ్‌లు ఆడి నాలుగు ఓడటమే కాక నెట్ రన్‌రేట్‌ (-1.634)లో బాగా వెనుకబడి ఉంది ఇంగ్లాండ్. అయిదుకు అయిదు మ్యాచ్‌ల్లో నెగ్గిన భారత్.. అయిదేసి మ్యాచ్‌లు ఆడి నాలుగు చొప్పున విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీస్ బెర్తులు వదిలే ఛాన్సే లేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఆస్ట్రేలియా జోరు మీదుంది. ఈ జట్లే టాప్-4లో నిలిచి సెమీస్ చేరతాయన్నది ప్రస్తుతానికి ఉన్న అంచనా. ఇంకా పాకిస్థాన్, శ్రీలంక సైతం సెమీస్ మీద ఆశలు పెట్టుకున్నాయి. ఇన్ని జట్లను కాదని ఇంగ్లాండ్ ముందంజ వేయాలంటే అద్భుతాలు జరగాలి. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఘనవిజయాలు సాధించడమే కాక.. ఇతర జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఇవన్నీ జరిగి ఇంగ్లాండ్ ముందంజ వేయడం అసాధ్యంగానే కనిపిస్తోంది.

బజ్‌బాల్ దెబ్బ కొట్టిందా?

బజ్‌బాల్.. బజ్‌బాల్.. రెండేళ్లుగా ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా మారిన మాట ఇది. దీన్ని ప్రవేశ పెట్టింది ఇంగ్లాండే. తొలి బంతి నుంచి దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టి మ్యాచ్‌లను సొంతం చేసుకోవడం ఈ విధానంలో భాగం. వికెట్లు పడ్డా దూకుడు తగ్గించకుండా బ్యాటింగ్ చేయడం.. బౌలింగ్‌లో కూడా వికెట్లు తీయడమే లక్ష్యంగా ఎటాకింగ్ ఫీల్డింగ్ పెట్టి, బౌలింగ్ చేయడం బజ్‌బల్ స్టైల్. టెస్టుల్లో ప్రవేశపెట్టాక దీనికొక పేరు, రూపం వచ్చాయి కానీ.. అంతకుముందు నుంచే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇంగ్లాండ్ ఇదే శైలిలో ఆడుతోంది. ఈ మధ్య మరింతగా దూకుడు పెంచింది. ఈ శైలితో ప్రత్యర్థులను బెదరగొట్టడం అలవాటుగా చేసుకున్న ఇంగ్లిష్ జట్టుకు భారత గడ్డపై మాత్రం ఏదీ కలిసి రావడం లేదు. ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టబోయే తనే ఒత్తిడిలో పడి మ్యాచ్‌లు చేజార్చుకుంది. అవసరమైనపుడు కుదురుగా ఆడటం పోయి.. దూకుడు పేరుతో వరుసగా వికెట్లు చేజార్చుకుని ఓటములు కొనితెచ్చుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌కు తన విధానాన్నే మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ ఈలోపు ప్రపంచకప్‌లో ఆ జట్టు కథ ముగిసేలా ఉంది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు