RCBW vs DCW: బెంగళూరుకు షాక్‌.. దిల్లీ ఘన విజయం

హ్యాట్రిక్‌పై కన్నేసిన బెంగళూరుకు దిల్లీ క్యాపిటల్స్‌ షాక్‌ ఇచ్చింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీని దిల్లీ జట్టు 25 పరుగుల తేడాతో ఓడించింది. 

Updated : 29 Feb 2024 23:11 IST

బెంగళూరు: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024)లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCBW)తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ (DCW) 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. స్మృతి మంధాన (74: 43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరిసినప్పటికీ మిగతవారు విఫలం కావడంతో ఆ జట్టు ఓటమిపాలైంది. సబ్బినేని మేఘన (36) ఫర్వాలేదనిపించింది. దిల్లీ బౌలర్లలో జెస్‌ జోనాస్సెన్ మూడు వికెట్లు పడగొట్టగా, మారిజానే కాప్‌, అరుంధతి రెడ్డి తలో రెండు వికెట్లు తీసి బెంగళూరు పతనాన్ని శాసించారు. ఆర్సీబీ జట్టు 15 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి 138 పరుగులతో విజయం దిశగా వెళుతున్న తరుణంలో.. దిల్లీ బౌలర్లు అనూహ్యంగా చెలరేగారు. దీంతో ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి 5 ఓవర్లలో బెంగళూరు 7 వికెట్లు కోల్పోయింది.      

అంతకు ముందు బ్యాటింగ్‌ చేసిన దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (50) అర్ధశతకంతో అదరగొట్టింది. ఓపెనర్‌ మెగ్ లానింగ్ (11) విఫలమైనా అలిస్ కాప్సే (46)తో కలిసి దూకుడుగా ఆడింది. మారిజానే కాప్ (32), జెస్ జోనాస్సెన్ (36*) రాణించారు. బెంగళూరు బౌలర్లలో సోఫీ డివైన్‌ 2, నాడిన్ డి క్లర్క్ 2, శ్రేయాంకా పాటిల్ ఒక వికెట్‌ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని