IPL 2024: దూకుడైన బ్యాటింగ్‌తోనే కప్‌ కొట్టగలం..: రికీ పాంటింగ్‌

ఒకప్పుడు నాణ్యమైన బౌలింగ్‌ వనరులు ఉంటే జట్టు గెలవడం సులువని భావించేవారు. కానీ, ఇప్పుడు బౌలింగ్‌ కాస్త ఫర్వాలేదనిపించినా.. లోతైన బ్యాటింగ్‌ ఉండాలని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా రికీ పాంటింగ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.

Updated : 17 Apr 2024 15:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్‌లో జట్టు గెలవాలంటే దూకుడైన బ్యాటింగ్‌ అవసరమని ఆసీస్‌ మాజీ కెప్టెన్, దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) వ్యాఖ్యానించాడు. ఇవాళ గుజరాత్‌తో దిల్లీ తలపడనున్న నేపథ్యంలో రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచితేనే బౌలర్లపై ఒత్తిడి తగ్గుతుందని వ్యాఖ్యానించాడు. 

‘‘హైదరాబాద్‌ వరుసగా భారీ స్కోర్లు చేసింది. కోల్‌కతా కూడా 270+ పరుగులు రాబట్టింది. బ్యాటింగ్‌పై ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ట్రావిస్‌ హెడ్‌ అలా వచ్చి వేగవంతమైన శతకం సాధించాడు. బ్యాటర్లలో ఆత్మవిశ్వాసం నింపకపోతే వారినుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌ను రాబట్టలేం. గతంలో ఐపీఎల్‌ లేదా బిగ్‌బాష్‌ వంటి మెగా టోర్నీలు బౌలింగ్‌ వనరులు బాగా ఉన్న జట్టే విజేతగా నిలిచిన సందర్భాలను చూశాం. కానీ, ఈసారి మాత్రం ఐపీఎల్‌లో విజేతగా నిలవాలంటే మాత్రం బ్యాటింగ్‌ లోతుగా ఉంటేనే సాధ్యమవుతుంది. కొత్త నిబంధనలు కూడా అందుకు అనుకూలంగా ఉన్నాయనిపిస్తోంది. బౌలర్లపై ఎదురుదాడి చేసి భారీ స్కోరు చేస్తే విజయం సాధించడం తేలికవుతుంది’’ అని పాంటింగ్‌ తెలిపాడు. ప్రస్తుత ఎడిషన్‌లో తొమ్మిది మ్యాచుల్లో 200+ స్కోర్లను లక్ష్యంగా నిర్దేశించాయి. హైదరాబాద్‌ జట్టు రెండుసార్లు 275+ స్కోర్లు చేసిన జట్టుగా అవతరించింది. అత్యధిక పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్‌ (287/3) కొనసాగుతోంది.


బట్లర్.. అద్భుతమైన అథ్లెట్‌: టామ్‌ మూడీ

కోల్‌కతాపై అద్భుత శతకంతో రాజస్థాన్‌ను గెలిపించిన జోస్ బట్లర్‌పై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా ఆసీస్‌ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ టామ్‌ మూడీ స్పందిస్తూ.. ‘‘జోస్ బట్లర్ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు మంచి అథ్లెట్‌. తన ఆటలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. టీ20 క్రికెట్‌ సహా ఇతర ఫార్మాట్‌లోనైనా ఫిట్‌నెస్‌ చాలా కీలకం. నైపుణ్యం ఉన్నంత మాత్రాన సరిపోదు. టైమింగ్‌తోపాటు వికెట్ల మధ్య పరిగెత్తడం కూడా చేయాలి. అంతకుముందు అనారోగ్యం కారణంగా పంజాబ్‌తో మ్యాచ్‌కు దూరమైన అతడు.. త్వరగానే కోలుకొని ఈ మ్యాచ్‌లో ఆడాడు. దానికి కారణం అతడి ఫిట్‌నెస్‌. మైదానంలో మానసికంగానూ బలంగా ఉండటం చాలా అవసరం. అప్పుడే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడేందుకు సాధ్యమవుతుంది’’ అని టామ్‌ మూడీ వ్యాఖ్యానించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని