Delhi vs Hyderabad: దిల్లీ కోటలో తొలి మ్యాచ్‌.. హైదరాబాద్‌ దూకుడు కొనసాగేనా?

అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్‌ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమవుతోంది. 

Updated : 20 Apr 2024 15:03 IST

దూకుడే ఆయుధంగా దుమ్ము రేపుతోంది హైదరాబాద్‌. ప్రత్యర్థి ఎవరన్నది లెక్క చేయకుండా ‘భారీ’ స్కోర్ల రికార్డులను తిరగరాస్తూ చెలరేగుతోంది. మరోవైపు వరుసగా రెండు విజయాలు సాధించి హ్యాట్రిక్‌పై కన్నేసిన దిల్లీ.. ఇరు జట్ల మధ్య పోరుకు వేదికగా అరుణ్‌జైట్లీ స్టేడియం నిలిచింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇక్కడ తొలి మ్యాచ్‌ కావడం విశేషం. 

ఇక్కడ నలుగురు X అక్కడ నలుగురు

హైదరాబాద్‌ జట్టు విజయాల్లో ప్రధానంగా నలుగురు బ్యాటర్లు కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ - అభిషేక్ శర్మ ఫటాఫట్‌ శుభారంభం అందిస్తుంటే.. హెన్రిచ్ క్లాసెన్ - నితీశ్‌ రెడ్డి మిగతా పని పూర్తి చేసేస్తున్నారు. గత మ్యాచ్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్‌ను అడ్డుకోవడం దిల్లీ బౌలర్లకు సవాలే. ప్రతీ మ్యాచ్‌లోనూ అభిషేక్ శర్మ తక్కువ బంతుల్లోనే భారీగా పరుగులు రాబట్టేస్తున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధిస్తున్న టాప్-15 జాబితాలో క్లాసెన్ 8వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఆరు మ్యాచుల్లో  253 పరుగులు సాధించాడు. హెడ్ కూడా (235) దూసుకొస్తున్నాడు. అలాగని మార్‌క్రమ్‌, అబ్దుల్‌ సమద్ ఆటను తక్కువ చేయడానికి లేదు. గత మ్యాచ్‌లో సమద్‌ కూడా రెచ్చిపోయాడు. దిల్లీ బౌలింగ్‌ విభాగం నలుగురిపై నడుస్తోంది. పేసర్లు ఖలీల్ అహ్మద్‌, ముకేశ్‌కుమార్‌, ఇషాంత్‌శర్మతోపాటు స్పిన్నర్‌ కుల్‌దీప్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అక్షర్ పటేల్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఖలీల్‌ ఆ జట్టులో టాప్‌ వికెట్ టేకర్. ఏడు మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచ్‌లో గుజరాత్‌ను 89 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఉత్సాహంలో దిల్లీ ఉంది. విదేశీ ప్లేయర్‌ ట్రిస్టన్ స్టబ్స్ కూడా బంతితో మెరిపించడం గమనార్హం. 

ఆ ఇద్దరినీ అడ్డుకొంటే చాలు..

దిల్లీ జట్టులో బ్యాటింగ్‌ విభాగం గొప్పగా ఏమీ లేదు. ఎక్కువగా కెప్టెన్ రిషభ్‌ పంత్‌తోపాటు కొత్త ఆటగాడు జేక్‌ ఫ్రేజర్‌పై ఆధారపడుతోంది. స్టబ్స్‌, పృథ్వీ షా అడపాదడపా ఆడుతున్నా.. నిలకడ లేదు. కుర్రాళ్లు అభిషేక్‌ పోరెల్, సుమిత్‌ కుమార్ ప్రభావం చూపించడం లేదు. డేవిడ్ వార్నర్‌ ఆడేది అనుమానమే. అతడు లేకుండా బరిలోకి దిగే దిల్లీ.. బలమైన బౌలింగ్‌ ఉన్న హైదరాబాద్‌ను అడ్డుకొని మెరుగైన స్కోరు చేయడం సాహసమే అని చెప్పాలి. సీనియర్ పేసర్ భువనేశ్వర్‌కుమార్‌ పవర్‌ప్లేలో వికెట్లు తీయగల స్పెషలిస్ట్. కెప్టెన్ పాట్ కమిన్స్ తన పాత్రకు న్యాయం చేయడంలో ఇప్పటికే సక్సెస్ అయ్యాడు. ఆరు మ్యాచుల్లో 9 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ రేసులో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉండే దిల్లీ పిచ్‌పై వీరి ప్రదర్శనే కీలకం కానుంది. జయ్‌దేవ్, నటరాజన్‌, మయాంక్‌ మార్కండే కూడా తలో చేయి వేస్తే దిల్లీని కట్టడి చేయడం పెద్ద కష్టమేం కాదు. 

డేవిడ్ వార్నర్ కష్టమేనా? 

దిల్లీతో మ్యాచ్‌ అంటే ఠక్కున గుర్తుకొచ్చే ఆటగాడు డేవిడ్ వార్నర్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సారథిగా డేవిడ్ వార్నర్ తెలుగు క్రికెట్ అభిమానులకు సుపరిచితుడు. అతడి ఇన్‌స్టాగ్రామ్‌లో టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన హిట్‌ డైలాగులకు యాక్షన్ చేసి నవ్వులు పూయించాడు. అలాంటి క్రికెటర్‌ను హైదరాబాద్‌ కెప్టెన్సీ నుంచి తొలగించడంతోపాటు జట్టు నుంచి తప్పించింది. తర్వాత దిల్లీ సారథిగా వెళ్లిన అతడు హైదరాబాద్‌పై మాత్రం చెలరేగిపోతుంటాడు. కానీ, చేతి వేలికి గాయం కావడంతో ఈ సీజన్‌లో గుజరాత్‌ మ్యాచ్‌లో వార్నర్ ఆడలేదు. అతడి గాయానికి స్కానింగ్‌ తీయగా.. ఎలాంటి ఫ్రాక్చర్ లేదు. కానీ, వేలి వాపుతో బాధపడుతున్నాడు. దీంతో హైదరాబాద్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం కష్టమేనని దిల్లీ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

పిచ్‌ పరిస్థితి.. 

ఐపీఎల్ 17వ సీజన్‌లో దిల్లీ వేదికగా జరగబోయే తొలి మ్యాచ్‌ ఇదే. ఇంతకుముందు మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో సగం మ్యాచ్‌లు ఇక్కడే జరిగాయి. దీంతో మైదానాన్ని సిద్ధం చేసేందుకు సమయం పట్టింది. డబ్ల్యూపీఎల్‌లో కొన్ని మ్యాచుల్లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ... టోర్నీ సాగే కొద్దీ పిచ్‌ మందకొడిగా మారిపోయింది. పేస్‌తోపాటు స్పిన్‌కూ అనుకూలంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఇప్పటివరకు ఇరు జట్లూ 23 మ్యాచుల్లో తలపడగా.. దిల్లీనే 12-11తో ఆధిక్యంలో నిలిచింది. గత ఆరు మ్యాచుల్లో హైదరాబాద్‌పై దిల్లీ ఐదింట్లో గెలిచింది. 

తుది జట్లు (అంచనా): 

దిల్లీ: పృథ్వీ షా, సుమిత్ కుమార్, జేక్ ఫ్రేజర్, ట్రిస్టన్ స్టబ్స్, షై హోప్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్‌, ఖలీల్ అహ్మద్. ఇంపాక్ట్‌ ప్లేయర్‌: అభిషేక్ పోరెల్.

హైదరాబాద్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐదెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, నితీశ్‌ రెడ్డి, షహ్‌బాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (వికెట్ కీపర్), భువనేశ్వర్ కుమార్, జయ్‌దేవ్ ఉనద్కత్, నటరాజన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని