Delhi Vs Kolkata: వైజాగ్‌లో చివరి మ్యాచ్‌.. ఈసారి విజయం ఎవరిదో?

విశాఖపట్నం క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో మ్యాచ్‌ సిద్ధమైంది. కోల్‌కతాతో దిల్లీ తలపడనుంది.

Published : 03 Apr 2024 16:25 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌లో వైజాగ్ అభిమానులను అలరించేందుకు మరో మ్యాచ్‌ సిద్ధమైంది. దిల్లీ - కోల్‌కతా జట్లు తలపడనున్నాయి. ఇదే మైదానంలో చెన్నైను ఓడించిన ఉత్సాహంతో దిల్లీ బరిలోకి దిగుతోంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచిన కోల్‌కతా హ్యాట్రిక్‌పై కన్నేసింది. విశాఖ వేదికగా ఈ ఎడిషన్‌లో ఇదే చివరి మ్యాచ్‌ కావడంతో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తిగా మారింది.

దాదాపు ఐదేళ్ల తర్వాత విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఐపీఎల్‌ను చూసే అవకాశం అభిమానులకు దక్కింది. దిల్లీ తన రెండో సొంత మైదానంగా దీనిని ఎంపిక చేసుకుంది. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. రిషభ్‌ పంత్‌ నాయకత్వంలోని ఆ జట్టు గెలిచినా.. అభిమానుల మద్దతు మాత్రం చెన్నైకు ఉండటం విశేషం. దానికి కారణం ఎంఎస్ ధోనీ. దాదాపు సంవత్సరం తర్వాత బ్యాటింగ్‌ చేసిన అతడు ఈ మ్యాచ్‌లో విజృంభించాడు. తమ అభిమాన జట్టు ఓడిపోయినా..  ధోనీ ఇన్నింగ్స్‌తో అభిమానులు సంతోషంగా ఇంటికెళ్లారు. ఇప్పుడు కోల్‌కతాతో దిల్లీ తలపడనున్న నేపథ్యంలో అందరి దృష్టి రిషభ్‌ పంత్‌పైనే ఉంది. చెన్నైపై హాఫ్‌ సెంచరీ సాధించిన అతడి నుంచి మరోసారి అలాంటి ప్రదర్శననే కోరుకోవడం సహజమే. డేవిడ్ వార్నర్‌ ఎలానూ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన పృథ్వీ షా ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. తనపై  ఉన్న అంచనాలను అందుకున్నాడు. అయితే, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ మాత్రం తన స్థాయికి తగ్గట్లు రాణించలేదు. బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, కుల్‌దీప్, ముకేశ్‌ ఉత్తమ ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఆన్రిచ్‌ నోకియా మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. 

మిచెల్‌ ఏం చేస్తాడో? 

కోల్‌కతా తాను ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి ఊపు మీదుంది. కానీ, ఒకే ఒక్క ఆటగాడు మాత్రం ఘోరంగా విఫలమై నిరాశపరుస్తున్నాడు. మినీ వేలంలో దాదాపు పాతిక కోట్లు పెట్టి దక్కించుకున్న మిచెల్ స్టార్క్‌ మాత్రం రెండు మ్యాచుల్లోనూ ప్రభావం చూపించలేదు. వంద పరుగులు ఇచ్చి ఒక్క వికెట్టూ తీయలేదు. ఈసారి మ్యాచ్‌లోనైనా వికెట్ల ఖాతా తెరుస్తాడని కోల్‌కతా అభిమాననులు ఎదురుచూస్తున్నారు. యువ బౌలర్‌ హర్షిత్ రాణా పేస్‌ భారాన్ని మోస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో కోల్‌కతాకు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. ఫిల్‌ సాల్ట్, నరైన్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రి రస్సెల్, రింకు సింగ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌పై రస్సెల్‌ భీకర ఇన్నింగ్స్‌తో హడలెత్తించిన సంగతి తెలిసిందే. అయితే, కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్, నితీశ్‌ రాణా నుంచి భారీ ఇన్నింగ్స్‌లు బాకీ ఉన్నాయి. 

పిచ్‌ పరిస్థితేంటి?

వైజాగ్‌ పిచ్‌ బౌలర్లకే కాస్త అనుకూలంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ఫ్లడ్‌లైట్ల వెలుతురు స్వింగ్ బౌలర్లు మంచి ప్రదర్శన చేసే అవకాశం లేకపోలేదు. అలాగని బ్యాటర్లకు సహకరించదని కాదు. క్రీజ్‌లో కాసేపు కుదురుకుంటే పరుగులు రాబట్టవచ్చని రిషభ్‌ పంత్‌ నిరూపించాడు. విశాఖపట్నంలోని తేమ, వేడి వాతావరణంతో పిచ్‌ ఎలా టర్న్‌ అవుతుందనేది కూడా కచ్చితంగా చెప్పడమూ కష్టమే. 

తుది జట్లు (అంచనా)

దిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషభ్‌ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్‌ పటేల్, అన్రిచ్ నోకియా, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

కోల్‌కతా: ఫిలిప్‌ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్‌ అయ్యర్ (కెప్టెన్), రమణ్‌దీప్‌ సింగ్, రింకు సింగ్, ఆండ్రి రస్సెల్, సునీల్ నరైన్, మిచెల్ స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్‌ చక్రవర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని