Gujarat vs Delhi: గుజరాత్‌ను వణికించిన దిల్లీ

దిల్లీ అదరగొట్టింది. ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 17 Apr 2024 23:43 IST

అహ్మదాబాద్: దిల్లీ అదరగొట్టింది. ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత దిల్లీ బౌలర్లు చెలరేగడంతో 17.3 ఓవర్లలో గుజరాత్ 89 పరుగులకే కుప్పకూలింది. రషీద్ ఖాన్ (31) టాప్‌ స్కోరర్‌. 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంత్ సేన 8.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జేక్ ఫ్రేజర్ (20; 10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), షై హోప్ (19; 10 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), అభిషేక్ పొరెల్ (15; 7 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్ (16*; 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) దూకుడుగా ఆడారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 2, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు. 

లక్ష్యఛేదనకు దిగిన దిల్లీ.. జేక్ ఫ్రేజర్ దూకుడుగా ఆడటంతో 1.5 ఓవర్లకే 25 పరుగులు చేసింది. స్పెన్సర్‌ జాన్సన్‌ వేసిన రెండో ఓవర్‌లో చివరి బంతికి ఫ్రేజర్‌ అభినవ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. సందీప్ వేసిన తర్వాతి ఓవర్‌లో పృథ్వీ షా (7) వెనుదిరిగాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన అభిషేక్ పొరెల్, షై హోప్‌ కూడా ధాటిగా ఆడారు. సందీప్ వేసిన ఐదో ఓవర్‌లో హోప్ తొలి మూడు బంతులకు వరుసగా 4, 6, 6 బాదేశాడు. ఇదే ఓవర్‌లో అభిషేక్ ఓ సిక్సర్ బాది క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.  హోప్‌ను రషీద్‌ ఖాన్‌ వెనక్కి పంపాడు. అప్పటికే దిల్లీ లక్ష్యానికి చేరువగా పంత్, సుమిత్ (9) లాంఛనాన్ని పూర్తి చేశారు. 

హడలెత్తించిన దిల్లీ బౌలర్లు 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌.. దిల్లీ బౌలర్ల ధాటికి కుదేలైంది. ముకేశ్‌ కుమార్‌ (3/14), ఇషాంత్ శర్మ (2/8), ట్రిస్టన్ స్టబ్స్‌ (2/11) గుజరాత్‌ పతనాన్ని శాసించారు. దిల్లీ బౌలర్ల ధాటికి రషీద్‌ ఖాన్‌తోపాటు సాయి సుదర్శన్ (12), రాహుల్  తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ (8)ని ఇషాంత్ శర్మ ఔట్ చేయడంతో గుజరాత్  వికెట్ల పతనం మొదలైంది. ముకేశ్ కుమార్ వేసిన నాలుగో ఓవర్‌ ఐదో బంతిని వృద్ధిమాన్ సాహా (2) వికెట్ల మీదికి ఆడుకున్నాడు. ఇషాంత్ వేసిన ఐదో ఓవర్‌ ఆరంభంలో సుదర్శన్‌ రనౌట్‌ కాగా.. అదే ఓవర్‌లో చివరి బంతికి డేవిడ్ మిల్లర్ (2) వెనుదిరిగాడు. రిషభ్ పంత్‌ అద్భుతంగా డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకోవడంతో మిల్లర్ ఔటయ్యాడు. 

వరుసగా వికెట్లు పడటంతో గుజరాత్‌ స్కోరు వేగం నెమ్మదించింది. ఈ క్రమంలో పంత్ స్టబ్స్‌ చేతికి బంతి ఇచ్చి ఫలితం రాబట్టాడు. అతడు వేసిన తొమ్మిదో ఓవర్‌లో అభినవ్ మనోహర్ (8), షారూఖ్‌ ఖాన్‌ (0)ను పంత్‌ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. రాహుల్ తెవాటియాను అక్షర్ పటేల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 14 బంతులు ఆడిన మోహిత్ శర్మ (2)ను ఖలీల్ వెనక్కి పంపాడు. ఒంటరి పోరాటం చేస్తున్న రషీద్‌ను, నూర్ అహ్మద్‌ (1)ను ముకేశ్‌ ఒకే ఓవర్‌లో ఔట్ చేయడంతో గుజరాత్ ఆలౌటైంది. 

  • ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌కిదే అత్యల్ప స్కోరు. ఈ సీజన్‌లో ఒక జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా ఇదే. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని