Delhi vs Gujarat: పోరాడిన గుజరాత్‌.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం

గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో దిల్లీ 4 పరుగుల తేడాతో నెగ్గింది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది.  

Updated : 25 Apr 2024 00:21 IST

దిల్లీ: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో దిల్లీకి నాలుగో విజయం. గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ.. 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ 8 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (65; 39 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో మెరిశాడు. డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వృద్ధిమాన్ సాహా (39; 25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. చివర్లో రషీద్ ఖాన్‌ (21*; 11 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సాయి కిశోర్ (13; 6 బంతుల్లో 2 సిక్స్‌లు) పోరాడినా గుజరాత్‌కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 19 పరుగులు అవసరం కాగా.. రషీద్ మొదటి రెండు బంతులను బౌండరీకి పంపాడు. తర్వాతి రెండు బంతులకు పరుగులేమీ రాలేదు. ఐదో బంతికి సిక్స్‌. చివరి బంతికి విజయ సమీకరణం ఐదు పరుగులు కాగా రషీద్ ఖాన్‌ సింగిల్‌ కూడా తీయలేకపోయాడు. దిల్లీ బౌలర్లలో రషిక్ సలామ్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, నోకియా, ముకేశ్‌ కుమార్, అక్షర్ పటేల్‌కు ఒక్కో వికెట్ దక్కింది.  

చెలరేగిన పంత్, అక్షర్ 

తొలుత దిల్లీ తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించినా.. రిషభ్ పంత్ (88*; 43 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు), అక్షర్ పటేల్ (66; 43 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో భారీ స్కోరు చేసింది. ఊపుమీద కనిపించిన ఓపెనర్ జేక్ ఫ్రేజర్ (23; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పృథ్వీ షా (11), షై హోప్ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో అక్షర్‌, పంత్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 113 పరుగులు జోడించింది. అక్షర్ ఔటైన తర్వాత వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్‌ (26; 7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో పంత్‌ చివరి ఐదు బంతులకు వరుసగా 6, 4, 6, 6, 6 బాదేశాడు. దిల్లీ చివరి రెండు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు రాబట్టడం విశేషం. గుజరాత్ బౌలర్లలో సందీప్‌ వారియర్ 3, నూర్ అహ్మద్‌ ఒక వికెట్ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని