MS Dhoni - Rohit: ఆ విషయంలో ఎంఎస్ ధోనీ - రోహిత్ శర్మ ఒకటే: కైఫ్‌

టీ20 ప్రపంచ కప్‌ కోసం ఇప్పటికే టీమ్‌ఇండియా అమెరికాకు చేరిన సంగతి తెలిసిందే. వార్మప్ మ్యాచ్‌లో అదరగొట్టిన భారత్‌.. అసలైన పోరుకు సిద్ధమవుతోంది.

Published : 03 Jun 2024 14:13 IST

ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీని, గేమ్‌ను అర్థం చేసుకోవడంలో ఎంఎస్ ధోనీకి (MS Dhoni) తిరుగులేదని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్‌ వ్యాఖ్యానించాడు. అతడి బాటలోనే ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ముందుకుసాగుతున్నాడని కైఫ్ పేర్కొన్నాడు. వీరిద్దరూ సాంకేతిక అంశాలను క్రికెట్‌లో వాడుకోవడంలో ముందున్నారని తెలిపాడు. ధోనీ మిగతా వారందరికీ మినహాయింపు, రోహిత్ కూడా ఇందులో మాస్టర్స్‌ చేసినట్లు అనిపిస్తోందని చెప్పాడు. 

‘‘మ్యాచ్‌లో టెక్నాలజీ, కామన్‌సెన్స్‌ను బ్యాలెన్స్‌ చేయడాన్ని ధోనీ, రోహిత్ సాధించారు. గేమ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో కంప్యూటర్‌ కూడా అంచనా వేయలేదు. ఆటగాళ్లు, సిబ్బంది ఎన్నిసార్లు చర్చించినా వేస్టే. ఆ మ్యాచ్‌ రోజు తీవ్ర ఒత్తిడిలోనూ ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించడం అత్యంత కీలకం. మానసికంగా మనం ఎంత బలంగా ఉన్నామనేది తెలియజేస్తుంది. ఇందులో ధోనీని మించిన ఉదాహరణ మరెవరూ ఉండరు. నాయకుడిగా ధోనీ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. చివరి ఓవర్‌ సమయంలో బౌలర్‌ చాలా ఒత్తిడిలో ఉంటాడు. అయితే, ధోనీ చూసే విధానం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకవేళ బౌలర్‌ సిక్స్ ఇచ్చినా.. మరొక బంతి వరకూ వెయిట్ చేయ్‌ అని చెబుతాడు. ఇలా అందరూ చెప్పలేరు. ఆటగాళ్లకు ఇలాంటి స్వేచ్ఛ ఇస్తే వారి మైండ్‌సెట్‌ కూడా మారిపోతుంది. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు అవకాశం ఉంటుంది’’ అని కైఫ్ వెల్లడించాడు.

ఆటగాళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవు!

భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లకు ఉగ్ర ముప్పు ఉందనే వార్తల నేపథ్యంలో ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లు కూడా  న్యూయార్క్‌ వీధుల్లో తిరుగుతున్న ఫొటోలు వైరల్‌గా మారాయి. ప్లేయర్లపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ అనంతరం క్రికెటర్లు సరదాగా గడిపారు. జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమ్‌ఇడియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని