MS Dhoni: ధోనీకి ఆ పరిస్థితి రాదు.. క్రికెటే జీవితం కాదనే విషయం అతడికి తెలుసు: జహీర్

భారత్‌కు రెండు వరల్డ్‌ కప్‌లు, ఛాంపియన్స్‌ ట్రోఫీ.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐపీఎల్‌లో ఐదుసార్లు విజేతగా నిలిపిన ‘కెప్టెన్‌’ కూల్ ఎంఎస్ ధోనీ (MS Dhoni). క్రికెట్ పట్ల అభిరుచి ఎంతలా ఉంటుందో.. మిగతా విషయాల్లోనూ పక్కా ప్రణాళికతో ఉండటం విశేషం.

Published : 21 Mar 2024 00:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ ప్రతీ నిర్ణయం వెనక ఎంతో ఆలోచన ఉంటుంది. ఎప్పుడు తన కెప్టెన్సీని త్యజించాలి.. ఎప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనే విషయాలే దానికి ఉదాహరణ. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో మాత్రమే ధోనీ ఆడుతున్నాడు. గత రెండు సీజన్ల నుంచి ఈసారే చివరిదని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ధోనీ మాత్రం ఆడేస్తూ అవన్నీ పుకార్లేనని నిరూపించాడు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వినిపిస్తున్నా ధోనీ అభిమానులు మాత్రం కొట్టిపడేస్తున్నారు. ఈక్రమంలో భారత మాజీ క్రికెటర్లు జహీర్‌ ఖాన్‌, సురేశ్‌ రైనా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

‘‘క్రికెటే సర్వస్వం కాదని ధోనీ చాన్నాళ్ల కిందటే అర్థం చేసుకున్నాడు. ఆటపట్ల అతడికున్న అభిరుచి అద్భుతం. తన జీవితంలో క్రికెట్‌ను భాగం మాత్రమే చేసుకున్నాడు. ఇదే అంతా అని మాత్రం అనుకోలేదు. ప్రతీ క్రికెటర్‌కు ఇలాంటి దశ తప్పదు. ఎందుకంటే ఒక్కసారి గేమ్‌ నుంచి బయటకొచ్చాక.. ఏం చేయాలనే దానికి పెద్దగా ఆప్షన్లు ఉండవు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కష్టాలు పడిన చాలామంది అథ్లెట్లను చూశా. ఆట కోసం తమ సర్వస్వం ధారపోసినా, రిటైర్‌మెంట్‌ తర్వాత ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడ్డారు. ధోనీకి మాత్రం ఇలా జరగదు. దానికి కారణం క్రీడేతర అంశాల్లోనూ ఆసక్తి చూపాడు. ఉదాహరణకు బైక్స్‌ అంటే అతడికి చాలా ఇష్టం. వాటిపై ఎప్పుడూ పరిశోధిస్తూనే ఉంటాడు’’ అని జహీర్ తెలిపాడు. 

ధోనీ మరో ఐదేళ్లు ఆడాలి: రైనా

‘‘చెన్నై సూపర్ కింగ్స్‌ అభిమానుల్లోనే కాకుండా అందరిలోనూ మెదిలే ప్రశ్న ఏంటంటే.. తర్వాత కెప్టెన్‌ ఎవరు? ఒకవేళ ఎంఎస్ ధోనీ తనంతట తానే కెప్టెన్సీ నుంచి దిగిపోయి డగౌట్‌లో కూర్చున్నాడనుకుందాం. అతడి స్థానాన్ని భర్తీ చేసేదెవరు? ఈ సీజన్‌ సీఎస్కేకు అత్యంత కీలకం. ధోనీ కన్ను ఎవరి మీద పడుతుందో చూడాలి. రుతురాజ్‌ గైక్వాడ్ మంచి ఆప్షన్. ఈ ఏడాది ధోనీకి డిప్యూటీగా వచ్చే వారికే వచ్చే సీజన్‌లో అవకాశం ఉంటుంది. అయితే, నా వరకైతే ధోనీ మరో ఐదేళ్లపాటు ఆడితే బాగుంటుంది. కనీసం రెండు లేదా మూడేళ్లయినా. ప్రస్తుతం అతడి వయసు 42 ఏళ్లు. ధోనీ ఫిట్‌నెస్‌ స్థాయి మనందరికీ తెలుసు’’ అని సీఎస్కే ఒకప్పటి సహచరుడు రైనా వ్యాఖ్యానించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని