Team India: ఈ సారైనా చేజిక్కేనా.. టీమ్‌ఇండియాకు అందని ద్రాక్షగా డబ్ల్యూటీసీ టైటిల్‌!

ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సత్తాచాటుతున్న టీమ్‌ఇండియాను.. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) టైటిల్‌ మాత్రం ఊరిస్తూనే ఉంది.

Published : 10 Mar 2024 16:20 IST

ఇంటా, బయట టెస్టుల్లో నిలకడగా విజయాలు.. బలమైన జట్లపై ఆధిపత్యం. తిరుగులేని ఆటతీరుతో.. అద్భుతమైన ప్రదర్శనతో.. సుదీర్ఘ ఫార్మాట్లో టీమ్‌ఇండియా పెత్తనం చలాయిస్తోంది. తాజాగా బజ్‌బాల్‌తో భయపెట్టే పటిష్ఠమైన ఇంగ్లాండ్‌ను భారత జట్టు సొంతగడ్డపై అయిదు టెస్టుల సిరీస్‌లో 4-1తో చిత్తుచేసింది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో సత్తాచాటుతున్న టీమ్‌ఇండియాను.. ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) టైటిల్‌ మాత్రం ఊరిస్తూనే ఉంది. ఇప్పుడు మరోసారి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకున్న రోహిత్‌ సేన.. వరుసగా మూడో ఫైనల్‌ చేరే దారిలో సాగుతోంది. 

ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి

అయిదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 4-1 తేడాతో చిత్తుచేయడం టీమ్‌ఇండియాకు కలిసొచ్చింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరడమే కాదు.. మిగతా జట్లతో పోలిస్తే తుదిపోరు చేరేందుకు అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. డబ్ల్యూటీసీ 2023- 25 చక్రంలో ద్వైపాక్షిక సిరీస్‌లు అన్నీ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు.. టైటిల్‌ కోసం తలపడతాయి. ప్రస్తుతం ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో 9 మ్యాచ్‌లాడిన భారత్‌ 6 విజయాలు, ఓ డ్రా నమోదు చేసింది. రెండు మ్యాచ్‌ల్లో ఓడింది. దీంతో మొత్తం 74 పాయింట్లు, 68.51 పాయింట్ల శాతంతో ఉంది. రెండో స్థానంలో న్యూజిలాండ్‌ (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, రెండు ఓటములతో 60 పాయింట్ల శాతం) ఉంది. మూడో స్థానంలో ఆస్ట్రేలియా (11 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, మూడు ఓటములు, ఓ డ్రాతో 59.09 పాయింట్ల శాతం) కొనసాగుతోంది. కివీస్, ఆసీస్‌తో పోల్చి చూస్తే పాయింట్ల అంతరం పరంగా టీమ్‌ఇండియా మెరుగ్గా ఉంది. 

ఆ సవాలు దాటితే

ఈ సైకిల్‌లో భారత్‌ ఇప్పటికే వెస్టిండీస్‌ (2 టెస్టులు), దక్షిణాఫ్రికా (2), ఇంగ్లాండ్‌ (5)తో సిరీస్‌లు ఆడింది. ఇంకా బంగ్లాదేశ్‌ (2), న్యూజిలాండ్‌ (3), ఆస్ట్రేలియా (5)తో సిరీస్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో సిరీస్‌లు భారత్‌ సొంతగడ్డపై ఆడబోతోంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదనే చెప్పాలి. ఈ రెండు సిరీస్‌లనూ టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలోనే భారత్‌కు కఠిన సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాలో భారత్‌ టెస్టు సిరీస్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి ఎలాగైనా భారత్‌ను ఓడించాలనే కసితో ఆసీస్‌ ఉంది. పైగా కమిన్స్‌ సారథ్యంలో ఆ జట్టు పటిష్ఠంగా మారింది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా ఆసీస్‌ పరీక్షను దాటితే కచ్చితంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుతుంది. ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో జట్లు సాధించే ఒక్కో విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు దక్కుతాయి. మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా పాయింట్లలో కోత కూడా ఉంటుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఓ మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ కారణంగా భారత్‌కు 2 పాయింట్ల కోత పడింది. 

జోరు కొనసాగిస్తే

ప్రస్తుతం భారత జట్టు బలంగా ఉంది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కోహ్లి, షమి, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి కీలక ఆటగాళ్లు దూరమైనా యువ క్రికెటర్లు సత్తాచాటడం శుభపరిణామం. యువ ఆటగాళ్లు జోరుమీద ఉండటం టీమ్‌ఇండియాకు కలిసొచ్చే అంశం. ముఖ్యంగా సంచలన ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌.. 16 ఇన్నింగ్స్‌ల్లో 68.53 సగటుతో 1,028 పరుగులతో ఈ డబ్ల్యూటీసీ సైకిల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో అశ్విన్‌ (15 ఇన్నింగ్స్‌ల్లో 42 వికెట్లు) భారత్‌ తరపున టాప్‌ బౌలర్‌గా ఉన్నాడు. బుమ్రా 6 మ్యాచ్‌ల్లోనే 31 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రోహిత్, శుభ్‌మన్‌ కూడా రెండేసి శతకాలతో ఫామ్‌ చాటారు. ఈ ఆటగాళ్లు ఇదే జోరు కొనసాగిస్తే 2025 జూన్‌లో లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌ కచ్చితంగా తలపడుతుంది. 2021, 2023 ఫైనల్లో భారత్‌ వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. కానీ ఈ సారి మన జట్టు దూకుడు చూస్తుంటే డబ్ల్యూటీసీ టైటిల్‌ చేజిక్కించుకునేలా కనిపిస్తోంది. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని