Hardik Pandya: హార్దిక్‌ వరల్డ్‌ కప్‌లో కీలకమని.. నేనెప్పుడో చెప్పా: భారత మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచ కప్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో రాణించి ఆకట్టుకున్నాడు.

Published : 06 Jun 2024 09:50 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో తొలి మ్యాచ్‌ను టీమ్‌ఇండియా కైవసం చేసుకోవడంలో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో పాండ్య కీలకమైన 3 వికెట్లు తీయడంతోపాటు 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐపీఎల్‌లో అలాంటి ప్రదర్శన ఇచ్చిన తర్వాత.. పాండ్యపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అనూహ్యంగా పొట్టి కప్‌ సందర్భంగా భారత్‌ వార్మప్‌ మ్యాచ్‌ ఆడిన సంగతి తెలిసిందే. బంగ్లాపై అద్భుత ప్రదర్శనతో తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. ఇప్పుడు దానిని అమలు చేశాడు. పాండ్య నుంచి ఇలాంటి ఆటతీరును ముందే అంచనా వేసినట్లు భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. 

‘‘ఐర్లాండ్‌తో మ్యాచ్‌ ముందే కాదు.. గతంలోనూ చాలాసార్లు చెప్పా. వరల్డ్‌ కప్‌ టోర్నీల్లో హార్దిక్ పాండ్య ఆల్‌రౌండర్‌గా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు పోషిస్తాడు. 2019 వరల్డ్‌ కప్‌లోనూ ఇలాంటి ప్రదర్శనే చేశాడు. భారత్ - పాక్‌ వంటి పెద్ద మ్యాచుల్లోనూ రాణించాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన సెమీస్‌లో దూకుడుగా బ్యాటింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు వార్మప్‌ మ్యాచ్‌లోనూ, ఐర్లాండ్‌తో పోరులోనూ అదరగొట్టాడు. 

ఇప్పుడు చూస్తున్న హార్దిక్‌కు.. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా చేసిన అతడికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు బయట నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. జట్టులో వాతావరణం కూడా గొప్పగా లేదు. జాతీయ జట్టులోకి వచ్చాక చాలా రిలాక్స్‌గా అయిపోయాడు. అప్పటికి ఒత్తిడి ఉండదు. కాబట్టే, హార్దిక్‌ ప్రదర్శన నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. పెద్ద మ్యాచుల్లో హార్దిక్‌ రాణిస్తాడని బలంగా నమ్ముతా’’ అని మంజ్రేకర్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని